WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కలెక్టర్‌ లక్ష్మీకాంతం'కు ఐఎస్‌వో సర్టిఫికెట్‌...!

పనిచేసే వారికి, సమర్థులకు...ఎక్కడ ఉన్నా గుర్తింపు దానంతట అదే లభిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు తమ పనిని తాము చేసుకుంటూ పోతే..ప్రజలతో పాటు...ఇతర సంస్థలూ వారి పనితీరును గుర్తించి పట్టం కడతాయి...! ఇటీవల కాలంలో పనితీరుతో మంచిపేరు తెచ్చుకుంటున్న కృష్ణాజిల్లా కలెక్టర్‌ 'లక్ష్మీకాంతం'కు అరుదైన సర్టిఫికెట్‌ లభించింది. ఆయనకు ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌వో సర్టిఫికెట్‌ లభించింది. కలెక్టర్‌ లక్ష్మీకాంతం పనితీరును గుర్తించిన ఐఎస్‌ఓ కమిటీ సభ్యులు ఆయనకు ఆ సర్టిఫికెట్‌ను మంగళవారం నాడు మచిలీపట్నంలో అందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కలెక్టర్‌ లక్ష్మీకాంతం చేస్తున్న కృషిని గుర్తించి ఐఎస్‌వో కమిటీ సభ్యులు ఆయనకు సర్టిఫికెట్‌ను ఇచ్చినట్లు వారు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండడం, వారికి అవసరమైన సేవలను వెంటనే అందించడం, జిల్లాలో ఉన్న వివిధ సమస్యలను ఆగమేఘాలపై పరిష్కరించడం, ఎవరైనా ఫలానా సమస్య ఉందని చెబితే వెంటనే స్పందించి ఆ సమస్యలను పరిష్కరించడానికి వ్యక్తిగతంగా చొరవతీసుకోవడం, వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుచే ప్రశంసలు పొందిన 'కలెక్టర్‌ లక్ష్మీకాంతం' ఇతర జిల్లాల కలెక్టర్లకు ఆదర్శప్రాయంగా నిలవడంతో ఐఎస్‌వో ఈ సర్టిఫికెట్‌ను ఆయనకు అందించింది.


   కృష్ణా జిల్లా కలెక్టర్‌గా 'లక్ష్మీకాంతం' బాధ్యతలు స్వీకరించిన తరువాత..ఆ జిల్లా అన్ని రంగాల్లో ముందంజ వేసింది. వివిధ అభివృద్ధి సూచికల్లో..సంక్షేమపథకాల అమలులో జిల్లా గణనీయమైన ప్రగతిని సాధించింది. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వివిధ ర్యాంకుల్లో కృష్ణా జిల్లా దాదాపు 80శాతం ర్యాంకులను సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ముందుకు దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా పాలనను 'కలెక్టర్‌ లక్ష్మీకాంతం' పరుగులెత్తిస్తుండడంతో..రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు గుర్తింపు వస్తోంది. వివిధ మీడియా సంస్థలు కూడా ఆయన చేస్తోన్న కార్యక్రమాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చి ప్రచురిస్తున్నాయి.ఆయనను స్పూర్తిగా తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే చెప్పారంటే ఆయన పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  


(266)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ