WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బిజెపికి 80సీట్లు కావాలట...!?

రాష్ట్ర అసెంబ్లీలో సీట్లు పెరుగుతాయని ఖచ్చితంగా సమాచారం వచ్చిన తరువాత..నుంచి బిజెపిలో సందడి నెలకొంది. ఇప్పటి దాకా..అసెంబ్లీ సీట్లుపెంపుపై ఊహాగానాలే ఉండగా..త్వరలో వీటికి కేంద్రం ఆమోదముద్ర వేయబోతోంది. దీంతో టిడిపితో పొత్తు పెట్టుకుంటే తమకు ఎన్నిసీట్లు ఇస్తారనేదానిపై బిజెపి నేతలు ముందస్తు ఊహాగానాలు చేస్తున్నారు. ప్రధాన నరేంద్రమోడీతో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కావడం, ఆయన అసెంబ్లీ సీట్ల పెంపుపై ప్రస్తావించడంతో పాటు..ఇతర సమస్యలను కూడా ఏకరవు పెట్టానున్నారు. దేశవ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల్లో 'మోడీ' మిత్రపక్షాలతో సయోధ్యతో వ్యవహరించాలని భావిస్తుండడంతో..ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావిస్తున్న సమస్యలపై 'మోడీ' ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో...ఇప్పుడు వీరి భేటీకీ ప్రాధాన్యత ఏర్పడింది. గత ఏడాదిన్నర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు,మోడీలు ముఖాముఖిగా ఎదురుపడలేదు. వారిద్దరి మధ్య విభేదాలున్నాయని, రాబోయే ఎన్నికల్లో బిజెపి 'వైకాపా'తో కలసి వెలుతుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే..గుజరాత్‌లో దెబ్బతిన్న 'మోడీ' నమ్మకమైన మిత్రులతోనే వెళ్లాలని భావిస్తుండడంతో..రాబోయే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో టిడిపితోనే బిజెపి వెళ్లడం ఖాయం. ఈ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి నేతలు పెరగబోయే అసెంబ్లీ స్థానాలపై ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు.

   రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పుడు 175 స్థానాలు ఉండగా మరో 50స్థానాలు పెరగబోతున్నాయి. అంటే మొత్తం 225 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు 80 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని బిజెపి టిడిపి నాయకులను కోరాలని భావిస్తోంది. తమ కృషి వల్లే రాష్ట్ర అసెంబ్లీలో సీట్లు పెరుగుతున్నాయని, దీనిలో ఎక్కువ శాతం తమకే కేటాయించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పైగా రాష్ట్రంలో తమ బలం అనూహ్యంగా పెరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని తాము అడిగిన సీట్లు ఇవ్వాలని వారు కోరబోతున్నారట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తమ కార్యకర్తలు, నాయకులు పోటీకి ఉత్సాహంగా ఉన్నారని, వారందరికీ పోటీ చేసే అవకాశం కావాలని కోరుతున్నారు. కేంద్ర బిజెపి నాయకులను కూడా కలసి వారు ఒత్తిడి చేస్తున్నారట. రాబోయే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తీసుకుని పోటీ చేస్తే పార్టీ బలపడుతుందని, పోటీలో ఓడిపోయినా పెద్దగా నష్టం లేదని, పార్టీ క్యాడర్‌ గ్రామస్థాయికి విస్తరిస్తుందని వారు వివరిస్తున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తాము ఒత్తిడి చేసినా లాభం లేదని, అదే కేంద్ర నాయకులు ఒత్తిడి చేస్తే..ఆయన దిగి వస్తారని కూడా వారు కేంద్రనాయకత్వానికి విన్నవిస్తున్నారట. దీనిపై త్వరలో స్పష్టత వస్తుందని..తమకు 80కి తగ్గకుండా సీట్లు ఇస్తేనే..పొత్తుకు ఒప్పుకుంటామని..లేకపోతే ఒంటరిపోటీకే సిద్ధమవుతామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్‌ నాయకుడు ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు.

  కాగా..బిజెపి నాయకుల డిమాండ్‌ను చూసి టిడిపి నేతలు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో వారికి 17సీట్లు ఇస్తే వారు గెలిచింది..నాలుగు స్థానాలేనని, మిగితా స్థానాలన్నీ 'జగన్‌'కు పువ్వుల్లోపెట్టి అప్పగించారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సీట్లు పెరిగాయని, వారికి సీట్లు ఎక్కువ ఇస్తే...ఆ సీట్లన్నీ 'జగన్‌' ఖాతాలోకి వెళతాయని...వారు అంటున్నారు. కేంద్ర బిజెపి పెద్దలు గత మూడున్నర సంవత్సరాల నుంచి రాష్ట్రం పట్ల వ్యవహరించిన తీరు చూసి..రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, వారితో పొత్తు పెట్టుకుంటే...ఇబ్బందులు ఉంటాయని...అసలు పొత్తే వద్దని టిడిపి నేతలు అంటున్నారు. మొన్న తమిళనాడులో ఏం జరిగిందో..చూశాం..బిజెపితో సన్నిహితంగా ఉన్నందుకే...ఆ రాష్ట్రంలో డిఎంకెకు డిపాజిట్‌ రాకుండా చేశారు..ఆ రాష్ట్ర ఓటర్లు. అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉత్పన్నం కావడానికి ఆస్కారం ఉంది. నమ్మించి మోసం చేయడం బిజెపి నైజమని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని, అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్లడమే..పెద్ద రిస్క్‌ అని..పైగా వారికి గతంలో కంటే ఎక్కువ సీట్లు ఇవ్వడం కూడానా..అని వారు పెదవి విరుస్తున్నారు. దానా దీనా..బిజెపికి గతంలో కేటాయించిన 17సీట్లకు మరో 3 సీట్లు అదనంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని టిడిపి నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద బిజెపి అత్యాశను టిడిపి పెద్దలు ఎంత వరకు నెరవేరుస్తారో..వేచి చూడాలి.


(1229)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ