లేటెస్ట్

తండ్రి సిఎంఒ అలా...తనయుడి సిఎంఒ ఇలా...!

తండ్రీ, తనయుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భాలు చాలా తక్కువ. అటువంటి అరుదైన సందర్భం ఆంధ్రాలో వచ్చింది. దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేసి, పదవిలో ఉండగా హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు. తరువాత ఆయన తనయుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా పార్టీ స్థాపించి..అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కాగలిగారు. తండ్రి ఆశయాలను నెరవేర్చడమే తన ధ్యేయమని, పేదలకు తన తండ్రి ఎటువంటి సేవలు అందించారో అటువంటి సేవలనూ తాను అందించి తండ్రి పక్కన తన ఫొటో పెట్టుకునే విధంగా పరిపాలిస్తానని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పలు సందర్భాల్లో పేర్కొంటున్నారు. గతంలో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆయనకు రాజకీయంగా అపారమైన అనుభవం ఉంది. అయితే అధికారిక అనుభవం మాత్రం అంతంత మాత్రమే. అప్పుడెప్పుడో మంత్రిగా పనిచేశారు. తరువాత..ఆయన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులకు అసమ్మతినేతగా రాజకీయాలు నడిపేవారు. అధికారికంగా ఎటువంటి పదవులు నిర్వహించకపోయినా...తాను ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. నాడు ముఖ్యమంత్రిగా వై.ఎస్‌ సమర్థంగా పనిచేశారంటే నాడు ఆయన ఏర్పాటు చేసుకున్న సిఎంఒనే కారణం. నాటి సిఎంఒ ముఖ్యమంత్రి వై.ఎస్‌ ఆశయాలకు అనుగుణంగా, సమర్థవంతంగా, వేగంగా పనిచేస్తూ..వై.ఎస్‌కు మంచి పేరు ప్రతిష్టలను తెచ్చి పెట్టింది.

నాడు వై.ఎస్‌ సిఎంఒలో సమర్థులైన, నిజాయితీపరులైన అధికారులను నియమించుకున్నారు. అనుభవం ఉన్న సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులను, యువకులను తన సిఎంఒలో నియమించుకున్నారు. సిఎంఒ ఇన్‌ఛార్జిగా నిజాయితీపరుడైన 'జన్నత్‌హుస్సేన్‌'ను నియమించుకున్నారు. ఆయన తరువాత 'సుబ్రహ్మణ్యం,' భాను, ప్రభాకర్‌రెడ్డి, లవ్‌అగర్వాల్‌ వంటి సమర్థులు, వేగంగా పనిచేయగలిగిన వారిని నియమించుకుని ప్రభుత్వ పథకాలను పరుగులు పెట్టించగలిగారు. నాడు వై.ఎస్‌ హయాంలో చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు వేగంగా చేరగలిగాయంటే...సిఎంఒ సమర్థతే కారణం. వై.ఎస్‌. సూచించిన విధంగా వారు...ఆగమేఘాలపై అధికారయంత్రాంగంతో పనిచేయించారు. వారు పనిచేస్తూ..అధికారులతో పనులు చేయిస్తూ...మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ...ఐదేళ్లు అపూర్వంగా పనిచేయగలిగారు. అధికార అనుభవం పెద్దగా లేకపోయినా...నాడు వై.ఎస్‌...తన సిఎంఒ వల్ల..ప్రజలకు చేరువ కాగలిగారు. అదే సమయంలో పరిపాలనపై తనదైన ముద్ర వేయగలిగారు. ఐదేళ్ల తరువాత..రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఎదురయినా...కాంగ్రెస్‌ను ఒంటి చేత్తో...వై.ఎస్‌.మళ్లీ గెలిపించగలిగారంటే...అందులో మెజార్టీ భాగం సిఎంఒకే చెందుతుంది. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో నాడు సిఎం ప్రెస్‌సెక్రటరీగా వ్యవహరించిన 'చంద్రశేఖర్‌రెడ్డి' ఆగమేఘాలపై స్పందించేవారు. ప్రతిపక్షాలకు చెందిన ఏదైనా కార్యక్రమం పత్రికల్లో హైలెట్‌ అవుతుందని భావిస్తే..ఉదయమే వివిధ పత్రికల్లో మొదట పేజీలో వై.ఎస్‌. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై పుల్‌పేజీ ప్రకటనలు ఇచ్చి..ప్రతిపక్షాలకు మొదటి పేజీలో కవరేజ్‌ రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇదొక్కటే కాదు..నాడు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో, మీడియాతో లైజనింగ్‌ చేయడంలో 'చంద్రశేఖర్‌రెడ్డి' సమర్థవంతంగా వ్యవహరించి వై.ఎస్‌కు మంచిపేరు తెచ్చిపెట్టారు. 

నాటి తండ్రి సిఎంఒతో నేటి తనయుడి సిఎంఒను అప్పుడే పోల్చడం సరికాకపోయినా..మొదటి అడుగులు ఎలా వేస్తున్నారనేది విశ్లేషించుకోవాల్సిందే. ముందుగా 'జగన్‌' సిఎంఒలో ఉన్న అధికారుల సంగతి చూద్దాం. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'అజయ్‌కల్లంరెడ్డి'ని సిఎంఒగా ఇన్‌ఛార్జిగా నియమిస్తూ 'జగన్‌' నిర్ణయం తీసుకున్నారు. నిజాయితీపరుడు, మొహమాటస్తుడు అయిన 'అజయ్‌' రిటైర్డ్‌ అధికారి. తరువాత 'జగన్‌' నియమించుకున్న 'ధనుంజయ్‌రెడ్డి' కనఫర్ట్‌ ఐఐఎస్‌ అధికారి. 'జగన్‌'కు బాగా సన్నిహితుడైన 'ధనుంజయరెడ్డి' సమర్థవంతంగా పనిచేసినా...సిఎంఒలో మరింతంగా పనిచేయాల్సి ఉంటుంది. ఆయన తరువాత 'మురళీ'ని సిఎంఒలో నియమించుకున్నారు. ఆయన ఇటీవలే రిటైర్‌ అయిపోయారు. కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తోన్న 'పి.వి.రమేష్‌'ను రాష్ట్రానికి తెచ్చుకుని సిఎంఒలో 'జగన్‌' నియమించారు. ఈయన వలన సిఎంఒలో విభేదాలు వచ్చాయంటున్నారు. ఆయన రిటైర్‌ అయిన తరువాత మళ్లీ సిఎంఒలో నియమించారు. ఈయన కాకుండా 'శ్యామ్యూల్‌'ను సిఎంఒలో పెట్టుకున్నారు. 'శ్యామూల్‌' కూడా రిటైర్‌ అధికారే. సిఎంఒలో ఉన్న మరో అధికారి 'సల్మాన్‌ ఆరోక్యరాజ్‌'. ఈయన నేరుగా ఐఎఎస్‌ అయినా సిఎంఒలో అంతగా ప్రాధాన్యత లేదు. మొత్తం మీద సిఎంఒలో ఆరుగురు ఉంటే వీరిలో నలుగురు రిటైర్డ్‌ అధికారులే. వీరు కాకుండా ఉన్న మిగతా ఇద్దరు అధికారుల్లో ఒకరు కనఫర్ట్‌ ఐఎఎస్‌ అధికారి. 'ధనుంజయరెడ్డి' కనఫర్ట్‌ ఐఎఎస్‌ అయినా ఆయన సమర్థవంతంగా పనిచేస్తున్నారనే పేరు సంపాదించుకున్నారు. అయితే ఆయన ఒక్కరే సమర్థవంతంగా, వేగంగా పనిచేస్తే...సరిపోదు. మిగతా అధికారులు, సిబ్బంది పనిచేస్తేనే సిఎంఒ సాఫీగా సాగుతుంది. సిఎంఒలో పనిచేస్తోన్న అధికారుల్లో నేరుగా 'జగన్‌'తో ఉండేది 'ధునంజయరెడ్డే'. అయితే ఆయన పనిభారంతో అల్లాడుతున్నారని, ఆయనకు తోడుగా ఉండేవారు పెద్దగా లేదని ప్రచారం జరుగుతోంది. వేగంగా, పారదర్శకంగా పనిచేసే యువకులను, 'జగన్‌' ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే తపన ఉన్న అధికారులను సిఎంఒలో ఉండాలని, గతంలో తన తండ్రి ఎటువంటి వారిని సిఎంఒలో నియమించుకున్నారో..అటువంటి వారిని 'జగన్‌' నియమించుకోవాలని ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు కోరుతున్నారు. మొత్తం మీద..చూస్తే..నాడు తండ్రి సిఎంఒకు..నేటి తనయుడి సిఎంఒకు చాలా భిన్నత్వాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రిటైర్డ్‌ అయిన అధికారులను సిఎంఒలో 'జగన్‌' నియమించుకున్నా...వారి కన్నా వేగంగా పనిచేసే వారికి సిఎంఒ బాధ్యతలు అప్పచెబితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చూద్దాం..మరి ఏం జరుగుతుందో..? 

(595)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ