‘పిన్నమనేని’ కుటుంబం నుంచి ఒకరికి ఛాన్స్...!
బాబాయ్, అబ్బాయ్ లలో ఒకరికి ఛాన్స్!
- ఏలూరు, కృష్ణాలో చెక్కు చెదరని నాయకత్వం
- మాగంటి కుటుంబంతోనూ అవినాభావ సంబంధం
- కైకలూరు నుండి పోటీ చేసేందుకు సన్నాహాలు
- చంద్రబాబు పరిశీలనలో కైకలూరు టీడీపీ సీటు
- సీటిస్తే రెండు జిల్లాల పైనా పిన్నమనేని ప్రభావం
- తిరిగి పిన్నమనేని గూటికి చేరుకుంటున్న నేతలు
- 20ఏళ్ళ తర్వాత పిన్నమనేని శిబిరంలో సందడి
గుడివాడ, ఫిబ్రవరి 18: దశాబ్దాల తరబడి కృష్ణాజిల్లాను, ముఖ్యంగా రద్దయిన ముదినేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా రాజకీయాలను శాసించిన పిన్నమనేని కుటుంబం నుండి 20 ఏళ్ళ తర్వాత బాబాయ్, అబ్బాయ్ లలో ఒకరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసే ఛాన్స్ రానుందని ప్రచారం జరుగుతోంది. రెండుసార్లు ముదినేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు దాదాపు 30 ఏళ్ళ పాటు కృష్ణాజిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసి రాజకీయ దురంధరునిగా పేరుగాంచారు. ఆయన కుమారుడు పిన్నమనేని వెంకటేశ్వరరావు కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆప్కాబ్ చైర్మన్ గా కూడా పనిచేశారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు పెదనాన్న మనువడు పిన్నమనేని బాబ్జి కూడా గుడివాడ లేదా కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మాగంటి రవీంద్రనాథ్ చౌదరితో పిన్నమనేని కోటేశ్వరావుకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. మాజీ ఎంపీ మాగంటి బాబుతో మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు కూడా నేటికీ అవే సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. దీన్నిబట్టి మాగంటి, పిన్నమనేని కుటుంబాలకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉందని అర్థమవుతుంది. పిన్నమనేని కుటుంబంలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఉన్నప్పటికీ పోటీ చేయడానికి మాత్రం రద్దయిన ముదినేపల్లి నియోజకవర్గం స్థానంలో మరొక అసెంబ్లీ నియోజకవర్గం లేకపోవడంపై ఇప్పుడు ఏలూరు, కృష్ణాజిల్లాల్లో ఉన్న బలమైన నాయకత్వం అంతర్మథనంలో పడిపోయింది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో పిన్నమనేని కుటుంబం ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ముదినేపల్లి నియోజకవర్గం రద్దయింది. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన జిల్లాల విభజనలో పిన్నమనేనికి కంచుకోటగా ఉన్న ముదినేపల్లి మండలాన్ని కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కలిపారు. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం కృష్ణాజిల్లా నుండి విడిపోయి ఏలూరు జిల్లాలోకి చేరిపోయింది. పిన్నమనేని సొంత మండలం నందివాడను గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కలపడం జరిగింది. కైకలూరు అసెంబ్లీ పరిధిలోని మండవల్లి లంక గ్రామాల్లో పిన్నమనేని కుటుంబానికి మంచి పట్టు కూడా ఉంది. దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు రాజకీయమంతా కొల్లేరు లంక గ్రామాలతోనే ముడిపడి ఉండేది. 30 ఏళ్ళ పాటు జడ్పీ చైర్మన్ గా పనిచేసిన దివంగత కోటేశ్వరరావు కృష్ణాజిల్లాలోని అనేక గ్రామాల్లో పాఠశాలల ఏర్పాటు, రోడ్లు, మంచినీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతగానో కృషి చేశారు. ఏలూరు జిల్లా పరిధిలోని పలు మండలాల్లో కూడా పిన్నమనేని కుటుంబానికి మంచి ఆదరణ ఉంది. ఏలూరు, కృష్ణాజిల్లాల్లోని అన్ని గ్రామాల్లో పిన్నమనేనికి చెక్కు చెదరని బలమైన నాయకత్వం కూడా కొనసాగుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో రద్దయిన ముదినేపల్లి అసెంబ్లీ స్థానంలో కైకలూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు పిన్నమనేని కుటుంబం సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బాబాయ్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, అబ్బాయ్ పిన్నమనేని బాబ్జిలలో ఒకరికి సీటివ్వాలని గతంలోనే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వైసీపీలో చేరిన నేపథ్యంలో టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం పిన్నమనేని కుటుంబం ఎదురుచూస్తున్నట్టుగా సమాచారం. పిన్నమనేని కుటుంబానికి కైకలూరు టీడీపీ సీటును కేటాయిస్తే ఏలూరు, కృష్ణాజిల్లాల్లోని తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతుందన్న సంకేతాలు కూడా ఉన్నాయి. గత 20 ఏళ్ళుగా పిన్నమనేని కుటుంబం నామినేటెడ్ పదవులకే పరిమితం కావడంతో కొంత మంది నేతలు వివిధ పార్టీల్లోకి వెళ్ళిపోయారు. వారంతా ఇప్పుడు పిన్నమనేని గూటికి చేరే పనిలో నిమగ్నమై ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పిన్నమనేని కుటుంబం తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో గత కొద్దిరోజులుగా పిన్నమనేని శిబిరంలో సందడి మాత్రం కన్పిస్తోంది.