లేటెస్ట్

ఇసుక టెండర్లు రద్దు...!?

రాష్ట్రంలో నదుల్లో ఉన్న ఇసుక కోసం నిర్వహిస్తోన్న టెండర్లను రద్దు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. పది జిల్లాల్లో ఉన్న వివిధ ఇసుక రీచ్‌ల్లో ఇసుకను తవ్విపోయడానికి, రవాణా చేయడానికి ప్రభుత్వం ఆన్‌లైన్‌లో టెండర్లను నిర్వహించింది. ఈ ఆన్‌లైన్‌ టెండర్లల్లో టెండర్‌దారులు వేసిన టెండర్లు చూసి ఎపిఎండిసి అధికారులకు మతిపోతోంది. టన్ను ఇసుకను తవ్వడానికి కేవలం రూ.15/-లకే చేస్తామని టెండర్లు దాఖలు కావడంతో వారు విస్తుపోతున్నారు. ఇంత తక్కువ ధరకు వాళ్లు ఎలా చేస్తారు..? దీని వెనుక ఏముంది..? కుట్ర కోణం దాగుందా..? లేక ఏదో విధంగా ముందు ఇసుక రీచ్‌లను దక్కించుకుని తరువాత...అక్రమాలకు పాల్పడాలనే ఆలోచనతో ఇంత తక్కువ ధరకు కోడ్‌ చేశారా..? అనేదానిపై అధికారులు మళ్లగుల్లాలు పడుతున్నారు. 

గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక విధానం అమలులో ఉండేది. దీని వలన టిడిపి నాయకులు, కార్యకర్తలు అడ్డగోలుగా దోచుకున్నారని, కొత్త ఇసుక విధానం తెస్తామని అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వంద రోజులకు నూతన ఇసుక విధానాన్ని తేవడం కోసం ప్రభుత్వం ఆన్‌లైన్‌లో టెండర్లను నిర్వహించింది. ఈ టెండర్‌లో పాల్గన్న టెండర్‌దారులు దాఖలు చేసిన రేట్లతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అతి తక్కువ ధరకు కోడ్‌ చేసిన వారికి టెండరు దక్కుతుంది. కానీ ఇక్కడ చూస్తే...ఎవరికీ సాధ్యం కాని రేట్లను పేర్కొన్నారని, ఏదో విధంగా ముందుగా రీచ్‌లను దక్కించుకుంటే తరువాత అక్రమాలకు, అరాచకాలకు పాల్పడాలనే ఉద్దేశ్యంతో వారు ఈ విధంగా చేశారని, దీని వలన రాబోయే కాలంలో ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. టెండరుదారులు దాఖలు చేసిన టెండర్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వీటిని రద్దు చేసి మళ్లీ టెండరు నిర్వహిస్తే మంచిందనే అభిప్రాయం ఎపిఎండిసి అధికారుల్లో వ్యక్తం అవుతోంది. ఈ వ్యవహారంపై వారు మంత్రి, ముఖ్యమంత్రి జోక్యాన్ని కోరుతున్నారు. టెండరు దారులు దాఖలు చేసిన టెండర్లును ఆమోదిస్తే...ప్రభుత్వానికే నష్టమని, దీనిపై వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఎంపిఎండిసి అధికారి ఒకరు పేర్కొన్నారు. మొత్తం మీద..టెండరు దారులు వ్యవహారం శాఖ అధికారుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా ఈ వ్యవహారంపై సోమవారం నాడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

(275)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ