WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హరిబాబు,కామినేని,విష్ణులు టిడిపిలో చేరతారా...!?

విభజనతో నష్టపోయిన...ఆంధ్రాను ఆదుకుంటామని...ఢిల్లీకి మించిన రాజధాని నిర్మిస్తామని గత ఎన్నికల్లో..ఓటు వేయించుకుని ఇప్పుడు నమ్మించి గొంతు కోసిన బిజెపి పెద్దల నిర్వాహకంపై రాష్ట్రంలోని బిజెపి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా...? అంటే అవుననే అంటున్నారు వారి సన్నిహితులు. అందరు నేతలు కాకపోయినా...ఓ మంత్రి, మరో ఎంపి, ఎమ్మెల్యే ఒకరు కేంద్ర బిజెపి నాయకులు చేస్తోన్న రాజకీయంపై అసహనం, అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. నాలుగేళ్ల నుంచి రాష్ట్రానికి ఏదో విధంగా సహాయం చేస్తారని, దాని వల్ల పార్టీకి మైలేజ్‌ వస్తుందని, రాష్ట్రంలో పార్టీ విస్తరిస్తుందని భావిస్తున్న వారికి బిజెపి పెద్దలు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర మనస్థాపానికి గురి చేస్తోందట. నిన్నటి దాకా..బడ్జెట్‌లో ఆంధ్రాకు ఎంతో కొంత న్యాయం చేస్తారనే భావనతో ఉన్న వారు..నిన్న ప్రకటించిన బడ్జెట్‌ చూసి..నివ్వెరపోయారట. ఇదేమి బడ్జెట్‌ అని, ఆంధ్రాకు కేటాయింపులేవని...వారిలో వారు మధనపడుతున్నారట. ఎన్నికల ముందు మనమేమి చెప్పాం..ఈ నాలుగేళ్లలో ఏం చేశాం..అని ప్రశ్నించుకుంటున్నారట. ఇప్పటికే తమ పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారట. మరి కొందరు మాత్రం ఇదే సరైన వ్యూహమని, ఆంధ్రాకు ఏమి ఇచ్చినా..ప్రజలు ఓట్లు వేయరని, అటువంటప్పుడు..ఇవ్వకుండా..ఎండబెడితేనే దారికొస్తారని బిజెపి పెద్దలకు సలహా ఇస్తున్నారట. దీన్ని వారు తూ.చా తప్పకుండా ఆచరిస్తున్నారని అందుకే..ఇటువంటి పరిస్తితి ఎదురైందని వారు చెపుతున్నారట. ఈ విధంగా వ్యవహరిస్తే..రాబోయే ఎన్నికల్లో తాము గెలిచే పరిస్తితి లేదని...తాము పార్టీలో ఉండలేని స్తితిలో ఉన్నామని తమకు వేరే పార్టీనే గతని వారు చెబుతున్నారట.

   ముఖ్యంగా విశాఖపట్నం ఎంపి హరిబాబు, వైద్యవిద్యాశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట. గత ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి వైకాపా గౌరవ అధ్యక్షురాలు 'వై.ఎస్‌.విజయమ్మ'పై లక్ష ఓట్ల తేడాతో గెలిచిన 'హరిబాబు' తాజా పరిస్థితులతో చాలా విచారంగా కనిపిస్తున్నారట. విశాఖకు రైల్వేజోన్‌ తెస్తామని మొన్నటి దాకా చెప్పాం..దాన్ని ఇప్పుడు ఇవ్వమని బిజెపి తేల్చి చెబుతోంది..ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని ఆయన వాపోతున్నారట. నెమ్మదస్తుడిగా పేరున్న 'హరిబాబు' ఈ పరిస్థితులతో కలత చెందుతున్నారట. బిజెపి పెద్దలు ఈ విధంగా వ్యవహరిస్తే..తాను చేసేదేముందని, తన దారి తాను వెతుక్కోవడం ఖాయమ్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయట. పరిస్థితి ఇదే విధంగా ఉంటే ఆయన టిడిపిలో చేరతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారట. మరో రెండు మూడు నెలల్లో టిడిపి రాజకీయ నిర్ణయం తీసుకుంటుదని, దానిలో భాగంగా ఎంపీ పదవులకు వారు రాజీనామా చేస్తారని, వారితో పాటు తాను కూడా రాజీనామా చేసి..ప్రజల వద్దకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారట. ఆయనకు తోడుగా మంత్రి కామినేని శ్రీనివాస్‌ కూడా వస్తారని చెబుతున్నారు. మొదటి నుంచి 'కామినేని' టిడిపి మనిషే. గత ఎన్నికలకు ముందు ఆయన బిజెపిలో చేరి..ఎమ్మెల్యేగా గెలిచారు. సిఎం చంద్రబాబుకు ఆయన సన్నిహితుడని పేరుంది. అదే విధంగా తాను టిడిపి వల్లే ఎమ్మెల్యేగా గెలిచానని చెబుతారు..విష్ణుకుమార్‌రాజు. ఆ పార్టీలో ఉంటే..ఈసారి గెలవడం కష్టమని..బిజెపి తీరు ఇదే రీతిలో ఉంటే తాను కూడా టిడిపి తీర్థం పుచ్చుకోవడానికి వెనుకాడనని..ఆయన అంతరంగిక సమావేశాల్లో చెబుతున్నారట. మొత్తం మీద..ఈ ముగ్గురు నాయకుల వ్యవహారశైలి చూస్తుంటే..వారు బిజెపికి షాక్‌ ఇచ్చేందుకు సంసిద్ధమై ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. చూద్దాం...మరి ఏం జరుగుతుందో...!?


(2346)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ