WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జైలు పక్షులా..అధికారులను జైలులో పెట్టేది...?

ఒక్కొక్కరిపై పదుల కొద్దీ కేసులు..నెలల తరబడి జైలులో మగ్గిన ఇద్దరు నిందితులు...ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్‌ ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులపై విమర్శలు, ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. వారి విమర్శలు విన్న ఐఎస్‌ఎస్‌,ఐపిఎస్‌ అధికారులు విస్తుపోతున్నారు. వీళ్లా మమ్ములను విమర్శించేది..పలు అవినీతి,అక్రమాల కేసులు ఎదుర్కొంటూ..జైలు జీవితం గడిపి బెయిల్‌పై బయటకు వచ్చిన..వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు 'విజయసాయిరెడ్డి' చేసిన ఆరోపణలపై అధికారుల సంఘాలు మండిపడుతున్నాయి. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కొనుగోలులో సీనియర్‌ ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారుల హస్తం ఉందని 'వైకాపా' నేత 'విజయసారెడ్డి' చేసిన విమర్శలపై ఆ సంఘాల నాయకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

'జగన్‌' బాటలో 'విజయసాయిరెడ్డి'...!

సీనియర్‌ ఐఎఎస్‌,ఐపిఎస్‌ అధికారులపై ఎటువంటి ఆధారాలు ఉన్నాయని 'విజయసాయిరెడ్డి' బహిరంగంగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు..? ఎమ్మెల్యేలను వారు కొనుగోలు చేస్తున్నారన్న ఆయన ఆరోపణలకు ధారాలు ఏమిటి..? ఆయన ఎందుకు ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు..? ఈ ఆరోపణల వెనుక ఎవరు ఉన్నారనే దానిపై సచివాలయంలో చర్చ జరుగుతోంది. దీనిపై సంఘ నాయకులు మీడియాతో ఆఫ్‌ ది రికార్డుగా మాట్లాడుతూ..అధికారులు తప్పులు చేస్తే..కేసులు పెట్టుకోవచ్చని..లేదా..కోర్టుకు వెళ్లవచ్చని..అంతే కానీ బెదిరింపులకు పాల్పడుతూ విమర్శలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. వైకాపా నాయకులకు ఇది  అలవాటుగా మారిందని, గతంలో ఆ పార్టీ అధినేత అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్‌ అహ్మద్‌బాబును జైలుకు పంపుతానని బెదిరించారని, విశాఖలో పోలీసులపై దాడికి దిగి..తాను సిఎంనని..తనపై చేయివేస్తావా..అని బెదిరించారని...అదే దారిలో ఇప్పుడు 'విజయసాయిరెడ్డి' కూడా బెదిరింపులకు, విమర్శలకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు.

  గతంలో వీరి చేసిన అరాచకాలవల్లే కొంత మంది సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు జైలు పాలు అయ్యారని, మరి కొందరు అనారోగ్యాల పాలు అయ్యారని..వారు ఆరోపిస్తున్నారు. తాము ఎటువంటి తప్పులు చేయడం లేదని..ఒకవేళ చేస్తే..దానిపై ఫిర్యాదులు చేసుకోవచ్చని..అంతే కానీ..తమకు సంబంధం లేని విషయాల్లో ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు దాదాపు 23 మంది ఎమ్మెల్యే వైకాపా నుంచి టిడిపిలోకి వచ్చారని..అప్పుడు ఎందుకు తమపై విమర్శలు చేయలేదని వారు ప్రశ్నించారు. వారంతా ఎందుకు పార్టీ మారారో..వారికి తెలియదా..? ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారికి తెలియదా..? అని వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయనాయకులు పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటారని..దీనిలో అధికారులను లాగడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 'మీలో మీరు విమర్శించుకోండి..గొడవలు పడండి..తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్న అధికారులను మధ్యలోకి లాగి వారిని ఇబ్బందులకు గురి చేయవద్దు'...అని వారు అంటున్నారు.

'విజయసాయిరెడ్డి'... వెనుక..మాజీ సిఎస్‌...!

కాగా సీనియర్‌ ఐఎఎస్‌,ఐపిఎస్‌ అధికారులపై 'విజయసాయిరెడ్డి' విమర్శలు చేయటం వెనుక ఓ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మరో ఇద్దరు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారుల హస్తం ఉందని సంఘం నాయకులు భావిస్తున్నారు. వారు చేసిన సూచనల ప్రకారమే..'విజయసాయిరెడ్డి' విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని వారు అంటున్నారు. పాతకక్షలను మనస్సులో పెట్టుకునే ఈ మాజీ అధికారి ప్రస్తుత సీనియర్‌ అధికారులపై ఫిర్యాదులు చేయిస్తున్నారని...వారువిమర్శిస్తున్నారు. కాగా..'విజయసాయిరెడ్డి' రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ విమర్శలు చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన 'వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి'ని వైకాపా రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆయనను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న 'విజయసాయిరెడ్డి' ముందస్తు వ్యూహంలో భాగంగానే అధికారులపై ఆరోపణలు చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం వైకాపాకు ఉన్న బలం ప్రకారం 'వేమిరెడ్డి' గెలవడం అంత సులువేమీ కాదు..! దీంతో...అధికారుల సహాయంతో..టిడిపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపణలు చేస్తే...రేపు 'వేమిరెడ్డి' ఓడిపోయినా..తాను ముందే..ఈ విషయం చెప్పానని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనలో భాగంగానే అధికారులపై 'విజయసాయిరెడ్డి' ఆరోపణలు చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. అయితే రాజకీయంగా టిడిపిని ఎదుర్కోవడం చేతకాక..అధికారులపై 'విజయసాయిరెడ్డి' ఏడవడం ఏమిటనే ప్రశ్న..అధికార వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.

హైకోర్టు,సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఫిర్యాదు..!

తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న 'విజయసాయిరెడ్డి'పై హైకోర్టు,సుప్రీంకోర్టు న్యాయ మూర్తులకు ఫిర్యాదు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అధికారుల సంఘం ఆలోచిస్తోంది. తాము ఎటువంటి తప్పు చేయకపోయినా...మానసిక వేదనకు గురి చేస్తోన్న 'విజయసాయిరెడ్డి' వదల కూడదనే భావన ఆ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఒకసారి కాదు..పదే పదే ఆరోపణలు చేస్తున్నా.. స్పందిచకపోతే..చివరకు 'ప్రజలు' అదే నిజమని భావించే అవకాశం ఉందని..దీనికి ఎక్కడో ఒకచోట అడ్డుకట్టవేయాలని వారు భావిస్తున్నారు. కాగా..తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోన్న 'విజయ సాయిరెడ్డి'పై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు స్పందిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా...నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తోన్న అధికారులపై తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేయడం సరికాదనే అభిప్రాయం అధికారవర్గాల్లోనూ.. ఉద్యోగవర్గాల్లోనూ వ్యక్తం అవుతుంది.

(665)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ