WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైకాపా రాజ్యసభ అభ్యర్థి 'వేమిరెడ్డి'...!?

నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలకు మరో 15 మాసాలు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో జిల్లాలోరాజకీయాలు వేడెక్కుతున్నాయి. పలువురు రాజకీయనాయకులు తాము ఎక్కడ నుంచి పోటీ చేస్తే విజయం సాధిస్తామో..తమ బలం ఎంత..? బలగం ఎంత...? ఎక్కడ అనువుగా ఉంది..? అనే దానిపై ప్రత్యేక సర్వేలు చేయించుకుంటున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో తిరుగులేని విజయం సాధించిన వైకాపా మళ్లీ రాబోయే ఎన్నికల్లో అదే ఊపును కనబర్చాలని భావిస్తోంది. వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నిన్నటి నుంచి నెల్లూరులో తన పాదయాత్ర ప్రారంభించడంతో జిల్లాలో రాజకీయ హడావుడి ఇంకా పెరిగింది. గత ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు టిడిపిలో చేరగా..మరి కొందరు అదే దారిలో ఉన్నారని ప్రచారం జరిగినా..జిల్లాలో మాత్రం వైకాపా బలం తగ్గలేదని పలుసర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపార్టీకి ఊపుతెచ్చే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త 'వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి' వైకాపాలో చేరబోతున్నారట. గతంలో వైకాపాలో ఉన్న ఆయన తరువాత ఆ పార్టీ రాజీనామా చేశారు. అయితే...ప్రస్తుతం ఆయన మళ్లీ వైకాపాలో చేరుతున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

  ఆర్థికంగా తిరుగులేని 'వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి' వైకాపాలో చేరతారని...ఈ మేరకు ఆయనతో వై.ఎస్‌.జగన్‌ మంతనాలు జరిపారని జిల్లాలో ఉధృతంగా ప్రచారం జరుగుతోంది. జిల్లా పాదయాత్రలో భాగంగా 'వేమిరెడ్డి' ఆయనను కలిశారని, వారి చర్చల్లో రాబోయే రాజ్యసభ ఎన్నికల విషయం ప్రస్తావనకు వచ్చిందని సమాచారం. 'వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి' పార్టీలో చేరితే...ఆయనకు రాజ్యసభ అభ్యర్థిత్వం ఇస్తానని 'జగన్‌' హామీ ఇచ్చారని తెలుస్తోంది. దీనిపై 'వేమిరెడ్డి' సానుకూలంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే...'జగన్‌' రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చినా ఆయన గెలవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం వైకాపాకు 42 మంది మాత్రమే ఎమ్మెల్యేల బలం ఉంది. వైకాపా అభ్యర్థి గెలవాలంటే మరో ఇద్దరు సభ్యుల మద్దతు అవసరం. వారిని సమీకరించుకుంటే వైకాపా అభ్యర్థి గెలవగలుతారు. దీనిపైనే 'వేమిరెడ్డి, జగన్‌'ల మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. రాజ్యసభ అభ్యర్థిత్వం ఇస్తే...అవసరమైన వారి మద్దతు 'వేమిరెడ్డి' సమీకరించుకోవాలని 'జగన్‌' షరతు విధించారట. దీనిపై 'వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి' ఆలోచనలో పడ్డారట. అధికార టిడిపిలో ఉన్న అసంతృప్తులు తమ పార్టీకి ఓటు వేస్తారని..దీంతో తన విజయం ఖాయమని...'జగన్‌' భరోసా ఇస్తున్నా...'వేమిరెడ్డి' వెనుకా ముందాడుతున్నారట. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

   కాగా...'వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి' వైకాపాలో చేరుతున్నారన్న విషయం నెల్లూరు టిడిపిలో కలకలం సృష్టిస్తోంది. 'వేమిరెడ్డి'ని టిడిపిలో చేర్పిస్తాన‌ని, సిఎం చంద్ర‌బాబుకు హామీ ఇచ్చిన మంత్రి 'సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి' జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. 'వేమిరెడ్డి'కి టిడిపి తరుపున 'రాజ్యసభ' సీటు ఇప్పిస్తానని 'సోమిరెడ్డి' ఆయనకు హామీ ఇచ్చారట. అయితే...ఇప్పుడు 'వేమిరెడ్డి' వైకాపా వైపు వెళుతుండడం..రాజకీయంగా 'సోమిరెడ్డి'కి ఎదురుదెబ్బే. పార్టీ అధిష్టానం వద్ద...తన పరువు పోకుండా ఉండాలంటే..ఎట్టి పరిస్థితుల్లో 'ప్రభాకర్‌రెడ్డి' వైకాపాలో చేరకుండా చూడాలని ఆయన భావిస్తున్నారట. రాజ్యసభ సభ్యత్వం విషయంపై అధిష్టానంతో మాట్లాడదామని, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన కోరుతున్నారట. అయితే...దీనిపై 'వేమిరెడ్డి' ఎలా స్పందించారో అని విషయం బయటకు తెలియడం లేదు. ఏది ఏమైనా...'వేమిరెడ్డి' వ్యవహారం 'సోమిరెడ్డి'కి ఇబ్బందులు సృష్టించడం ఖాయమని టిడిపి వర్గాలు అంటున్నాయి. చూద్దాం..ఏమి జరుగుతుందో...!?


(1111)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ