‘టిడిపి’లో చేరిన ‘కన్నా’
సుధీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉండి, తరువాత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేడు టిడిపిలో చేరారు. ఈరోజు ఆయన మంగళగిరిలోని టిడిపి కేంద్రకార్యాలయంలో టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. గత కొంత కాలంగా ఆయన టిడిపిలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే మధ్యలో కొన్నాళ్లు ఆయన ‘జనసేన’లో చేరతారని గట్టిగా ప్రచారం జరిగింది. అయితే అటువంటిదేమీ లేకుండా ఆయన టిడిపిలో చేరారు. వాస్తవానికి గతంలో ఆయనను ‘బిజెపి’ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించినప్పుడే ఆయన ‘టిడిపి’లోకి వస్తారని వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో అది జరగలేదు. ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన ఈ చేరిక ‘టిడిపి’కి ఉత్సాహాన్ని ఇచ్చేది. కాపు సామాజిక వర్గానికి చెందిన ‘కన్నా’ గుంటూరు జిల్లాలో మంచి పట్టున్ననేత అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఆయన చురుగ్గా పనిచేశారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం హవా సాగిన ఎన్నికల్లో కూడా ఆయన గెలుపొందారు. 1989 నుంచి 2004 వరకు వరుసగా నాలుగుసార్లు ఆయన గుంటూరు జిల్లా ‘పెదకూరపాడు’ నుంచి గెలుపొందారు. ఆ తరువాత 2009లో గుంటూరు`2 నుంచి గెలుపొంది మంత్రి పదవిని చేపట్టారు. 1994 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయినా ‘కన్నా’ మాత్రం గెలవగలిగారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు. అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న ‘కన్నా’ ‘చంద్రబాబు’ను టార్గెట్ చేసుకుని రాజకీయ విమర్శలుచేసేవారు. దీంతో ‘కన్నా’ను ఎలాగైనా ఓడిరచాలనే పట్టుదలను ‘చంద్రబాబు’ పెంచుకున్నారు. ఆయన ఎంత ప్రయత్నించినా..‘కన్నా’ను ఓడిరచలేకపోయారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ బలహీనపడిన తరుణంలోనే ‘కన్నా’ ఓడిపోయారు. క్రితం ఎన్నికల్లో బిజెపి తరుపున పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. ఈ రెండుసార్లు బలహీనమైన పార్టీ తరుపున పోటీ చేయడంతో వ్యక్తిగతంగా ఆయనకు ఎంత బలం ఉన్నా అది ఎన్నికల్లో గెలవడానికి సరిపోలేదు. వ్యక్తిగత ఛరిష్మాతో పాటు అంగ, అర్థబలం ఉన్న ‘కన్నా’ ఇప్పుడు టిడిపిలో చేరడంతో ‘టిడిపి’తో పాటు ఆయనకు కూడా మంచే చేయనుంది. రాబోయే ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీ చేసినా ఆయన గెలవడం సులభమే. ఆయన చేరికతో ‘టిడిపి’కి ‘కాపు’ సామాజికవర్గం నుంచి బలమైన మద్దతు లభించబోతోంది. ఒకవైపు ‘కాపు’ సామాజికవర్గం మొత్తం ‘పవన్’ వైపు ఉంటుందనే రాజకీయవర్గాలు భావిస్తున్న సమయంలో ‘కన్నా’ వంటి కాపు నేత ‘టిడిపి’లో చేరడం ఆ పార్టీకి లాభించేదే. మొత్తం మీద అటు ‘కన్నా’కు ఇటు ‘టిడిపి’కి సమాన లాభం ఈ చేరికతో ఉండనుందనేది వాస్తవం. అయితే జాతీయపార్టీలో సుధీర్ఘకాలం పనిచేసిన ‘కన్నా’ ప్రాంతీయపార్టీ అయిన ‘టిడిపి’లో ఎలా రాజకీయాలు చేస్తారో చూడాల్సి ఉంది.