'పవన్‌' ప్రశ్నించడం లేదెందుకో.....!? 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పవన్‌' ప్రశ్నించడం లేదెందుకో.....!?

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాకు అన్యాయం జరిగిందని రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజలు, రాజకీయనాయకులు, రాజకీయ విశ్లేషకులు, మీడియా రోజూ విమర్శలు గుప్పిస్తుంటే..తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు మాత్రం నోరు విప్పడం లేదు. వారు ప్రముఖులే కాదు..రాజకీయనాయకులు కూడా. సిఎం కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి కూడా ఈ అన్యాయంపై నోరు విప్పలేదు...సరే..ఆయన నోరు విప్పలేకపోయినా..ప్రశ్నిస్తానన్న 'పవన్‌కళ్యాణ్‌' ఎందుకు ప్రశ్నించడం లేదనే ప్రశ్న ఆయన అభిమానులతో పాటు..సగటు పౌరులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆంధ్రప్రదేశ్‌ రగిలిపోతుంటే...'పవన్‌' మాత్రం మౌనాన్నే ఆశ్రయించారు. గతంలోనే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఒకటే హడావుడి చేసిన 'పవన్‌' ఇప్పుడు నోరెత్తకపోవడంపై పలు సందేహాలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఎందుకు మౌనం...!

ఆంధ్రాకు ప్రత్యేకహోదా ఇవ్వలేమని...ఆ స్థానంలో ప్రత్యేక నిధులు ఇస్తామని కేంద్రం అప్పుడెప్పుడో ప్రకటన చేసినప్పుడు 'పవన్‌కళ్యాణ్‌' ఆవేశంగా స్పందించారు. రాష్ట్రంలో వివిధ చోట్ల సభలు నిర్వహించి..పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రాకు అన్యాయం చేసినవారి సంగతి తేలుస్తానంటూ..కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తరువాత..చల్లబడిపోయారు. అది అప్పట్లో ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా లేని రోజుల్లో...మరి ఇప్పుడేమైంది. రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని..'జనసేన' రాజకీయపార్టీగా రూపాంతరం చెందుతుందని, తాను సినిమాలు వదిలేశానని..ఇక పూర్తిస్థాయిలో రాజకీయాలపైనే గురిపెడతానని చెప్పిన 'జనసేన' అధ్యక్షుడు ఇంతటి కీలకమైన విషయంపై నోరెందుకు ఎత్తడం లేదనే ప్రశ్న...సామాన్య ప్రజలతో పాటు..'జనసేన' కార్యకర్తలనూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆంధ్రాకు, తెలంగాణాకు అన్యాయం జరిగిందని లోకమంతా కోడై కూస్తున్నా...ఎందుకు 'పవన్‌' మౌనంగా ఉంటున్నారు. 'జనసేన' వర్గాలు కూడా దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రశ్నిస్తే...లాభమే కదా...!?

నూతన రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నానని, తనకు  పదవులపై ఆశలేదనే 'పవన్‌' ఆంధ్రాకు జరిగిన అన్యాయంపై నోరెత్తకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన సీరియస్‌ రాజకీయాలకు పనికిరారని, పనిలేనప్పుడు ఆయన రాజకీయాలను వేదికగా చేసుకుంటారనే విమర్శలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం, రైల్వేజోన్‌ విషయంలో మాటతప్పడం, రాజధానికి నిధులు కేటాయించకోవడం తదితర విషయాలపై 'పవన్‌' బడ్జెట్‌ వచ్చిన రోజే స్పందిస్తే..ఆయనకు మైలేజ్‌ వచ్చేది కదా..అని ఆయన సన్నిహితులు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాన ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి బడ్జెట్‌పై అధికారికంగా స్పందించలేదు.. అప్పుడు 'పవన్‌' దాన్ని వినియోగించుకుని ఉంటే...ఆయనకు ప్రజల్లో గ్రాఫ్‌ పెరిగేది. కానీ..ఆయన దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనే మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా రాజకీయాల్లో స్థిరంగా రాణించాలనే భావనతో ఉన్నవారు ఇటువంటి అవకాశాలను వదులుకోరని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


(393)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ