WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఐదు వందలు, వెయ్యి కొట్టు...ముప్పయి మార్కులు పట్టు...!

ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల్లో కఠినవైఖరి అవలంభిస్తామని, పదే పదే అధికారులు, పాలకులు ప్రకటనలు చేసినా..రాష్ట్ర వ్యాప్తంగా..అనేక కేంద్రాల్లో ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు ఇస్తే..ప్రాక్టికల్స్‌లో ముప్పయి మార్కులు వచ్చే విధంగా చేశారు. ఈ విషయంపై పలువురుని 'జనంప్రత్యేకప్రతినిధి' రాష్ట్రంలోనిపలు ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం తదితర నగరాల్లో ఈ విధమైన పద్దతిని రహస్యంగా అమలు చేశారు. విద్యార్థులకు 29 లేదా ముప్పయి మార్కులు వేయించారు. ఎంత బందోబస్తు పెట్టినా..ఎన్ని హెచ్చరికలు చేసినా..ఇన్‌కెమెరా పద్దతిని అమలు చేసినా...డబ్బులు చేతులు మారడంతో విద్యార్థులకు మార్కులు లభించాయి. ఈ సంఘటనలు గుట్టుగా జరగగా..అంతకు ముందు ఒక్కో విద్యార్థి నుండి ఐదువందల నుండి వెయ్యి రూపాయలను కళాశాల యాజమాన్యాలు వసూలుచేశాయి. తాజాగా కూడా ఈ వసూళ్ల కార్యక్రమానికి తెరతీశారు. కొన్ని సెంటర్లల్లో డబ్బులు లేని వారి దగ్గర నుండి వంద రూపాయలు వసూళ్లు చేశారు. సొమ్ముల కోసం కక్కుర్తిపడి విద్యార్థులకు మార్కులు వేయించారంటే...పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం అవుతుంది. వ్యవస్థలో ఎన్ని కాపలాలు ఉన్నా..ఎంత బందోబస్తు ఉన్నా..ఏమీ చేయలేరని తెలుస్తోంది. ప్రాక్టికల్‌ పరీక్షలకు వెళ్లిన మహిళా అద్యాపకులు లంచాలు తీసుకోకుండా కఠినంగా వ్యవహరించారు. కొంత మంది లంచాలు తీసుకున్నా..మరి కొంత మంది మాత్రం ఎటువంటి కానుకలు తీసుకోలేదు. కళాశాల యాజమాన్యాల నుంచి కొందరు ముక్కుపిండి వసూలు చేశారు. యాజమాన్యాలు..విద్యార్థుల నుంచి గుంజుకొని..వీరికి చెల్లింపులు చేశారు. 

  ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభమైన పావుగంట లోపు మాత్రమే తనిఖీ చేసే ప్రత్యేక స్వాడ్‌లు కాసేపు హడావుడి సృష్టించి వెళ్లిపోయాయి. ఈ స్వాడ్‌లో ఉన్న వారికి కూడా కొన్ని సెంటర్ల నుంచి సొమ్ములు దక్కయానే ఆరోపణలు వచ్చాయి. ప్రాక్టికల్‌ పరీక్షలకు ఎంత మంది హాజరయ్యారో కానీ..వారి వద్ద నుంచి వెయ్యి నుండి రెండు వేల వరకు ప్రైవేట్‌ కళాశాల యాజమాన్యాలు వసూలు చేశాయి. వీటిలో అధికారులకు, అధ్యాపకులకు అందజేశారనేది యధార్థం. లంచాలకు ఆశపడకుండా నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరించినా..వారిని పరోక్షంగా బెదిరించిన సంఘటనలు కూడా జరిగాయి. కానీ ఏ ఒక్కరూ తమను బెదిరించారని ఫిర్యాదు చేయలేదు. అసోషియేన్‌ నాయకులు, ప్రైవేట్‌ కళాశాల యాజమాన్యాల ప్రతినిధులు ఒకరికొకరు సహకరించారనే వార్తలు వచ్చాయి. నూటికి ఐదు నుండి పది మంది మాత్రమే లంచాలకు ఆశపడలేదు..అయినప్పటికీ..అందరిపై విమర్శలు వస్తున్నాయనే ఆవేదన వ్యక్తం చేశారు.

(175)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ