ఐఏఎస్‌ల బదిలీలు ఎందుకు ఆగినట్లో...!?
గత కొన్నాళ్లుగా తెలంగాణ ఐఏఎస్‌ల్లో బదిలీల వార్త నిత్యకృత్యం అవుతోంది. ప్రతిరోజూ ఈ వార్తలను చూస్తూనే ఉన్నా అది మాత్రం వాస్తవ రూపం దాల్చడం లేదు. ఈరోజో..రేపో..అనడం మళ్లీ వెనక్కుపోవడం..జరుగుతూనే ఉంది. అయితే మొన్న భారీగా ఐపిఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేయడంతో ఐఏఎస్‌లను కూడా బదిలీ చేస్తారని, ఎన్నికల టీమ్‌ను రెడీ చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే ఐపీఎస్‌ల బదిలీ జరిగినా..ఐఏఎస్‌ల బదిలీలు మాత్రం ఆగిపోయాయి. ఇలా ఎందుకు జరిగిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలు అయిన వెంటనే ఐఏఎస్‌లు బదిలీలు ఉంటాయనే వార్తలు వచ్చాయి. అయితే అది అయిన తరువాత కూడా..ఈ తతంగం పూర్తి అవలేదు. తరువాత ముందుస్తుకు వెళుతున్నారని, నేడో..రేపో అనుకున్నా..అదీ కాలేదు. అయితే ఎందుకు ఈ విధంగా బదిలీలు వాయిదా పడుతున్నాయో అన్న దానిపై అధికార బిఆర్‌ఎస్ పార్టీలో కూడా స్పష్టత లేదు. ముందు సోమేష్‌కుమార్ ఐఏఎస్‌ల బదిలీలపై కసరత్తు చేశారని, అయితే..ఇంతలోనే ఆయన ‘ఆంధ్రా’కు వెళ్లడం..ఆ తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ‘శాంతికుమారి’ నియమితులవడంతో బదిలీలు ఆగిపోయాయని సమాచారం. అయితే ఆమె బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా ఈ పక్రియ ఇంకా కొనసాగుతోంది. చాలా మంది కార్యదర్శులు ఏళ్ల తరబడి ఒకే పోస్టులో పనిచేస్తోండడంతో వారిని బదిలీలు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. అదే విధంగా ఎన్నికల కోసం కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు కావాల్సిన వారిని కేటాయించుకోవడం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన తనయుడు కెటిఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఒక దారిలోకి వచ్చిన తరువాత మాత్రమే బదిలీల వ్యవహారం ఉంటుందని అధికారవర్గాలు అంటున్నాయి.