WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఓటమి భయంతో ముందస్తుకు సై అంటోన్న 'కెసిఆర్‌'...!

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నర్సింహ్మన్‌ ఢిల్లీ పర్యటన సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రధాని 'నరేంద్రమోడీ' కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో...రాష్ట్ర గవర్నర్‌ నర్సింహ్మన్‌ ఢిల్లీలో పర్యటించడంపై రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి  ఉత్కంఠతను కల్గిస్తోంది. ఒకవైపు గవర్నర్‌ 'నర్సింహ్మన్‌' వ్యవహారశైలిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బిజెపినేతలు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితుల్లో...ఆయనను 'మోడీ' ఢిల్లీకి పిలిపించుకోవడంపై పలురకాల వార్తలు వస్తున్నాయి. ఆయన తనపై వస్తోన్న ఆరోపణలకు వివరణ ఇవ్వడానికి ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతుండగా..కాదు..ఆయనను 'మోడీ'నే పిలిపించుకున్నారని, త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాలని 'మోడీ' భావిస్తున్నందున..అక్కడ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆయనను రప్పించుకున్నారని కూడా అంటున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను 'మోడీ' ప్రభుత్వం నెరవేర్చలేదని, వాటిపై ఆంధ్రా 'జనం' ఆగ్రహంతో ఉన్నారని...వారిని శాంతపర్చడానికి ఏమి చేయాలనేదానిపై గవర్నర్‌ ఒక నివేదిక ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. కాగా..ఇవేవీ కాదు..ముందస్తు ఎన్నికల గురించే గవర్నర్‌తో 'మోడీ' చర్చించారనే ప్రచారం కూడా ఊపందుకుంది.

    వచ్చే డిసెంబర్‌ మాసంలో ముందస్తు ఎన్నికలకువెళ్లాలని బిజెపి అగ్రనాయకత్వం భావిస్తున్న పరిస్థితుల్లో...ఆ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా..వారిని ఒప్పించడానికి 'మోడీ' షాలు ప్రయత్నిస్తున్నారని...దానిలో భాగంగా..తెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో...పరిస్థితులను తెలుసుకునేందుకు గవర్నర్‌ వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరపడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు అంగీకరిస్తారా..? అనే అంశంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నర్‌ నర్సింహ్మన్‌ తన నివేదికను అందజేశారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.

    కాగా...ముందస్తు ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంగీకరిస్తారని గవర్నర్‌ చెప్పినట్లు సమాచారం. వాస్తవానికి ఆరు మాసాల క్రితం..తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావించారు. అప్పట్లో ఎన్నికలు జరిగితే..తాను తిరుగులేని మెజార్టీతో గెలుస్తానని..ఆయన అంచనా వేశారు. అయితే...గత ఆరు నెలల నుంచి తెలంగాణలో రాజకీయ పరిస్థితి తిరగబడుతోంది. ముఖ్యంగా అధికార టిఆర్‌ఎస్‌పై ప్రజలు తీవ్ర అసంతృప్తి, అసహనం, వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి..తెలంగాణ ప్రజలకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒరిగించిదేమీ లేదని, అబద్దాలు, అర్థసత్యాలతో పాలన చేస్తున్నారని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని తెలంగాణ సమాజం నిలదీస్తోంది. 

   ఆరు మాసాల క్రితం ఉన్న అనుకూలత ఒక్కసారిగా వ్యతిరేకతగా మారుతుండడంతో..ఈ వ్యతిరేకత ఇంకా పెరిగిపోతే ప్రమాదమన్న భావనతో కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నే..ఆయన గవర్నర్‌ నర్సింహ్మన్‌తో చెప్పారని అంటున్నారు. మరో ఏడాది సమయంలో తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ మరింత బలం పుంజుకుంటుంధని, అదే సమయంలో...తాను మరింత బలహీనపడతానని గుర్తించే..ఇప్పుడు ఎన్నికలు జరిగితే..బొటాబొటి మెజార్టీతోనైనా గెలవచ్చునన్న ఆలోచనతో..కెసిఆర్‌ ముందస్తుకు సిద్ధం అవుతున్నారట. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని టిడిపి ప్రభుత్వం మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి అంత ఆసక్తి చూపించడం లేదు. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఆపార్టీ తిరుగులేని మెజార్టీతో గెలిచి తన సత్తాను చాటింది. దీంతో ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనేమీ టిడిపి నాయకులు చేయడం లేదు. ఏది ఏమైనా...ఓటమి భయంతోనే 'మోడీ', కెసిఆర్‌లు ముందస్తు జపం మొదలుపెట్టారనే మాట ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది.

(801)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ