WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' నిర్ణయంపై 'కాపు'ల ఆగ్రహం...!

వైకాపా రాజ్యసభ అభ్యర్థిగా 'వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి'ని ప్రకటించడంపై ఆ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన 'వేమిరెడ్డి'ని రాజ్యసభకు ఎంపిక చేశామని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు 'విజయసాయిరెడ్డి' ప్రకటించడంపై పార్టీలో పలువర్గాలకు చెందిన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీకి చేసిన సేవ ఏమిటి..? మొన్నటి దాకా..ఆయన టిడిపిని నాయకులు చుట్టూ తిరిగారు..ఆ పార్టీలో రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేశారు..అక్కడ కుదరకపోవడంతో..మళ్లీ ఇక్కడకు వచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి బంధువు అయిన 'వేమిరెడ్డి' రాజ్యసభ ఎన్నికల్లో గెలిచినా పార్టీలో ఉండరని, ఆయన మళ్లీ టిడిపిలో చేరతారని వారు అంటున్నారు. అంతే కాకుండా..రాజ్యసభ సీటు ఎప్పుడూ..ఒకే వర్గానికి ఇస్తే ఎలా..?అని పార్టీలో మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.

   గతంలో రాజ్యసభ సీటును ఎవరితో సంప్రదించకుండా 'జగన్‌'తో పాటు పలు కేసుల్లో నిందితుడు, ఆడిటర్‌ అయిన 'విజయసాయిరెడ్డి'కి ఇచ్చారని...అప్పుడు..పార్టీలోని ఇతర సమాజిక వర్గాలను గుర్తించకుండా..కేవలం తమకు సన్నిహితుడనే పేరుతో..ఆయనకు ఇచ్చారని..ఇప్పుడు కూడా అదే వర్గానికి ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఒంటెద్దు పోకడలతో 'జగన్‌' ఈ నిర్ణయం తీసుకున్నారని వారు ఆక్షేపిస్తున్నారు. పార్టీకి వచ్చే ఒక్క సీటును మళ్లీ 'రెడ్డి' సామాజికవర్గానికే ఇస్తే..మిగతా వర్గాలు ఏమి కావాలని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఎస్సీ,ఎస్టీ,బిసీ,కాపులకు చెందిన నాయకులు గణనీయంగా ఉన్నారని..ఆ వర్గంలో ఎవరికో ఒకరికి ఇవ్వవచ్చు కదా..? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు తెలుగుదేశం బిసి, కాపులకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తూ..వారి ఓట్ల కోసం వారికి పదవులు కట్టబెడుతుంటే...పార్టీలో మాత్రం కేవలం 'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన వారికే పదవులు, ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు 'కాపు' నాయకులు ఆరోపిస్తున్నారు. 'వేమిరెడ్డి' వలే తాము డబ్బులు ఖర్చు పెట్టలేమన్న ఏకైక కారణంతోనే తమకు రాజ్యసభ సీటు ఇవ్వలేదని గుంటూరు జిల్లాకు చెందిన 'కాపు' నాయకుడు ఒకరు ఆక్షేపించారు. రేపు రాజ్యసభ ఎన్నికల్లో పార్టీకి ఓట్లు తగ్గితే...'వేమిరెడ్డి' అయితే కొనుగోలు చేయగలరనే అభిప్రాయంతోనే పార్టీ అధినేత 'జగన్‌' ఈ నిర్ణయం తీసుకున్నారని వారు అంటున్నారు. 

  కాగా..ఇటువంటి నిర్ణయాలు పార్టీకి మంచి చేయవని..ఇప్పటికే..కాపులకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారని..పార్టీ  ఏం చేస్తుందో...అందరూ గమనిస్తున్నారని..వారు చెబుతున్నారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 'కాపు' కులానికి చెందిన వారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ప్రోత్సహించిందని..తరువాత ఎన్నికల్లో ఈ ప్రభావం కనిపించిందని...వారిని చూసి కూడా తమ పార్టీ అధినేత నేర్చుకోవడం లేదని 'కృష్ణా' జిల్లాకు చెందిన మరో నాయకుడు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కొందరు కాపు నాయకులు టిడిపి వైపు వెళ్లిపోయారని..తాజాగా..మరి కొందరు అదేబాట పడతారని..వారు చెబుతున్నారు. మొత్తం మీద..రాజ్యసభ' సీటును 'జగన్‌' తన సామాజికవర్గానికి చెందిన నాయకుడికి కేటాయించడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మరి 'జగన్‌'ను వారి ఎలా సంతృప్తి పరుస్తాడో..చూడాలి ఉంది.


(4529)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ