లేటెస్ట్

'జగన్‌'కు మద్దతు ఇస్తోన్న 'జివిఎల్‌'....!

గత తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పోరాడి ఆ పార్టీ ఓటమికి కారణమైన బిజెపి రాజ్యసభ సభ్యుడు 'జి.వి.ఎల్‌.నర్సింహ్మారావు' వైకాపా ప్రభుత్వంపై సానుభూతితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. టిడిపి ప్రభుత్వంపై ఆయన గతంలో చీటికి మాటికి ఆరోపణలు చేసి ఆ పార్టీని బాగానే దెబ్బతీశారు. కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో రాష్ట్రానికి నిధులు ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడి నిధులను దుర్వినియోగం చేస్తోందని ఆయన అప్పట్లో ధ్వజమెత్తారు. అప్పట్లో ఆయనకు మద్దతుగా బిజెపి నేతలంతా ఏకతాటిపైకి వచ్చి 'టిడిపి' ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైకాపా గెలవడానికి అవసరమైన సహాయం చేస్తూనే..టిడిపిని గుక్కతిప్పుకోనివ్వకుండా ఆరోపణల వర్షం కురిపించి, ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయిన తరువాత...బిజెపి నేతలు...టిడిపిపై విమర్శలు తగ్గించగా..'జివిఎల్‌' మాత్రం ఇంకా ఆ పార్టీపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు. టిడిపి అవినీతికి పాల్పడిందని, ఆ పార్టీ నేతలను జైలులో పెట్టాలని ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. బిజెపి సీనియర్‌ నేతలు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న నేతలు అధికారపార్టీపై విమర్శలు చేస్తుండగా 'జివిఎల్‌' మాత్రం టిడిపిపై విమర్శలు గుప్పించడంపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 

'జివిఎల్‌' 'జగన్‌' ప్రభుత్వంపై సానుభూతిని చూపిస్తున్నారని, ఆయన ప్రతిపక్షపార్టీపై విమర్శలు చేయడమే దీనికి నిదర్శనమని వారు చెబుతున్నారు. 'జగన్‌' అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే సీనియర్‌ బిజెపి నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ 'జగన్‌' ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల పరిస్థితి పొయ్యిలో నుంచి పెనంలోకి పడినట్లు అయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆయన బాటలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు 'కన్నాలక్ష్మీనారాయణ' తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, తాజాగా బిజెపిలో చేరిన 'సుజనాచౌదరి' తదితర నేతలు 'జగన్‌' ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వమని విమర్శలు గుప్పిస్తుంటే 'జివిఎల్‌' మాత్రం 'జగన్‌' ప్రభుత్వం బాగా చేస్తుందని కితాబు ఇస్తున్నారు. రాష్ట్రానికి చెందిన బిజెపి నేతలు, రాష్ట్ర ఇన్‌ఛార్జిలు 'జగన్‌' ప్రభుత్వంపై మండిపడుతుంటే 'జివిఎల్‌' మాత్రం అధికారపక్షాన్ని సమర్థించడం బిజెపి నేతలను ఇరకాటంలోకి నెట్టేస్తోంది.ఒకవైపు సీనియర్‌ నాయకులు, ఇతర నాయకులువిమర్శలు చేస్తున్న సమయంలో 'జివిఎల్‌' ఆ ప్రభుత్వానికి కితాబు ఇవ్వడం సరికాదని ఓ సీనియర్‌ నేత చెబుతున్నారు. 'జివిఎల్‌'కు టిడిపిపై వ్యక్తిగత కక్ష ఉందని, అందుకే ఆయన 'జగన్‌'కు మద్దతు ఇస్తున్నారని కూడా ఆ నేత పేర్కొన్నారు. మొత్తం మీద..అధికారపార్టీపై పోరాడాల్సిన బిజెపి నేత ప్రతిపక్షంపై విమర్శలు గుప్పిస్తుంటే చూడడానికి ఎబ్బెట్టుగా ఉందని టిడిపికి చెందిన నేతలు చెబుతున్నారు. మరి తనపై వస్తోన్నవిమర్శలను చూసైనా 'జివిఎల్‌' తన పద్దతి మార్చుకుంటారా..? ఏమో చూడాలి మరి. 

(265)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ