WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రి 'మాణిక్యం' డిస్మిస్‌...!?

రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును మంత్రి వర్గం నుంచి డిస్మిస్‌ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన తన పరిధికి మించి విమర్శలు చేస్తున్నారని..ఆయన భాష సరిగా లేదని..ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు వివాదాల్లో, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ఆయనను ఇక భరించడం కష్టమని ముఖ్యమంత్రి భావిస్తున్నారట. మంత్రిగా ఉంటూ..మొరటుభాష మాట్లాడుతూ..ఆయన వేస్తోన్న వీరంగాలు ముఖ్యమంత్రికి చిరాకు తెప్పిస్తున్నాయట. తానేం చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తూండిపోతారని..తనకు ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దల అండ ఉందని..తానేం చేసినా చెల్లుతుందనే భావనతో..మాణిక్యాలరావు ఇష్టం వచ్చినట్లు పేలుతున్నారని..ఇక ఈ అరాచకాలను తట్టుకోవడం కష్టమనే అభిప్రాయం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు..ఇతర మంత్రులు, టిడిపి వర్గాల్లో వ్యక్తం అవుతోంది. నిన్న విలేకరుల సమావేశంలో మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ..తనకు పోయేది వెంట్రుకేనని...వారికి బోడి గుండు మిగులుతుందని వ్యాఖ్యానించడం..సిఎంకు ఆగ్రహం తెప్పించిందని సమాచారం. ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారనే సంగతి మరిచి వెంట్రుకల భాష ఏమిటని..సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతే కాకుండా..టిడిపి పోతే..మరో పార్టీ తమకు రెడీగా ఉందని..ఆయన వ్యాఖ్యానించి..మంత్రి మండలి పరువు తీశారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఒకవైపు బిజెపి అధిష్టానం టిడిపితో సఖ్యతగా వ్యవహరించాలని సూచనలు ఇస్తున్నా మంత్రి మాణిక్యాలరావు మాత్రం దూకుడుగా వెళుతూ..అగ్నికి ఆజ్యం పోస్తూ పొత్తును విడగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయం స్వంత పార్టీ నేతల్లోనూ వ్యక్తం అవుతోంది.

  ఇటీవలే సెక్స్‌స్కామ్‌లో ఇరుక్కున్న 'గజల్‌ శ్రీనివాస్‌'ను బహిరంగంగా సమర్థించి అప్రదిష్టపాలైన మంత్రి మాణిక్యాలరావు...దాని నుంచి కూడా పాఠాలు నేర్చుకోలేదు. సరికదా..ఇంకా ఎక్కువ చేశారనే అభిప్రాయం ఉంది. తాడేపల్లిగూడెంలో టిడిపి నాయకులతో అనవసర వివాదాలను కొని తెచ్చుకుని..అక్కడ  సమస్యలు సృష్టిస్తున్నారని, అయినా.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వంత పార్టీ నేతలపైనే ఆగ్రహం వ్యక్తం చేసి..మాణిక్యాలరావును వెనకేసుకొచ్చారు. అయినా..ఆ సంగతిని కూడా విస్మరించి..వెంట్రుక భాష మాట్లాడడంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు మాణిక్యాలరావును తప్పించి..ఆ పార్టీ నేతలు సూచించిన మరొకరికి మంత్రి పదవి ఇవ్వాలని సిఎం తీవ్రంగా ఆలోచిస్తున్నారట. మాణిక్యాలరావును తప్పిస్తే..ఆ స్థానంలో విశాఖపట్నంకు చెందిన విష్ణుకుమార్‌రాజుకు మంత్రి పదవి ఇద్దామనే ఆలోచనతో..సిఎం ఉన్నారట. బిజెపి పెద్దలకు ఓ మాట చెప్పి..మాణిక్యాలరావును తొలగిస్తారా..? లేక..తనంతట తానే నిర్ణయం తీసుకుంటారా..? అనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా పరిధి దాటి మాట్లాడిన 'మాణిక్యాలరావు'పై త్వరలో వేటు పడడం ఖాయమని తెలుస్తోంది.

(917)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ