WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వైకాపా'కు షాక్‌ ఇచ్చిన 'గొట్టిపాటి'....!

ప్రకాశం జిల్లాల్లో ప్రతిపక్ష వైకాపాకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. రోజు రోజుకు పార్టీ బలహీనం కావడం ఒక సమస్య అయితే...పార్టీలో కొనసాగుతున్న నేతల మధ్య ఐక్యత లేకపోవడం మరో సమస్య. దీనికి తోడు పలు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలుగా ఉన్న నాయకులు తాము రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోమని చేతులు ఎత్తేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఆధిక్యం సాధించిన జిల్లాల్లో ప్రకాశం కూడా ఉంది. అప్పట్లో ఈ జిల్లా నుంచి వైకాపా తరుపున ఆరుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా అధికార టిడిపి మాత్రం ఐదు స్థానాలే గెలుపొందగలిగింది. తరువాత కాలంలో పలువురు ఎమ్మెల్యేలు వైకాపా నుంచి టిడిపిలో చేరారు. వీరి చేరికలతో అధికారపార్టీ బలం పెంచుకోగలిగింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా..జిల్లాలో ఉన్న మొత్తం 12 స్థానాల్లో అధికార టిడిపి 9 స్థానాల్లో విజయం సాధించగలదని వైకాపా కూడా అంగీకరిస్తోంది. దీంతో వైకాపా నాయకులు ఆత్మస్థైర్యం కోల్పోయి పోటీకి దూరంగా జరుగుతున్నారు.

  ఇటీవల 'దర్శి' నియోజకవర్గ ఇన్‌ఛార్జి 'బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి' తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఆయన అధినేత 'జగన్‌'తోనే చెప్పుకున్నారు. తాజాగా అదే దోవలో 'పర్చూరు' నియోజకవర్గ ఇన్‌ఛార్జి 'గొట్టిపాటి భరత్‌' నడుస్తున్నారు. తాను కూడా ఎన్నికల్లో పోటీ చేయనని, ఆయన పార్టీ నాయకులతో చెబుతున్నారట. పోటీకి కావాల్సిన ఆర్థిక వనరులు తన వద్ద లేవని, అందుకే పోటీ నుంచి విరమించుకుంటున్నానని చెబుతున్నారట. వాస్తవానికి ప్రస్తుతం 'పర్చూరు' నియోజకవర్గ ఎమ్మెల్యే 'ఏలూరి సాంబశివరావు'పై ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి నెలకొని ఉంది. గత ఎన్నికల్లో ఆయన గెలిచిన తరువాత నియోజకవర్గ ప్రజలకు దూరమయ్యారని, స్వంత వ్యాపారాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయనకు రాబోయే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇస్తే...తామే ఓడిస్తామని పలువురు టిడిపి కార్యకర్తలు, నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. 

  'ఏలూరి'పై ప్రజల్లో వ్యక్తం అవుతున్న వ్యతిరేకతను క్యాష్‌ చేసుకుని అధికార పార్టీని ముప్పు తిప్పలు పెట్టాల్సిన 'గొట్టిపాటి' ఎన్నికలు జరగముందే చేతులు ఎత్తేసి పార్టీకి షాక్‌ ఇచ్చారనే అభిప్రాయం స్థానిక వైకాపా నాయకుల్లో నెలకొని ఉంది. మాజీ ఎమ్మెల్యే 'గొట్టిపాటి నర్సయ్య' తనయుడు అయిన 'గొట్టిపాటి భరత్‌' 'ఏలూరి'కి వ్యతిరేకంగా పోటీకి దిగితే 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన సానుభూతిపరులు కూడా 'భరత్‌'కు మద్దతు ఇవ్వాలని భావించారు. అయితే ఆయన అనూహ్యంగా పోటీ నుంచి విరమించుకుంటానని ప్రకటించడంతో..ఇక్కడ...మరో నాయకున్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి వైకాపాలో నెలకొంది. మొత్తం మీద..గెలవడానికి అవకాశం ఉన్న చోటే..నాయకులు పోటీకి వెనుకంజ వేస్తుంటే...ఇక మిగిలిన చోట వైకాపా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా....'గొట్టిపాటి' 'బూచేపల్లి' బాటలో నడవడం అధినాయకత్వానికి రుచించడం లేదు. మరి దీన్ని 'జగన్‌' ఎలా సరిచేస్తారో..వేచి చూడాల్సి ఉంది.


(10931)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ