WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సతీష్‌చంద్ర'కు మద్దతు తెలిపిన ఐఎఎస్‌ల సంఘం...!

సిఎంఒ కార్యాలయ ఇన్‌ఛార్జి 'సతీష్‌చంద్ర'కు రాష్ట్ర ఐఎఎస్‌ల సంఘం మద్దతు తెలిపింది. ఇటీవల వైకాపా రాజ్యసభసభ్యుడు 'విజయసాయిరెడ్డి' సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి 'సతీష్‌చంద్ర'ను బెదిరించిన విషయం తెలిసిందే. ఆయన బెదిరింపులపై ఐఎఎస్‌ల సంఘం నిరసన వ్యక్తం చేస్తూ...నిజాయితీగా పనిచేస్తోన్న అధికారులపై విమర్శలు, ఆరోపణలు చేయటం తగదని..మండిపడింది. అధికారులపై రాజకీయపార్టీలు అసత్య,నిరాధారణ ఆరోపణలు చేయటం తగదని, ప్రభుత్వ అధికారులు తమ కేటాయించిన పనులు చేసుకుంటూ వెళతారని..వారిని రాజకీయాల్లోకి లాగడం సరికాదని ఐఎఎస్‌ల సంఘం కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌  ఒక లేఖను విడుదల చేశారు. పరిపాలనను సజావుగా జరిగేందుకు సీనియర్‌ ఐఎఎస్‌లు కృషి చేస్తుంటే..వారిపై ఆరోపణలు చేసి..లబ్దిపొందుదామనే ఆలోచన సరికాదని సంఘం పేర్కొంది. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి 'సతీష్‌చంద్ర', ఇంటిలిజెన్స్‌ ఐజి వెంకటేశ్వరరావులు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. తాము అధికారంలోకి వచ్చిన అరగంటలోనే..'సతీష్‌చంద్ర' అంతు చూస్తామని 'విజయసాయిరెడ్డి' హెచ్చరించారు. ఈ హెచ్చరికలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం అయింది. మొన్న ఐపిఎస్‌ల సంఘం ఈ వ్యాఖ్యలను ఖండించగా..నేడు ఐఎఎస్‌ల సంఘం ఖండించింది. 

   గత వారం రోజుల నుంచి 'సతీష్‌చంద్ర'ను బెదిరించిన అంశంపై చర్చ జరుగుతున్నా ఐఎఎస్‌ల సంఘం మౌనంగా ఉండడం పలు విమర్శలకు తావిచ్చింది. వారు ఎందుకు మౌనంగా ఉన్నారనే విషయం తెలియకపోయినా..వారెందుకు దీనిపై స్పందించలేదనే విషయంపై పలు విధాలుగా సచివాలయంలో చర్చ జరిగింది. మొత్తానికి ఈ రోజు స్పందించడంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నా..సంఘటన జరిగిన వెంటనే స్పందిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా..ఈ విషయంపై మరో ఆసక్తికరమైన వార్త సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆప్‌ ఎమ్మెల్యేలు దాడి చేసిన సంఘటనలో  అక్కడ ఐఎఎస్‌లు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించారని..దీంతో..ఇప్పుడు వీరు స్పందించారనే మాట వినిపిస్తోంది. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి అయిన 'సతీష్‌చంద్ర'ను ప్రతిపక్షనాయకులు ఇప్పుడే ఈ విధంగా వేధిస్తే..రేపు పొరపాటున ఆ పార్టీ అధికారంలోకి వస్తే...అధికారుల, ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉందని ఓ సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు.


(271)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ