‘టిడిపి’లోకి ‘కన్నా, మహాసేన రాజేష్’...!
ఎన్నికలకు మరో పద్నాలుగు మాసాలు మాత్రమే సమయం ఉండడంతో రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఒకవైపు అధికార వైకాపా ఇంటింటికి కార్యక్రమం చేపట్టి వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలనే ధ్యేయంతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలను నిత్యం ప్రజల్లో ఉండాలని, ప్రజల్లో లేని వారికి టిక్కెట్లు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పేశారు. కొన్ని చోట్ల టిక్కెట్లను కేటాయిస్తూ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అధికార పార్టీకి ధీటుగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను నిర్వహిస్తుండగా, పార్టీ అధినేత జిల్లాల్లో పర్యటిస్తూన్నారు. అయితే ఈ పర్యటనల సందర్భంగా పలువురు నేతలు టిడిపిలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి భారీగా వలసలు వచ్చే అవకాశం ఉంది. అయితే..టిడిపి అధినేత అందరినీ పార్టీలో చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారు. వీరు కాకుండా బిజెపి నుంచి కూడా చాలా మంది నేతలు టిడిపిలోకి వస్తామని రాయబారాలు పంపిస్తున్నారు. గతంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ‘కన్నా లక్ష్మీనారాయణ’ నేడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 24వ తేదీన టిడిపిలో చేరతారంటున్నారు. ఆయనతోపాటు గత ఎన్నికల్లో వైకాపా గెలవాలని కృషి చేసిన ‘మహాసేన రాజేష్’ కూడా టిడిపిలో చేరబోతున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన ‘రాజేష్’ రాకను టిడిపిలో మొదటి నుంచి ఉంటున్న దళిత నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన గతంలో టిడిపిని దూషించారని, అధినేతను, ఆయన తనయుడిని తీవ్రంగా విమర్శించారని ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని కొందరు నేతలు పార్టీ అధినాయకత్వాన్ని కోరుతున్నారు. అయితే గతంలో ఆయన చేసిన తప్పుల నుంచి పాఠం నేర్చుకున్నానని ఆయన చెబుతుండగా, గతంలో చేసిన విమర్శలకు క్షమాపణ చెప్పి ఉన్నందున ఆయనను పార్టీలో చేర్చుకుంటే తప్పేం లేదని మరికొందరు నేతలు అంటున్నారు. ఆయన సంగతి అలా ఉంచితే గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త ‘కన్నా లక్ష్మీనారాయణ’ టిడిపిలో చేరతారనే వార్త జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. కాపు సామాజికవర్గానికి చెందిన ‘కన్నా’ మొదటి నుంచి కాంగ్రెస్‌లో కీలకనేతగా ఉన్నారు. నాలుగు సార్లు ఆపార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పలుసార్లు మంత్రి పదవిని నిర్వహించారు. గుంటూరు జిల్లాలో బలమైన అనుచరవర్గం కలిగిన నాయకునిగా ‘కన్నా’కు గుర్తింపు ఉంది. 2014 ఎన్నికల తరువాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన తొలుత వైకాపాలో చేరాలని ముహూర్తం నిర్ణయించుకుని పాదయాత్రలో ఉన్న ‘జగన్’ను కలిసేందుకు వెళ్లబోతుండగా ‘బిజెపి’ అధిష్టానం ఆయనను ఆపి తమ పార్టీలో చేర్చుకుని రాష్ట్ర పార్టీ పగ్గాలను అందించింది. అయితే తరువాత ఆయనను అధ్యక్ష పదవి నుంచి బలవంతంగా తొలగించింది. అప్పటి నుంచి ఆయన ‘బిజెపి’పై అసంతృప్తితో ఉన్నారు. రాజధాని అమరావతి విషయంలో ‘బిజెపి’ వ్యవహారం ‘కన్నా’కు నచ్చలేదు. ‘అమరావతే’ రాజధానిగా ఉండాలని ఆయన బలంగా కోరుకున్నారు. అయితే పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గం ఆయనకు పొగపెట్టింది. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బిజెపికి రాజీనామా చేస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరగుతోంది. ఆయన బిజెపికి రాజీనామా చేస్తే ‘జనసేన’లో చేరతారని అందరూ అంచనా వేశారు. అయితే అనూహ్యంగా ఆయన టిడిపిలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన టిడిపిలోకి వస్తే ఆయనకు టిడిపికి ఇద్దరికీ మేలు జరుగుతుందనే భావన రాజకీయవర్గాల్లో ఉంది. గుంటూరు జిల్లాలో ఆయన రాకతో ‘టిడిపి’కి ‘కాపు’ల్లో మంచి పట్టుదొరుకుతుందని, అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కాపులకు ఒక సందేశం పంపుతుందనే భావన ఉంది. ఇద్దరికీ సమాన లాభం ఉంది కనుక..గతంలో ఆయన చంద్రబాబుపై, టిడిపిపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఆయనను స్వాగతించాలని పార్టీ సీనియర్ నేతలు కోరుకుంటున్నారు. మొత్తం మీద ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉన్నా..పలు పార్టీలకు చెందిన నేతలు ‘టిడిపి’నే ఎంచుకుంటున్నారు. నాయకుల తీరుతో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో అర్థం అవుతోంది.