WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కోడి పందాలు వైపు వెళితే..జైలుకెళ్లకతప్పదు...!

కోడి పందాలు నిర్వహించినా..కోడి పందాలు నిర్వహించే ప్రదేశానికి ఎవరైనా హాజరైనా..అరెస్టు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే..కొన్ని జిల్లాల్లో గతంలో ఎక్కడైతే కోడి పందాల నిర్వహణ జరిగేదో..ఆయా మండల పరిధిలోని గ్రామాల్లో లౌడ్‌స్పీకర్‌ ద్వారా ఈ వివరాలను తెలుపుతూ చెబుతున్నారు. అంతే కాకుండా గ్రామాలను కోడి పందాలు, పేకాట కానీ, ఇతర క్రీడలు నిర్వహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే కోడి పందాలు నిర్వహించే గ్రామాల్లోని నాయకులతో, సర్పంచ్‌లతో సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కోడి పందాలను నిర్వహిస్తే కఠినంగా వ్యవహరించి..అప్పటికప్పుడే..జైలుకు పంపుతామని, కోర్టు తీర్పు కూడా ఉందని...ఆ తీర్పును ధిక్కరిస్తే..జైలుకెళ్లడమేనని,బెయిల్‌ కూడా ఉండదని చెబుతున్నారు. మండల స్థాయిలో రెవిన్యూ అధికారులు..పంచాయితీ కార్యదర్శులతో, పోలీసులతో సమావేశాలు నిర్వహించి కోర్టు తీర్పును ఎవరు ధిక్కరించినా..అరెస్టు చేయమని ఆదేశిస్తున్నారు. ఎక్కడెక్కడ కోడి పందాలు నిర్వహిస్తున్నారో..ఆయా ప్రాంతాలను గుర్తించి...సమాచారం ఇవ్వాలని గ్రామ,రెవిన్యూ కార్యదర్శులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అంతే కాకుండా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ 144వ సెక్షన్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు తీర్పుకు భిన్నంగా కోడి పందాలు నిర్వహిస్తే..అధికార యంత్రాంగమే బాధ్యత వహిస్తుందని, అందుకు పోలీసు చర్యలు తప్పవని, ఇప్పటికే ఆదేశాలు అధికారులకు అందాయి. ఈ మూడు నాలుగు రోజులు ఎవరూ రాజకీయనాయకులతో ఎటువంటి చర్చలు, సమావేశాలు నిర్వహించవద్దని, మీకు తెలిసిన వారికి చెప్పండి..కోడి పందాలు నిర్వహించకండి..అని ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులకు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో రెవిన్యూ, పోలీసు అధికారులతో సమావేశాలు నిర్వహించి కోర్టు తీర్పు విషయాన్ని బాహాటంగా చెబుతున్నారు. 

   ఇంతకు ముందు మెతకవైఖరి అవలంభించి లక్షలు సంపాదించుకున్నదెవరెవరు..? అనే విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. చాటుమాటుగా కోడి పందాలు నిర్వహించినప్పుడు అప్పట్లో కిందిస్థాయి పోలీసు అధికారులు లంచాలకు ఆశపడి చూసీచూడనట్లు వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎవరైనా ఆధారాలతో కోడి పందాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేస్తే..ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కోడి పందాలు నిర్వహించినవారికి..చూసేందుకు వచ్చిన వారికి..మౌనపాత్ర పోషించిన వారికి జైలు శిక్ష తప్పదని ఇప్పటికే..గ్రామ గ్రామానికి పాకిపోయింది. సాంప్రదాయ క్రీడగా ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీల ముఖ్యులు..కోడిపందాల నిర్వహకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఈ విషయంలో ఆధారాలు సమర్పించి ఉన్నతాధికారులకు అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మండల స్థాయిలో పోలీసు అధికారులు, రెవిన్యూ అధికారులు బాధ్యతగా మెలగాలని ఎక్కడైనా కోడి పందాలు నిర్వహిస్తే..తస్మాత్‌ జాగ్రత్త..మీపై కూడా చర్యలు ఉంటాయనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎందుకొచ్చిన తండా అని మండలస్థాయిలో పోలీసు అధికారులు, రెవిన్యూ అధికారులు ఎటువంటి ప్రలోభాలకు ఒత్తిడిలకు, ఆశలకు లొంగకూడదని, కఠినంగా వ్యవహరించి కోర్టు తీర్పును గౌరవించాలని నిర్ణయించుకున్నారు. మరో రెండురోజులు గడిస్తే కానీ..ఎవరెవరు కఠినంగా ఉన్నారు..ఎవరెవరు కోడి పందాలు నిర్వహిస్తున్నారు..కోడిపందాలకు మద్దతు ఇస్తున్న రాజకీయనాయకులు ఎవరు అనే విషయం బయటపడడం ఖాయం. ఈ మధ్యలో సుప్రీంకోర్టు తీర్పును బట్టి పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా పందెం రాయళ్లకు, కోడి పందాల నిర్వహకులకు జైలుశిక్ష నుండి తప్పించుకోవడం ఈసారి సాధ్యం కాకపోవచ్చు.

(205)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ