బిజెపి పెద్దలు సంతృప్తి చెందారా...!?
రాజ్యసభ ఉప ఎన్నికల్లో రాష్ట్రం నుండి బిజెపికి ఓ సభ్యుడు ఎన్నిక అవడంపై బిజెపి పెద్దలు సంతృప్తి చెందుతున్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలో వైకాపా నుంచి ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్యలు ఇటీవలే తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అయితే..ఈ రాజీనామా వెనుక పెద్ద కథే నడిచింది. వాస్తవానికి ఈ ముగ్గురిలో మోపిదేవి వెంకటరమణే వైకాపా, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఆయన ఆలోచనను టిడిపి నేతలు పసికట్టారు. వీరు వెంటనే ఆయనను సంప్రదించారు. తనకు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి లేదని, తనకు రాష్ట్రంలో ప్రాధాన్యత ఇస్తే..రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన వారికి తెలియచేశారు. దీంతో..టిడిపి పెద్దలు రంగంలోకి దిగి..ఆయనకు హామీ ఇచ్చారు. ఇక అక్కడితో కథ అయిపోయేది. కానీ..రాజ్యసభలో అసలే సభ్యత్వం లేని టిడిపి పెద్దలు వైకాపా సభ్యుల్లో ఇంకా ఎవరు రాజీనామా చేస్తారనే దానిపై ఆరా తీశారు. దీంతో..బీదమస్తాన్‌రావు రాజీనామా చేస్తారని, అయితే..ఆయనకు మళ్లీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలనే మెలికపెట్టారు. వైకాపాను ఢిల్లీస్థాయిలో బలహీనం చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన పెట్టిన షరతుకు టిడిపి పెద్దలు ఓకే అన్నారు. దాంతో..బీద రాజీనామా జరిగిపోయింది. వీళ్లద్దరి తరువాత..వైకాపాలో పలువురు రాజీనామాలు చేస్తారని ప్రచారం జరిగింది. అయితే..వాస్తవంలో మాత్రం అది జరగలేదు. దీంతో..టిడిపి పెద్దలు..మళ్లీ వారిపై దృష్టిపెట్టారు. అయితే..ఈసారి ఆర్.కృష్ణయ్య రాజీనామా చేస్తానని వారికి తెలియజేశారు. దీంతో టిడిపి పెద్దలు సంబరపడ్డారు. ఆర్.కృష్ణయ్య రాజీనామా చేస్తే..ఆయన స్థానంలో ఎవరికో ఒకరిని ఎంపిక చేయవచ్చనే భావన వారిలో ఉంది. అయితే..ఇక్కడే తిరకాసు ఉంది. వైకాపా సభ్యులతో రాజీనామా చేయించుకుని, తమ పార్టీలో చేర్చుకుంటుంటే..మోడీ, అమిత్‌షాలు చూస్తూ ఊరుకుంటారా....? అసలే బిజెపికి రాజ్యసభలో మెజార్టీ లేదు. దీంతో..తమకూ ఓ రాజ్యసభ సభ్యుడిని ఇవ్వాలని, లేకుంటే..ఏమి జరుగుతుందో తెలుసుకదా..అన్నట్లు టిడిపి పెద్దలను హెచ్చరించారు. దీంతో..టిడిపిపెద్దలు ఆర్.కృష్ణయ్యను వారి ఖాతాలో ఏసేశారు. అయితే..ఇక్కడే పవన్ నొచ్చుకున్నారు. మూడు సీట్లు వస్తే..తలా ఒకటి పంచుకోవాలి కదా..? మరి నాకేది..అనగా..బిజెపి పెద్దలతోమాట్లాడుకోవాలని వారు ఆయనకు సూచించారు. దీంతో పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినా పని జరగలేదు. ఈ పరిస్థితుల్లో పవన్‌ను బుజ్జగించేందుకు ఆయన సోదరుడిని మంత్రిని చేస్తామని చెప్పేశారు. దీంతో..ఆయనా సంతృప్తి చెందారు. రాజ్యసభలో ఒక్కసీటు కూడా లేని ఆయా పార్టీలు..వైకాపాకు చెందిన వారితో రాజీనామా చేయించి, పంచేసుకున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారంలో..అటు టిడిపి, ఇటు బిజెపి, మరోపక్క జనసేనలు కూడా లాభపడ్డాయి. నైతికవిలువలు ఎటుపోయినా..రాజ్యసభలో పార్టీకి ప్రాతినిధ్యం దక్కిందనేదే టిడిపికి సంతృప్తి పడే అంశం. ఇది ఇలా ఉంటే..8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బిజెపి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనాయాసంగా రాజ్యసభ సీటు కొట్టేసింది. మొత్తం మీద వైకాపా సభ్యులను పంచుకునే విషయంలో..టిడిపి, బిజెపిలు పూర్తిగా సంతృప్తి చెంది ఉంటాయి. ముఖ్యంగా ఢిల్లీ పెద్దలు మరింత ఖుషీగా ఉండి ఉంటారు. ఎమ్మెల్యేలే లేని చోట..రాజ్యసభ దక్కితే..ఆ మాత్రం ఆనందం ఉంటుంది. అది సహజం కదా...!?