లేటెస్ట్

'గొట్టిపాటి' ఉపఎన్నిక తెస్తారా...!?

అద్దంకి శాసనసభ్యుడు 'గొట్టిపాటి రవికుమార్‌' ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వైకాపాలో చేరిపోతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన టిడిపి తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడంతో, ఆ పార్టీ నుంచి ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారతారని జోరుగా వార్తలు వచ్చాయి. ఎన్నికలు ముగిసి మూడు నెలలు అయినా...ఎవరూ ఇంత వరకు ఆ పార్టీని వీడి వెళ్లలేదు. అయితే ఇప్పుడు 'అద్దంకి' ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. 2014 ఎన్నికల సమయంలో వైకాపా తరుపున 'అద్దంకి' నుంచి పోటీ చేసి గెలిచిన 'రవికుమార్‌' తరువాత టిడిపిలో చేరారు. అయితే అప్పట్లో ఆయనను టిడిపిలో చేర్చుకోవడాన్ని సీనియర్‌ నాయకుడు 'కరణం బలరామ్‌' వ్యతిరేకించారు. అయితే 'గొట్టిపాటి' అవసరం పార్టీకి ఉందని 'చంద్రబాబు' కరణానికి నచ్చచెప్పి..ఆయనను పార్టీలోకి తీసుకున్నారు. అయితే 'గొట్టిపాటి' పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయనను ఏదో విధంగా ఇబ్బందులు పాలు చేయడానికి 'బలరామ్‌' ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల సమయం వరకు జరిగిన ఈ గొడవ చివరకు 'బలరామ్‌' చీరాలలో పోటీ చేయడం, టిడిపి ఓడిపోవడంతో ముగిసిపోయింది. ఎప్పుడైతే టిడిపి ఓడిపోయి వైకాపా అధికారంలోకి వచ్చిందో, ఇక అప్పటి నుంచి 'గొట్టిపాటి' పార్టీ మారతారనే ప్రచారం జరుగుతూనే ఉంది. గతంలో వైకాపాలో ఉండడం, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 'గొట్టిపాటి' సన్నిహితుడు కావడంతో..ఆయన వైకాపాలోకి ఏ క్షణంలోనైనా వెళతారని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ఆయన సన్నిహితులు భావిస్తూ వచ్చారు. ఆయన పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతున్నా..ఇప్పటి వరకు ఆయన ఖండించలేదు. తాజాగా..ఇప్పుడు మరోసారి...ఆయన వైకాపాలోకి వెళతారని వార్తలు వస్తున్నాయి. ఆయన కనుక వైకాపాలోకి వెళితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. 

వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తమ పార్టీలోకి ఎవరైనా రావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చిన తరువాతే చేర్చుకుంటామని చెప్పారు. పార్టీ మారిన వారి సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన స్పీకర్‌కు కూడా సూచించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'రవికుమార్‌' వైకాపాలో చేరితే ఆయన సభ్యత్వం రద్దు అవుతుంది. దీంతో..ఉపఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఒకవేళ 'జగన్‌' తాను గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే మాత్రం 'గొట్టిపాటి' ఉప ఎన్నికను ఎదుర్కోవాల్సిందే. అయితే ఈ సవాల్‌కు 'గొట్టిపాటి' సిద్దపడే పార్టీ మారడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడంటున్నారు. మొత్తం మీద...'గొట్టిపాటి' పార్టీ మారితే సార్వత్రిక ఎన్నికల తరువాత జరగబోయే మొదటి ఉప ఎన్నిక ఇదే అవుతుంది. చూద్దాం..మరి ఏమి జరుగుతుందో..?

(678)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ