లేటెస్ట్

కెసిఆర్‌కు ఇచ్చిన షాక్‌నే..జగన్‌కూ ఇస్తారా...!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో..అధికార బిఆర్‌ఎస్‌ ఓటమికి ప్రధాన కారణం నిరుద్యోగులనే చర్చ బాగా సాగుతోంది. ఆ పార్టీ నేతలు కూడా నిరుద్యోగులు తమకు షాక్‌ ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు తమ విషయంలో తీవ్రంగా స్పందించారని, అందుకే అలా ఓటమి చెందాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావానికి కారణమే ఉద్యోగాలు, నిధులు, నీళ్లని, తాము నిధులు, నీళ్ల విషయంలో కొంతవరకు బాగానే పనిచేశామని, ఈ విషయాన్ని ప్రజలు కూడా అంగీకరిస్తారని, అయితే..ఉద్యోగాల విషయంలో మాత్రం తాము విఫలమయ్యామని వారు అంతరంగిక చర్చల్లో అంగీకరిస్తున్నారు. వాస్తవానికి నిరుద్యోగులకు ఎక్కువ ఆశలు కల్పించి తామేనని, ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని, వారిలో ఎక్కడ లేని ఆశలు రేకెత్తించామని, వారు కూడా తెలంగాణ వస్తే తమ కష్టాలు తొలగిపోతాయని, తాము ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతామని, తద్వారా తమ జీవితాలు మారిపోతాయని ఎంతో ఆశ పడ్డారు. అయితే..వారు అనుకున్న విధంగా జరగకపోవడంతో..వారు ఖిన్నులయ్యారు. తెలంగాణ వచ్చిన దగ్గర నుండి అరకొర ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వడం..అదే సమయంలో వాటిని సరిగ్గా నిర్వహించకపోవడం, పరీక్ష పేపర్లు లీక్‌లు కావడం, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో..? ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారో..దేవుడికే తెలియకపోవడంతో..వారు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అయితే మొదట విడత ‘కెసిఆర్‌’ పాలనలో ఉద్యోగాలను కల్పించకపోయినా..పెద్దగా పట్టించుకోని నిరుద్యోగులు రెండో విడత పాలనలో మాత్రం తీవ్రంగా ఉద్యమించారు. వారి ఉద్యమాలకు తలొగ్గి..కెసిఆర్‌ ఒకేసారి లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. అయితే..ఇక్కటే పరీక్ష పేపర్లు లీకవడం, ప్రభుత్వం జవాబుదారీగా ఉండకపోవడంతో నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సత్తాను ఎన్నికల్లో చూపిస్తామని ప్రకటించి అనుకున్న విధంగానే..గ్రామీణ ప్రాంతాల్లో ‘కెసిఆర్‌’ ప్రభుత్వాన్ని ఘోరంగా ఓడిరచారు.


కాగా..ఎంతో కొంత అభివృద్ధి, సంక్షేమం చేసిన ‘కెసిఆర్‌’కే ఇటువంటి ఫలితాలు ఎదరుయితే..ఇక ‘ఆంధ్రా’లో ఎటువంటి ఫలితాలు వస్తాయో..అనే దానిపై అధికార వైకాపా నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా యువత తమపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న విషయం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నిరుద్యోగులకు పలురకమైన వాగ్ధానాలు చేశారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేస్తానని, ఏడాది లోగా ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. యువతతో పలు సదస్సులు ఏర్పాటు చేయించి దానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై వారిని ప్రలోభపెట్టారు. తాను అధికారంలోకి రావడంతోనే..వారి జీవితాలు మారిపోతాయని, జగనన్న సిఎం అయితే..ఇక తిరుగే లేదని, యువకుడైన సిఎం ఉంటే యువకుల సమస్యలను, నిరుద్యోగుల సమస్యలను తీరుస్తాడని ఆయన వారికి నూరిపోశారు. ఆయన హామీలను నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు గట్టిగా నమ్మారు. దీంతో వైకాపాకు ఎన్నికల్లో యువకులు, విద్యార్థులు, నిరుద్యోగుల ఓట్లు గంపగుత్తగా పడ్డాయి. వీరి ఓట్లతో పాటు, మహిళలు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, కర్షకులు, ఒకరేమిటి..అందరూ ఆయన హామీలను నమ్మి వైకాపాకు రికార్డు స్థాయి మెజార్టీ కట్టబెట్టారు. అయితే..అధికారంలోకి వచ్చిన ‘జగన్‌’ వారికిచ్చిన హామీలను నిలబెట్టుకున్నారా..అంటే లేనే లేదు. ప్రతి ఏడాది ఇస్తాన్న ఉద్యోగ క్యాలెండర్‌ను అటకెక్కించారు. రెండేళ్ల క్రితం మాత్రం ఒకసారి ఉద్యోగ క్యాలెండర్‌ అంటూ పదివేల పోస్టులను ప్రకటించారు. ఆ తరువాత దాని సంగతి ఏమైందో..ఎవరికీ తెలియదు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే..ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్న ఆయన హామీ నీటి మీద రాతే అయింది. తాము ఇచ్చిన అన్ని హామీల్లో 99శాతం అమలుచేశామని, ఇంతకన్నా చేసేదేముందని ప్రశ్నించిన వారిపై వైకాపా వర్గీయులు భగ్గుమంటున్నారు. దాదాపు ఐదు లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చామని, మరో లక్షన్నర సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు. రూ.5వేలు ఇచ్చే ఉద్యోగం కూడా ఉద్యోగమేనా..అని ప్రశ్నించిన వారికి  జైలు గదులే..నివాసాలవుతున్నాయి. ప్రశ్నించిన వారినందరినీ జైలుకు పంపడమో లేక కుల ముద్ర వేయడమో..చేస్తోన ‘జగన్‌’కు వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని, సోదర తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారికి అక్కడి నిరుద్యోగులు చుక్కలు చూపించారని, ఇక్కడ అంతకన్నా..ఎక్కువే ఉంటుందని వారు చెబుతున్నారు. కెసిఆర్‌కు తెలంగాణ నిరుద్యోగులు కేవలం షాక్‌ మాత్రమే ఇచ్చారని, ఇక్కడ మాత్రం ‘జగన్‌’కు చుక్కలు చూపిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ