WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'గుంటూరు..నగరమా...లేక గుంతల నగరమా...!?

గుంటూరు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల పనులు అట్టహాసంగా జరుగుతున్నాయి. పనుల నిర్వహణలో లోపాలు కూడా జరుగుతున్నాయి. ఈ పనులు జరుగుతున్న విధానంపై కలెక్టర్‌ కోన శిశిధర్‌ను, గుంటూరుమున్సిపల్‌ కమీషనర్‌ అనురాధను హెచ్చరించినా కూడా వారిద్దరూ దృష్టిసారించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. పనులు పూర్తి చేసిన ప్రాంతాల్లో గుంతలు పూడ్చడం లేదు..రోడ్లు వేయకుండా..అడ్డదిడ్డంగా వదిలేస్తున్నారు. ఇంత వరకు పనులు ప్రారంభించని ప్రాంతాల్లో క్వారీ డస్టు తీసుకొచ్చి...రోడ్లపై నిల్వ ఉంచుతున్నారు. దీని వలన వాహనాలకు, ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విచిత్రమేమిటంటే..ఈ క్వారీ డస్టు పైకి ఎగురుతున్నా..ట్యాంకుల ద్వారా నీళ్లు కూడా చల్లడం లేదు. అన్నింటికి మించి తవ్విన గోతులు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారపార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు. విపక్షాల నాయకులు స్పందించడంలేదు. గుంతలు పూడ్చకపోవడాన్ని జన్మభూమి కార్యక్రమంలోనూ..ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజలు నిలదీసినా..పెద్దగా స్పందించలేదు. ఒకవైపు విజయవాడ నగరం సుందరనగరంగా తీర్చిదిద్దుతుండగా..గుంటూరు నగరాన్ని దుమ్మూ-దూళితో తీర్చిదిద్దుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వివిధ బాధ్యతలతో, వీడియో కాన్ఫరెన్స్‌లతో బిజీగా ఉంటే కలెక్టర్‌ గుంటూరు నగరంపై దృష్టిసారించడం లేదు. గతంలో ఆరోపణలు, విమర్శలు ఉన్న..మహిళా అధికారి అనురాధను గుంటూరు మున్సిపల్‌ కమీషనర్‌గా ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డి సిఫార్సుతో మంత్రి నారాయణ నియమించారు. ఆమె 'వేణుగోపాల్‌రెడ్డి' సిఫార్సులను తప్ప మిగతా వారి సిఫార్సులను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగకపోవడం...అధికారుల పెత్తనమే ఎప్పటి నుంచో ఉండడంతో..వారితో స్వంత పనులు చేయించుకోవడమే కానీ..ప్రజా ఇబ్బందులపై అధికార, విపక్షాల నాయకులు ఒకతాడిపై నడుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అనేక పనులు గుంటూరు నగరంలో జరుగుతుంటే...వాటి పర్యవేక్షించే అధికారులు లేరనే విమర్శ ఉంది. అనేక పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 40శాతం పనులు కూడా పూర్తి కాలేదని విమర్శలు ఉన్నాయి. విజయవాడ, నెల్లూరుకే పరిమితమైన మంత్రి నారాయణ రాజధాని జిల్లా అయిన గుంటూరుపై శీతకన్ను వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కమీషనర్‌ అనురాధను తప్పించి...ఆ స్థానంలో యువకుడు, సమర్థుడైన అధికారిని నియమిస్తే..పరిస్థితి కుంటుపడుతుందని ప్రజలు అంటున్నారు. విషయాన్ని ఎంపి గల్లా జయదేవ్‌ దృష్టికి తీసుకెళ్లినా...ఆయన తన వ్యాపారాలల్లో నిమగ్నమై దీన్ని పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. 

   ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ..ఆ ఆదేశాలను వారు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. కలెక్టర్‌ కోన శశిధర్‌ గుంటూరు నగరంపైదృష్టిసారించరు..పట్టించుకోరు..కమీషనర్‌ అనురాధ తన బాధ్యతలను నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గుంటూరు జిల్లా ఎప్పుడు సుందర నగరంగా మారుతుందో..అది తమ కళ్లతో చూడగలుగుతామని ప్రజలు వ్యాఖ్యానిస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం అవుతుంది. అంతే కాకుండా గుంటూరు-1 టిడిపి ఇన్‌ఛార్జి మద్దాలి గిరి కానీ..ఎమ్మెల్యే వేణుగోపాల్‌రెడ్డి కానీ స్పందించకుండా తమ వ్యాపార లావాదేవీల్లో మునిగిపోయారనే విమర్శలువస్తున్నాయి. అంతే కాకుండా ఎవరికి కావాల్సిన పనులువారు చక్కపెట్టుకుంటూ..ప్రజల ఇబ్బందులను గాలికి వదిలేశారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు గుంటూరులో నివాసం ఉంటున్నా వారు ఈ విషయంపై స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై మున్సిపల్‌ మంత్రి నారాయణ ఏ విధంగా స్పందిస్తారో...కలెక్టర్‌ ఏమి చర్యలు తీసుకుంటారో మరి కొద్ది రోజులు గడిస్తేకానీ తెలియదు.

(228)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ