WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిఇఒగా 'ఎల్‌వి' వద్దు...ఆ ముగ్గురిలో ఎవరైనా ముద్దే...!

రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారిగా ముగ్గురు అధికారుల పేర్లను సూచిస్తూ...కేంద్రానికి ప్రభుత్వం సిఫార్సు చేసింది. విచిత్రమేమిటంటే..ముందుగా వారికి సమాచారం ఇచ్చి..వారి అంగీకారం తీసుకుని ఇంతకు ముందు పేర్లను పంపేవారు. ఈసారి పేరును పంపిన తరువాత...వాటిని పత్రికలు ప్రచురించిన తరువాతే సంబంధిత అధికారులకు ఈ విషయం తెలిసింది. ప్రభుత్వం పేర్లు పంపిన అధికారుల్లో 'కార్మికశాఖాధిపతి' 'నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌', గిరిజనశాఖాదిపతి 'సిసోడియా', అటవీశాఖాధిపతి 'అనంతరాము'లు ఉన్నారు. తనను తెలంగాణకు కేటాయించాలని 'అనంతరాము' క్యాట్‌లో కేసు వేయటం..ఆయనకు అనుకూలంగా క్యాట్‌ తీర్పు ఇవ్వడం..దానిని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. ఒకవైపు 'అనంతరాము' వ్యవహారం కోర్టులో ఉంది. ఒక వేళ హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పువస్తే తెలంగాణ రాష్ట్రానికి ఆయన వెళ్లడం ఖాయం. అటువంటి సమయంలో 'అనంతరాము' పేరును ఆ ముగ్గురి జాబితాలో ఎలా చేర్చారు. తాను రాష్ట్రంలోనే పనిచేస్తాను..ఎన్నికల అధికారిగా తన పేరును పంపవద్దని ఇంతకు ముందే 'నీరబ్‌కుమార్‌ప్రసాద్‌' కోరినప్పటికి ఆయన పేరును కూడా పంపారు. 

  ఇది ఇలా ఉంటే..యువజనులు, క్రీడలశాఖాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం' తాను సిఇఒగా వెళ్లేందుకు సిద్ధమేనని సంబంధిత అధికారులకు కలసి చెప్పినట్లు తెలిసింది. సిఇఒ పోస్టు కోరుకున్న 'ఎల్‌వి' పేరు పంపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ససేమిరా..అన్నారట..? ఆయన మరో 'భన్వర్‌లాల్‌' అవుతాడమేనన్న అనుమానం, భయమే ఆయన పేరును సిఎం వద్దనడానికి కారణమట. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిహోదాలో క్రీడలు,యువజనులశాఖ బాధ్యతలు నిర్వహించే కన్నా..తన హోదాకు తగ్గట్లు సిఇఒ పోస్టులో గౌరవం పెరుగుతుందనేది 'ఎల్‌వి' నమ్మకమట. అంతే కాకుండా ప్రస్తుతం శాఖలో పని తక్కువగా ఉంటుంది. గుర్తింపు కూడా ఉండదు. బడుగు,బలహీనవర్గాలకు సేవ చేయాలని భావించిన..అటువంటిదేమీ ఈశాఖలో ఉండదు. సిఇఒగా వెళితే...పని తక్కువ ఉన్నా..గౌరవం ఉంటుంది. ఎన్నికల సమయంలో తప్ప మిగతా రోజుల్లో ఎటువంటి టెన్షన్‌లు ఉండవు. విమర్శలు, ఆరోపణలు, వేధింపులు సాధింపులు ఉండవు..అందుకేనేమో..ఆపోస్టు కావాలని ఎల్‌వి కోరుకున్నారు. కానీ పాలకులేమో..సిఇఒగా వెళ్లేందుకు ఇష్టపడని వారిని, కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న అధికారిని సిఫార్సు చేయటం గమనిస్తే...ఇందులో కావాలనే 'నీరబ్‌కుమార్‌ప్రసాద్‌' పేరును,అనంతరాము పేరును చేర్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

  ఇందులో సిఎంఒ అధికారి హస్తం కూడా ఉందని అధికారవర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న అధికారిని మొట్టమొదటగా సిఇఒ పేరుకు సిఫార్సు చేయటం జరిగింది. గతంలో ముఖ్యకార్యదర్శిహోదాలో ఉన్న అధికారులు మాత్రమే సిఇఒగా పనిచేశారు..ప్రభుత్వం కూడా అటువంటి వారి పేర్లనే సిఫార్సు చేసేవారు. కష్టపడి పనిచేసే...అధికారిగా పేరున్న 'నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌'ను ఎవరు ఎందుకు సిఫార్సు చేశారనే విషయం బయటకు పొక్కనప్పటికీ, ముఖ్యమంత్రికి నచ్చచెప్పి..ఆయన పేరును సిఫార్సు చేయించింది సిఎంఒ అధికారేనని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ ముగ్గురు అధికారుల జాబితాను సిఇఒ పోస్టుకు పంపడంలో సరైన పద్దతిని పాటించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిఫార్సులు, ఒత్తిడిలకులొంగి ఆ జాబితాను పంపారని అధికారవర్గాలు చెపుతున్నాయి.

(453)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ