లేటెస్ట్

వందరోజుల్లో అవినీతి తగ్గిందా...!?

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టి వందరోజులు గడిచిపోయాయి. ప్రజలు ఎంతో నమ్మకంతో వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైకాపా పార్టీకి అసాధారణ మెజార్టీ కట్టబెట్టి అధికారంలో కూర్చోబెట్టారు. తాము అధికారంలోకి వస్తే..మంచిపరిపాలన ఇస్తామని, అవినీతిని అరికడతామని, అవినీతిపరులను జైలుకు పంపిస్తామని ఆ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. నాడు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని, ప్రతి విషయంలో అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. పలు బహిరంగ సభల్లో, పాదయాత్రల్లో ఆయన ఇదే విషయాన్ని పదే పదే నొక్కివక్కాణించారు. టిడిపి ప్రభుత్వం అవినీతిమయమైందని, చంద్రబాబునాయుడుతో పాటు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, ఇతర అనుబంధ విభాగాలకు చెందిన నాయకులు, ప్రభుత్వ అధికారులు, సీనియర్‌ ఐఎఎస్‌లు, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పాడ్డారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను బహిరంగంగా దోచుకున్నారని విమర్శలు కుప్పించారు. ఇసుక, మట్టి వంటి విషయాల్లో అవినీతి పరాకాష్టకు చేరిందని, టిడిపి ఎమ్మెల్యేలు ఇసుకను దోచుకుని కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. అదే విధంగా పోలవరం, అమరావతి, ఇతర సంక్షేమపథకాల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆక్షేపించారు. ఇవే కాకుండా సోలార్‌ పవర్‌, విండ్‌పవర్‌ ఒప్పందాల్లో అక్రమాలు, అవినీతి జరిగిందని ఆరోపించారు. అధికారం చేపట్టిన వెంటనే వీటిపై వివిధ కమిటీలను ఏర్పాటు చేసి..అవినీతిని బయటకు లాగుతున్నామని పదే పదే చెప్పుకుంటున్నారు. విద్యుత్‌ ఒప్పందాలపై, పోలవరం రివర్స్‌ టెండర్లపై విచారణ వద్దని కేంద్రం కోరినా..వారి మాటలను ఖాతరు చేయకుండా...విచారణ,రివర్స్‌టెండరింగ్‌ చేపట్టారు. టిడిపి హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందన్న దానిపై మరో మాటకు ఆస్కారం లేదు. ఈ అవినీతిపై విచారణ జరగాల్సిందే. అయితే..ఏ అవినీతిపై తాను పోరాడుతున్నానని చెబుతున్నాడో..అదే అవినీతి తన ప్రభుత్వంలో లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చూసుకుంటున్నారా..? అంటే సరైన సమాధానంరావడం లేదు. 

ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన వంద రోజుల తరువాత..అవినీతిపై ప్రశ్న వేసుకుంటే సంతృప్తికరమైన సమాధానం రావడం లేదు. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో అవినీతి తగ్గిందా..? పెరిగిందా..? అంటే సమాధానం చెప్పడం కష్టమే. ముఖ్యమంత్రిగా ఆయన నిజాయితీగానే వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. అయితే ఆయన ఉన్నరీతిలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు ఉన్నారా..? అంటే లేదనే చెప్పాలి. ముఖ్యంగా పలువురు ఎమ్మెల్యేల వ్యవహారం పార్టీకి చెడ్డపేరు తెచ్చిపెడుతుంది. కొందరు ఎమ్మెల్యేలు అప్పుడు తమ నియోజకవర్గాల్లో చక్రవర్తుల్లా వ్యవహరిస్తున్నారు. తాము చెప్పిందే చేయాలని, అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో తమ మాటే నెగ్గాలని వారు ఒత్తిడి తెస్తున్నారు. బదిలీలకు, పోస్టింగ్‌లకు సొమ్ములు వసూళ్లు చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని వ్యాపారులను, ఇతర ఫ్యాక్టరీ యజమానులను పిలిపించుకుని నెలకు ఇంత ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజధాని ప్రాంతంలో ఓ ఎమ్మెల్యే ఇప్పటికే తన పరిధిలోని వ్యాపారులను పిలిపించుకుని మాట్లాడారని, మామూళ్లు ఇవ్వాలని అడిగారని తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలోనే కాదు..ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇదే కాదు..ఇసుక విషయంలో అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుకపై నిషేదాన్ని విధించింది. దీన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉపయోగించుకున్నారని, ఇసుకలో భారీగా సొమ్ములు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. కొందరు మంత్రులైతే అప్పుడే వందకోట్లు వరకు సంపాదించారని సొంత పార్టీనేతలే చెప్పుకుంటున్నారు. ఇసుకే కాదు..పోలీసుల బదిలీలు, పోస్టింగ్‌లు, ఇతర అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల్లోనూ భారీ స్థాయిలో సొమ్ములు చేతులు మారాయని ప్రచారం జరుగుతోంది. వీటిలో మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులు కలుగ చేసుకున్నారని, వారే వాసూళ్లకు తెగబడ్డారని తెలుస్తోంది. గతంలో తాము ఏ విషయంపై అయితే టిడిపిపై విమర్శలు, ఆరోపణలు చేశారో...నేడు అదే పనులు అధికార పార్టీ నేతలు చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. మొత్తం మీద..వంద రోజుల 'జగన్‌'పాలనలో పై స్థాయిలో అవినీతిపై పెద్దగా ఆరోపణలు, విమర్శలు లేకపోయినా..ఎమ్మెల్యేలు, మంత్రుల విషయంలో మాత్రం తీవ్రస్థాయిలో దుమారం రేగుతోంది. మరి అధికార పార్టీ పెద్దలు..తమ ఎమ్మెల్యేలను, మంత్రులను అదుపులో పెట్టుకుంటారా..? లేక 'చంద్రబాబు' వదిలేసినట్లు వదిలేసి అప్రతిష్టపాలవుతారా..? చూద్దాం..ఏం జరుగుతుందో..?

(474)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ