WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాజీనామా' చేయకపోతే...రౌడీలచేత...పిడిగుద్దులే...!

హైదరాబాద్‌లో ఐటి కంపెనీ నిర్వాహకం...!

'రమేష్‌' (పేరు మార్చాం) ఓ మల్టీనేషనల్‌ ఐటి కంపెనీలో ఉన్నతస్థానంలో ఉన్న ఉద్యోగి. నెలకు ఐదెంకల జీతంతో..కుటుంబంతో హాయిగా జీవిస్తున్నాడు. స్వంత ఇళ్ళు...కారు..కుమార్తెకు ఓ మంచి స్కూల్‌లో సీటు..ఇతర సౌకర్యాలతో హాయిగానే జీవిస్తున్నాడు. స్వంత ఊరిలో రెండు,మూడు ఎకరాల పొలం కొని చూసే వాళ్లకు మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు. గత 15ఏళ్ల నుంచి..పెద్ద సంస్థలో పనిచేస్తుండడంతో..ఉద్యోగానికి భద్రత ఉంది. జీవితం హాయిగా సాగిపోతుందనుకున్న సమయంలో... ఉద్యోగంలో ఒడిదుడుకులు ప్రారంభం అయ్యాయి. కంపెనీలో కొందరిని తీసివేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది...! మనం..సీనియర్‌ కదా..మనలను తీసివేయరులే...అని ఊరిడించుకుంటున్నాడు.. ఎప్పటిలా..ఆ రోజు కూడా..కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలో ఏదో చెప్పరాని వాతావారణం కనిపిస్తోంది..! ఎవరికి వారు టెన్షన్‌తో ఉన్నారు..కొందరు ఉద్యోగులను కంపెనీకి చెందిన వ్యక్తి...ఓ రూమ్‌లోకి పిలుస్తున్నారు. ఆ గదిలోకి వెళ్లిన పది నిమిషాలకే..విషాదకరమైన మొహంతో బయటకు వస్తున్నారు...అసలు ఏమి జరుగుతుందో..ఎవరికి అర్థం కాలేదు..చివరకు 'రమేష్‌' వంతు వచ్చింది..ఆయన లోపుకు వెళ్లారు...మరో పది నిమిషాల్లో అక్కడ ఏం జరుగుతుందో..ఆయనకు అర్థం అయింది.

    గత కొన్నాళ్లుగా తాను భయపడుతున్నదే జరిగింది. ఐటి కంపెనీ ఉద్యోగులను తగ్గించుకోవడంలో భాగంగా..ఉద్యోగుల చేత రాజీనామాలు చేయిస్తోంది. దీని కోసం వారు మూడు రకాలైన పద్దతులను వాడుతున్నారు. వాటిలో ఒకటి ముందుగా ఎవరైతే ఉద్యోగులను తొలగించాలనుకుంటుందో..వారికి కౌన్సింగ్‌ ఇప్పిస్తోంది. మీరు ఇక్కడ రాజీనామాలు చేసి వెళ్లండి...మీకు మరో చోట ఇంత కన్నా మంచి ఉద్యోగం లభిస్తుందని చెప్పించి..ఒప్పించాలని..ప్రయత్నిస్తోంది. ఈ కౌన్సిలింగ్‌కు లొంగిన వారికి సెటిల్‌మెంట్‌ చేసి అప్పటికప్పుడే..రాజీనామాలు తీసుకుని వెళ్లగొడుతోంది. ఈ కౌన్సిలింగ్‌కు లొంగనివారికి మరో ప్రయత్నంగా డాక్టర్లతో కౌన్సిలింగ్‌ ఇప్పిస్తోంది. మీలో వ్యక్తిత్వ లోపాలు ఉన్నాయని చెబుతూ..వారి చేత ట్రీట్‌మ్మెంట్‌ ఇప్పిస్తోంది. దీనికి లొంగిన వారికి వారు చెప్పిన ప్యాకేజ్‌ తీసుకుని బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇక దీనికి లొంగని వారిపై రౌడీలను, గుండాలను ప్రయోగిస్తోంది. ఉద్యోగానికి రాజీనామా చేయమని మొండికేసిన ఉద్యోగులను ఓ గదిలోకి తీసుకెళ్లి.. గుండాలతో..కొట్టించి..వారి చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తోంది.  గదిలోకి వెళ్లారంటే..ధర్డ్‌ డిగ్రీని మించిన హింసా పద్దతులతో ఐటి ఉద్యోగులను హింసిస్తున్నారు. వారి దెబ్బలకు తాళలేక..అప్పటికప్పుడే వారు రాజీనామాల పత్రాలపై సంతకం చేసి బయటకు వస్తున్నారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో రౌడీల చేత కొట్టిస్తుండడంతో..గదిలోకి వెళ్లిన ఉద్యోగులు ఐదు నిమిషాల్లోనే రాజీనామాలపై సంతకాలు చేసి బయటకు వస్తున్నారు...ఇదేమీ సినిమాలో జరిగింది కాదు..సాక్షాత్తూ..ఘనత వహించిన హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న తంతంగం.

   కత్తిమహేష్‌, సుత్తిమహేష్‌ అంటూ..రోజుల తరబడి చర్చలు పెట్టే తెలుగు మీడియాకు ఈ సమస్య పట్టలేదు. ఇంగ్లీషు పత్రికలు దీన్ని ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రముఖమైన ఓ ఐటి సంస్థ 'వెరిజోన్‌' MNC Verizon Data Services India (VDS India)  ఈ మధ్య కాలంలో 200 మంది ఉద్యోగుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించింది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, సరైన ప్యాకేజీ ఇవ్వకుండా, ఉన్నఫళంగా తమను ఉద్యోగం నుంచి తీసివేయడంపై వారు కంపెనీ ఉన్నతాధికారులను సంప్రదించినా..వారికి వారి నుంచి ఛీత్కారమే ఎదురైంది. మొదట రాజీనామా చేయని ఉద్యోగులపై పైన చెప్పిన విధంగా మూడు పద్దతులను అనుసరించి బలవంతంగా రాజీనామాలు చేయించారు. కొందరిని కౌన్సిలింగ్‌ ద్వారా, మరి కొందర్ని డాక్టర్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా..మరి కొందరిని రౌడీలు, గుండాల చేత చావ బాదించి రాజీనామాలు చేయించారు. ఈ విషయంపై సంబంధిత ఉద్యోగులు ముందుగా తెలంగాణ లేబర్‌ కమీషనర్‌ను ఆశ్రయించినా..వారు స్పందించకపోవడంతో..హైకోర్టులో కేసు వేశారు. కోర్టు స్పందించి తెలంగాణ లేబర్‌ కమీషనర్‌కు మరియు 'వెరిజోన్‌' సంస్థకు నోటీసులు జారీ చేసింది. 

    ప్రభుత్వ పరంగా భూమిని, ఇతర సౌకర్యాలను పొందుతూ..కంపెనీని స్థాపించే సమయంలో ఇన్ని ఉద్యోగాలు ఇస్తామంటూ..ప్రభుత్వాల నుంచి ప్రయోజనాలు పొందిన మల్టీనేషనల్‌ కంపెనీలు..వారికి భారమైన ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయించి రోడ్డున పడేయడం సరికాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తంఅవుతోంది. ఇన్నాళ్లూ పనిచేయించుకుని..అంత కన్నా.. తక్కువ జీతానికి పనిచేయడానికి వచ్చే వారు ఉన్నారన్న ఉద్దేశ్యంతో తమను కంపెనీ వదిలించు కుంటోందని ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వాపోతున్నారు. ఉన్నఫళంగా తమను తొలగిస్తే.. తమపై ఆధారపడిన కుటుంబం ఏమైపోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాన్ని నమ్ముకుని ప్లాట్‌లు, ఇతర సౌకర్యాలను అమర్చుకున్న వారు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా కట్టాల్సిన నెలవారీ చెల్లింపులు..ఇతర అప్పులు వారికి ఇప్పుడు పెను ముప్పుగా మారాయి.  అంతే కాకుండా..తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని, గుండాలతో కొట్టించారని వారు ఆరోపిస్తున్నారు. సమాజంలో ఉన్నత చదువులు చదువుకుని, ఉన్నత స్థానంలో ఉన్న తాము..చివరకు రౌడీల చేత దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తుందని ఊహించలేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటికి రాష్ట్రంలో ప్రముఖ స్థానం కల్పిస్తున్నామని ఒకటే ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కె.తారకరామారావు దీనిపై దృష్టిసారించాలని, తమకు జరిగిన అన్యాయంపై ఆయన స్పందించాలని కంపెనీ ఉద్యోగులు కోరుతున్నారు. కేవలం ఇదొక్కటే..కాదు..ఇతర ఐటి, మల్టీనేషనల్‌ కంపెనీలు మొత్తం..ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా..ఎప్పుడంటే..అప్పుడు తొలగిస్తూ..వారి జీవితాలతో ఆడుకుంటుందని వారు వాపోతున్నారు.


(658)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ