WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కెసిఆర్‌'కు పాలాభిషేకం వెనుక 'యనమల' ఉన్నారా...!?

తెలంగాణలో రాజ్యసభ సీటును యాదవ్‌లకు ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంపై ఆంధ్రాలోని ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులు ఆయ‌న‌ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం, ముఖ్యమంత్రి కెసిఆర్‌ను చూసి ఆంధ్రా పాలకులు నేర్చుకోవాలని వారు డిమాండ్‌ చెయ్యడం వివాదాస్పదం అవుతోంది. తెలంగాణలో రాజ్యసభ సీటు ఇస్తే...ఇక్కడ ఆ సామాజికవర్గానికి చెందిన వారు పాలాభిషేకం చేసుకోవడం ఏమిటో..? కెసిఆర్‌ను చూసి...'చంద్రబాబు' ప్రభుత్వం నేర్చుకోవాల్సింది..ఏమిటో..అర్థం కావడం లేదని...ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహిత వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అసలు ఈ తతంగం ఎందుకు చేస్తున్నారో...? వారి ఉద్దేశ్యాలు ఏమిటో...? తెలియడం లేదని...ఇది ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగమా..? లేక బ్లాక్‌మెయిలింగో..తెలియడం లేదని వారు..అంటున్నారు. 

   టిడిపికి చెందిన 'పుట్టా సుధాకర్‌యాదవ్‌'కు టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇస్తారని అధికారికంగా వార్తలు వచ్చిన తరువాత...అదే సామాజికవర్గానికి చెందిన వారికి 'రాజ్యసభ' సీటు ఇస్తామని కెసిఆర్‌ ప్రకటించడం ఒకేసారి జరిగాయి. వాస్తవానికి 'పుట్టాసుధాకర్‌ యాదవ్‌'కు టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగు నెలల ముందే నిర్ణయించుకున్నారు. అప్పట్లో దీనిపై ప్రకటన కూడా చేయడానికి రంగం సిద్ధమైంది. ఇంతలో 'పుట్టాసుధాకర్‌యాదవ్‌' క్రైస్తవ కూటములకు వెళుతున్నారనే విమర్శలు వచ్చాయి. దీనిపై హిందూ ధార్మిక సంస్థలు, టిడిపి సానుభూతిపరులు అభ్యంతరాలు తెలపడంతో..ముఖ్యమంత్రి ఆలోచనలో పడ్డారు. తరువాత...దీనిపై అసలు వాస్తవాలు తెలుసుకోవాలని ఆ పదవిని ఆయనకు ఇవ్వకుండా వాయిదా వేసుకుంటూ వచ్చారు. దీనిపై మంగళవారం నాడు స్పష్టత ఇస్తూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ సమాచారం బయటకు వచ్చిన తరువాత తెలంగాణ ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వం గురించి ప్రకటన గుప్పించింది. వాళ్లు అక్కడ ప్రకటన చేయడంతోనే..ఇక్కడ...ఆ సామాజికవర్గానికి చెందిన వారు...కెసిఆర్‌ చిత్రపటానికి పాలభిషేకం...చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఇదంతా ఎవరు చేశారనే దానిపై సచివాలయంలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

   ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దీని వెనుక ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా ఆయన రాజ్యసభకు వెళ్లాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. అధిష్టానం కూడా ఆయన కోరికను అంగీకరించే స్థితిలోనే ఉంది. అయితే హఠాత్తుగా నిన్న 'పుట్టాసుధాకర్‌యాదవ్‌'కు టీటీడీ ఛైర్మన్‌ పదవి అని వార్తలు రావడంతో ఆందోళన చెందిన 'యనమల' ఈ రకమైన పాలాభిషేకాలను ప్రోత్సహించారని అంటున్నారు. వాస్తవానికి 'పుట్టాసుధాకర్‌యాదవ్‌' 'యనమల'కు బంధువే. ఆయనకు టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని ఒత్తిడి తెస్తోంది కూడా 'యనమలే'. తెలంగాణలో 'పుట్టాసుధాకర్‌యాదవ్‌'కు ముఖ్యమంత్రి కెసిఆర్‌తో చెప్పించి..కాంట్రాక్టు పనులు కూడా ఆయన ఇప్పిస్తున్నారని టిడిపి నుంచి వెళ్లిపోయిన 'రేవంత్‌రెడ్డి' ఆరోపించారు. అప్పట్లో ఈ ఆరోపణలపై స్పందిస్తూ...కాంట్రాక్టు పనులు చేసుకుంటే తప్పేమిటనట్లు వారు మాట్లాడారు. తన బంధువైన 'సుధాకర్‌యాదవ్‌'కు టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇస్తే..తన రాజ్యసభ సభ్యత్వంపై దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే 'యనమల' ఒత్తిడి వ్యూహాన్ని ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
   కెసిఆర్‌ ఏమి చెప్పారో..తెలియకుండానే...ఇక్కడ ఇటువంటి ప్రచారం నిర్వహిస్తున్నారని, తెలంగాణలో 'యాదవ్‌' సామాజికవర్గానికి రాజ్యసభ సీటు ఇస్తే..ఇక్కడ కూడా ఆ వర్గానికి ఇవ్వాలనే భావనతోనే..ఇటు వంటి కార్యక్రమాలు చేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ ఇచ్చినట్లు తమ సామాజికవర్గానికి ఇక్కడ కూడా ఇవ్వాలని..అప్పటి వరకు కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తుంటూనే ఉంటామని...ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు ప్రకటించారట. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు 'యనమల'కు రాజ్యసభ సీటు ఇచ్చే విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇంతలోనే ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఒరిగేదేమిటో..అర్థం కావడం లేదు. తనకు కాకుండా మరొకరికి 'రాజ్యసభ' సీటు వెళ్లకుండా..'యనమల' ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని టిడిపికి చెందిన సీనియర్‌ నాయకులు చెబుతున్నారు. ఏది ఏమైనా...ఆంధ్రాలో బీసీ సామాజిక వర్గానికి 'చంద్రబాబు' పెద్దపీట వేస్తున్నా...ఆ వర్గం కెసిఆర్‌కు పాలాభిషేకం చేయటంపై విమర్శలు వస్తున్నాయి.


(985)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ