WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పెళ్లికానుక అత్తంటికా...పుట్టింటికా...!?

బడుగు,బలహీనవర్గాలకు చెందిన వారు వివాహాలు చేసుకునే సమయంలో ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వ కానుక పుట్టింటివారికి ఇవ్వాలా...? లేక అత్తంటివారికి ఇవ్వాలా..? అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్సీ 'అన్నం సతీష్‌' ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఈ కానుకలు మాకు చెందాలంటే..మాకు చెందాలని ఇరువర్గాలు పట్టుబడుతున్నాయి. పెళ్లి ఖర్చుల కింద వధువుకు ఇస్తున్నారు కనుక పుట్టింటివారు...అమ్మాయికి ఇస్తున్నారు కాబట్టి తమకే చెందాలని అత్తంటి వారు పట్టుబడుతున్నారు. ఈ తగాదాలను మీరే తీర్చాలని 'అన్నం సతీష్‌' ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. 


  దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా..వధువు,వరులు కూర్చుని ఏకాభిప్రాయానికి రావాలని చెప్పారు. టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు దీనిపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేయటం విశేషం. పెళ్లిఖర్చుల కోసం పెళ్లి కానుక ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి..పుట్టింటివారికే ఈ సొమ్ము చెందుతుందని కొందరు..అమ్మాయికి ఇస్తున్నారు కాబట్టి..అమ్మాయితోపాటు అత్తంటికి వెళుతుందని అభిప్రాయపడ్డారు. పెళ్లికానుకలపై ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టతలేకపోవడం విశేషం.


  ఇదే టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పంచాయితీరాజ్‌ కమీషనర్‌ రామాంజనేయులు మాట్లాడుతూ తెల్లరేషన్‌కార్డు ఉన్న కుటుంబాల్లో కోటా పెంచాల్సి ఉండగా..దాన్ని పెంచడం లేదని తెలిపారు. అమ్మాయికి పెళ్లి అయిన తరువాత ఆరు నెలల వరకు పుట్టింటి వారికే రేషన్‌ కోటా ఇచ్చి..ఆ తరువాత అత్తంటి వారికి ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుపుతూ పరిశీలించి అందుకు తగ్గ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ వ్యక్తం చేసిన అభిప్రాయంతో పాటు, గ్రామీణాభివృద్ధి కమీషనర్‌ రామాంజనేయులు వ్యక్తం చేసిన విషయాలపై త్వరలో పూర్తిస్థాయి ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహణలో ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టత లోపించిందనే విషయం బయటకు పొక్కడంతో సంబంధించిన అధికారులను, మంత్రులను పిలిచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్లాస్‌ తీసుకునే అవకాశం ఉందని ఆ సమావేశంలో పాల్గొన్న అధికారులు మీడియా వర్గాలతో తెలిపారు.

(195)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ