WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్ర‌జాప్ర‌తినిధులు,పోలీసుల మ‌ధ్య 'కాక్' ఫైట్‌...!

హైకోర్టు తీర్పుమేరకు కోడి పందాలు నిర్వహించినా..కోడి పందాలు నిర్వహిస్తామని ప్రకటించినా.. అటువంటి ఏర్పాట్లు చాటుమాటున చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే..ఏయే గ్రామాల్లో..ఎక్కడెక్కడ కోడి పందాలు నిర్వహించారో..ఆయా ప్రాంతాల్లో పోలీసులు మైకులతో ప్రచారం చేస్తూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొందరు కిందిస్థాయి పోలీసు అధికారులు పలు గ్రామాలకు స్వయంగా వెళ్లి నిర్వహకులను పిలిచి హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, కృష్ణాజిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ప్రచార హోరు జోరుగా ఉంది. కోర్టులు ఎన్ని తీర్పులు ఇచ్చినా..పోలీసు అధికారులు ఊరూరూ తిరిగి పందాలు నిర్వహించవద్దని బెదిరించినా, హెచ్చరించినా...తాము కోడి పందాలు నిర్వహిస్తామని అని పందెం రాయుళ్లకు ఫోన్‌ ద్వారా మెసేజ్‌లు ఇస్తున్నారు నిర్వాహకులు. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసు అధికారులు మరింత అప్రమత్తమై మెస్సేజ్‌లు పంపుతున్న నిర్వహకాలు ఎవరు..? వారికి మద్దతు ఇస్తున్న రాజకీయనాయకులు ఎవరు...? ప్రజాప్రతినిధులు ఎవరు..? ఎవరెవరికి ఈ సందేశాలు పంపుతున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

   సాంప్రదాయం ముసుగులో కోళ్లకు కత్తులు కట్టి..పందాలు నిర్వహించడంపై కొందరు అధికారులు తప్పుబడుతూ..కంప్యూటర్‌ యుగం వచ్చినా..వీరిలో మార్పురాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసినా ఇంత వరకు ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో పరిస్థితి గందరగోళంగా కనిపిస్తోంది. ఉభయగోదావరి జిల్లాలో పోలీసు అధికారులు కోడి పందాలు జరిగే ప్రదేశాలపై పూర్తిగా నిఘా ఉంచి..కొందరిని అదుపులోకి తీసుకుని గృహనిర్భందం చేశారు. ప్రజాప్రతినిధులను కొందరిని గృహనిర్బంధం చేస్తే పరిస్థితి మెరుగుపడుతుందని పాలకుల దృష్టికి పోలీసు అధికారులు తీసుకెళ్లారు. దీనిపై ఇంత వరకు ఏ ఒక్కరూ స్పందించలేదని పోలీసు అధికారులు మీడియా వర్గాలకు తెలిపారు. కోడి పందాలు నిర్వహిస్తే...తాట వలుస్తామని పోలీసులు..తాము పందాలు నిర్వహిస్తాం..చేతనైంది చేసుకోండి..అని ప్రజాప్రతినిధులు ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వస్తేకానీ...పరిస్థితి ఏమిటో స్పష్టమవుతుందని ఉభయగోదావరి జిల్లా పోలీసులు ఉన్నతాధికారులు మీడియా వర్గాలకు తెలుపుతూ మీరు కూడా సహకరించాలని కోడి పందాల సంస్కృతికి తెరదించాలని కోరుతున్నారు.


(208)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ