WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'దళితతేజం-తెలుగుదేశం' అట్టర్‌ప్లాప్‌...!

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ కార్యక్రమం నిర్వహించినా..పూర్తి సాధికారతతో నిర్వహించి ఫలితాలు సాధిస్తారు. ఆయన అధికారంలో ఉన్నా...ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ కార్యక్రమాలను సంపూర్ణంగా నిర్వహిస్తారనే పేరుంది. గతంలో ఆయన నిర్వహించి ఏ కార్యక్రమమైనా...నాయకులకు, కార్యకర్తలకు స్ఫూర్తిని ఇస్తుంటుంది. అయితే..ఇటీవల కాలంలో ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించిన 'దళితతేజం-తెలుగుదేశం' కార్యక్రమం ఘోరంగా ఫ్లాప్‌ అయిందని...స్వంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. దళితులను పార్టీవైపు ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం అధినేత ఆశించిన స్థాయిలో జరగడం లేదు. గ్రామాల్లో.. పట్టణాల్లో..ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలన్న అధినేత ఉద్దేశ్యాన్ని నాయకులు నీరుగారుస్తున్నారు. చంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నా..నాయకులు ప్రజల వద్దకు వెళ్లలేక పోతున్నారు. ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాలు కూడా ఈ కార్యక్రమం విఫలం కావడానికి ఒక కారణమని భావిస్తున్నా..పూర్తిగా అదే కారణమని చెప్పలేం. అధికారంలో ఉన్న నాయకులు..ఈ కార్యక్రమంపై ఉదాశీనంగా ఉండడం ఈ కార్యక్రమం ప్లాప్‌ అవడానికి ప్రధాన కారణం.

   గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున వైకాపాకు మద్దతు ఇచ్చిన ఎస్సీల మద్దతు చూరగొనడానికి ప్రారంభించిన 'దళితతేజం-తెలుగుదేశం' కార్యక్రమం మొదట్లో ఉత్సాహంగానే ప్రారంభమైంది. ఎస్సీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధికి చేస్తోన్న కార్యక్రమాలను వివరించగలిగారు. అయితే..రాను రాను..కార్యక్రమంపై వారికి ఆసక్తి తగ్గిపోయింది. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీనిపై దృష్టి పెట్టకపోవడమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే...ఇంకా 17 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమే కాలేదు. ఆశ్చర్యకరంగా వీటిలో కొన్ని ఎస్సీ నియోజకవర్గాలే ఉన్నాయంటే..ఈ కార్యక్రమం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరిగినా..దీనిలో ఎస్సీల పాత్ర నామ మాత్రంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. అంతే కాకుండా కార్యక్రమం నిర్వహించిన చోట..ఎస్సీలను అవమానించారని ప్రచారం జరుగుతోంది. సభ నిర్వహించే చోట..ఎస్సీలను క్రింద కూర్చోబెట్టి..నాయకులు స్టేజీలపై ఉన్నారని పలువురు ఎస్సీ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే కాకుండా..ఈ కార్యక్రమం నిర్వహణ కోసం కనీసం పోస్టర్లు ముద్రించడానికి కూడా నిధులు ఇవ్వలేదని కొంత మంది ఎస్సీ నాయకులు చెబుతున్నారు.

ఎస్సీ కార్యక్రమానికి ఓసీ కోఆర్డినేటరా...!?

ఎస్సీలను పార్టీ వైపు ఆకర్షించడానికి నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఓసీ కులానికి చెందిన  వ్యక్తిని కో ఆర్డినేటర్‌గా నియమించారని...ఆయన వల్లే..ఈ కార్యక్రమం విఫలమైందనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఒంటెత్తు పోకడలతో..కార్యక్రమాన్ని రసాభాసాగా మార్చారనే అభిప్రాయం ఆయా వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా..ఎస్సీలను పరిగణలోకి తీసుకోకుండా..ఆయన ఇష్టం వచ్చినట్లు కార్యక్రమాన్ని రూపొందించి..అమలు చేశారని..దీనిలో ఎస్సీల సలహాలు కానీ..వారి భాగస్వామ్యం కానీ పెద్దగా లేదనే విమర్శలు వస్తున్నాయి. తాను అధినేత చంద్రబాబుకు, ఆయన కుమారునికి సన్నిహితుడిని అనే అహంకారంతో ఆయన ఎవరినీ లక్ష్యపెట్టకుండా వ్యవహరిస్తున్నారని..దీంతో.. ఎస్సీ నాయకులు..ఈ కార్యక్రమంలో మనస్ఫూర్తిగా పాల్గొనలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. కాగా..ఇప్పటికైనా...ఈ కార్యక్రమాన్ని దారిలో పెట్టడానికి అధినేత చంద్రబాబు రంగంలోకి దిగాలని ఎస్సీ నాయకులు కోరుకుంటున్నారు.

ఇప్పటికైనా మించిపోయింది లేదు...!

'దళితతేజం-తెలుగుదేశం' విజయవంతం చేయడానికి ఇప్పటీకీ అవకాశం ఉందని..పార్టీలో సిన్సియర్‌గా పనిచేసే ఎస్సీ నేతలు చెబుతున్నారు. నాయకులందరినీ కూర్చోబెట్టి..నూతన కార్యక్రమాలను డిజైన్‌ చేసి..వారికి లక్ష్యాలను నిర్దేశించాలని...అదే సమయంలో ఎస్సీలకు చెందిన వారిని కోఆర్డనేటర్‌గా నియమించాలని వారు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 52 లక్షల మంది ఎస్సీ జనాభా ఉందని..వారిలో 30 లక్షల మంది మాలలు ఉండగా..మరో 22 లక్షల మంది మాదిగలు ఉన్నారని..వీరందరినీ చైతన్యం చేయడానికి..ఇంటింటికి పార్టీ శ్రేణులు వెళ్లాలని వారు సూచిస్తున్నారు. అంతే కాకుండా..'దళితతేజం-తెలుగుదేశం' కార్యక్రమం సందర్భంగా ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని..అప్పుడే వారిలో విశ్వాసం వ్యక్తం అవుతుందన్న సూచన పార్టీ వర్గాల నుంచి వస్తోంది. అంతే కాకుండా..ఎస్సీ వర్గీకరణపై 'వైకాపా' అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను కూడా వాడుకోవాలని..దాని ద్వారా..మరి కొంత మంది ఆకర్షించడానికి అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. మొత్తం మీద..కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని..మరి  నాయకులు దీన్ని ఎలా ఉపయోగించుకుంటారో.. లేక వదిలేస్తారో చూడాల్సి ఉంది.

(566)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ