WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వంగవీటి' వైకాపాలో ఉన్నట్లా...లేనట్లా...!?

'వంగవీటి' ఒకప్పుడు ఈ పేరు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం. విజయవాడ ప్రాంతంలో అదో బ్రాండ్‌నేమ్‌...ఇప్పటికీ..! అటువంటి 'వంగవీటి' పేరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాదు కదా...రాష్ట్ర నూతన రాజధాని విజయవాడ ప్రాంతంలో కూడా సరిగా వినిపించడం లేదు..కనిపించడం లేదు. 'వంగవీటి రంగా' మృతి తరువాత..కొన్నాళ్లు ఆయన పేరును కొంత వరకు ఆయన భార్య నిలబెట్టినా..తరువాత ఆయన రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చిన 'వంగవీటి రాధాకృష్ణ' దాన్ని కొనసాగించలేకపోతున్నారు. ప్రత్యేక పరిస్థితులు ఉన్న విజయవాడ రాజకీయాల్లో 'వంగవీటి' తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నారు. తండ్రి పార్టీ అయిన కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి..'వంగవీటి' పేరును కొనసాగిస్తారనుకున్న 'రాధా' అనూహ్యంగా రాజకీయంగా తెరమరుగు అవుతున్నారు. యువకుడైన 'రాధా' తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంలో విఫలం అవుతున్నారనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకు ఈ విధంగా 'రాధా' తెరమరుగు అవుతున్నారనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యువకుడిగా 'రాధా' కొన్ని తప్పులు..దుందుడుకు చర్యలకు పాల్పడి..రాజకీయంగా దెబ్బతిన్నారనే అభిప్రాయం ఆయన అనుచరవర్గంలో నెలకొంది. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు..చేతిదాకా వచ్చిన మంత్రి పదవిని అనవసర వివాదాలతో దూరం చేసుకున్నారు...తరువాత...రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పులను అంచనా వేయక..పార్టీలు మారి ఆయన రాజకీయంగా దెబ్బతిన్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.

మూడుపార్టీల్లోకి 'వంగవీటి రాధా'...!

'వంగవీటి రంగా' తనయుడిగా రాజకీయాల్లో అరంగ్రేటం చేసిన 'రాధా' 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయన సులువుగా గెలుపొందారు. 'రంగా' కుమారుడిగా..ఉన్న ప్రజాధరణ, సానుభూతి, ప్రజావ్యతిరేకత, నియోజకవర్గంలో 'రంగా'కు ఉన్న ప్రాబల్యంతో ఆయన సునాయాసంగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత..ఆయన అదే ఊపును కొనసాగించలేకపోయారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డితో తండ్రికి ఉన్న సాన్నిహిత్యాన్ని 'రాధాకృష్ణ' వాడుకోలేక ఆయనకు దూరమయ్యారు. 'రంగా' అంటే అభిమానం ఉన్న 'వై.ఎస్‌' ఆయన కుమారుని దగ్గరకు తీయాలని చూసినా...'రాధాకృష్ణ' దాన్ని వాడుకోలేకపోయారు. అంతేకాకుండా పార్టీ మారి తప్పులు చేశారు. 'సినీనటుడు 'చిరంజీవి' 'ప్రజారాజ్యం' పార్టీ ప్రారంభిస్తే..దానిలోకి వెళ్లి ఘోరమైన తప్పిదం చేశారు. అప్పట్లో 'చిరంజీవి' పార్టీ గెలవడం కష్టమనే అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా...'రాధాకృష్ణ' అది గ్రహించక..ఆ పార్టీలోకి వెళ్లి చేతులు కాల్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ తరుపున 2009లో పోటీ చేసిన ఆయన ఘోరంగా ఓడిపోయారు. 2014 నాటికి ఆయన మళ్లీ 'వై.ఎస్‌. తనయుడు వై.ఎస్‌.జగన్‌ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్నారు.

మూడు నియోజకవర్గాల్లో పోటీ...!

తొలుత కాంగ్రెస్‌ పార్టీ తరుపున 'రాధాకృష్ణ' బరిలోకి దిగి విజయవాడ 'తూర్పు'లో గెలుపొందారు. అనాది నుంచి ఆ నియోజకవర్గం 'వంగవీటి' కుటుంబానికి అండగానే ఉంది. అటువంటి నియోజకవర్గాన్ని వదలి తరువాత ఆయన 'విజయవాడ' సెంట్రల్‌ నుంచి పోటీ చేశారు. 'ప్రజారాజ్యం' పార్టీ తరుపున 'విజయవాడ' సెంట్రల్‌లో పోటీ చేసిన 'రాధా' పరాజయం పాలయ్యారు. ఒకప్పుడు తన తండ్రి వద్ద పనిచేసిన 'మల్లాది విష్ణు'పై ఆయన 848 తేడాతో ఓటమి చెందారు. ఇక 2014లో తనకు పట్టులేని 'తూర్పు'లో సీనియర్‌ టిడిపి నేత 'గద్దె రామ్మోహన్‌'పై పరాజయం పాలయ్యారు. సుమారు 15,503 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. దీంతో విజయవాడలో 'వంగవీటి' కుటుంబం పట్టుకోల్పోయిందన్న భావన అన్ని వర్గాల్లో వ్యక్తం అవుతుంది. అంతే కాకుండా వైకాపాలోనూ ఆయనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. తాజాగా ఆ పార్టీలో ఆయన కొనసాగుతున్నా..ఆయనను పట్టించుకునేవారే కరవయ్యారు. పార్టీలో ఆయన ఉన్నట్లా..లేనట్లా..? అన్నచందంగా ఆయన పరిస్థితి కొనసాగుతోంది. ఇదే సమయంలో విజయవాడ వైకాపా నాయకుడు తన తండ్రి 'రంగా'పై చేసిన వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసినా..ఆయనను పార్టీ అధిష్టానం పార్టీ నుంచి తప్పించలేదు. దీంతో పార్టీలో 'రాధాకృష్ణ' ఉంటే ఉండమన్నట్లు లేకపోతే పొమ్మనట్లుగా అధిష్టానం వ్యవహరిస్తోంది. అవసరమైనప్పుడు 'రాధాకృష్ణ'ను పార్టీ వాడుకుంటోందని...అవసరం లేకపోతే పట్టించుకోవడం లేదనే భావన 'రాధా' వర్గీయుల్లో ఉంది.

  కాగా ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఆయన రాజకీయవైఖరి ఏమిటో..ఎవరికీ అంతుబట్టడం లేదు. ప్రస్తుతానికి ఆయన వైకాపా నాయకుడే అయినా...ఆ పార్టీలో కొనసాగలేని పరిస్థితి ఆయనకు ఉంది. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన 'మల్లాది విష్ణు' వైకాపాలో చేరడం, బిజెపి నాయకుడు 'వెల్లంపల్లి శ్రీనివాస్‌' కూడా చేరడంతో..'వంగవీటి'కి టిక్కెట్‌ దొరుకుతుందా..? లేదా..అనేది ప్రశ్నార్థకమవుతోంది. ఒకవేళ ఆయనకు టిక్కెట్‌ ఇస్తే ఎక్కడ నుంచి ఇస్తారనే ప్రశ్న కూడా ఉంది..? కాగా..ఆయన మరోసారి పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సినీనటుడు 'పవన్‌కళ్యాణ్‌' స్థాపించిన  'జనసేన' పార్టీలోకి ఆయన వెళతారని విజయవాడలో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు సీరియస్‌గా రాజకీయాలు చేయని...'పవన్‌'ను నమ్ముకుని..'వంగవీటి' పార్టీ మారితే..మరోసారి పూర్వఅనుభవం ఎదురవుతుందేమోనన్న శంక ఆయన అభిమానుల్లో ఉంది. అదీకాక..'పవన్‌' టిడిపి అనుకూలవైఖరి కొనసాగిస్తుండడం, టిడిపితో పొత్తుపెట్టుకునే అవకాశాలు ఉండడం కూడా 'రాధాకృష్ణ'కు అవరోధంగా ఉంది. మొత్తం మీద...'వంగవీటి' రాధాకృష్ణ పరిస్థితి రాజకీయంగా చాలా ఇబ్బందిగా ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే...ఈ పరిస్థితులను ఆయన ఎలా నెట్టుకువస్తారనే దానిపై ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం..ఏమి జరుగుతుందో...!?


(2680)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ