WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రాజ్యసభ ఎన్నికల్లో వైకాపాకు బిజెపి మద్దతు...!?

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే పరిస్థితి ఏమిటని నిన్నటి వరకు ఆందోళన చెందిన నాయకులకు బిజెపి నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థికి తమ పార్టీకిచెందిన ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తారని ఎమ్మెల్సీ వీర్రాజు, మంత్రి మాణిక్యాలరావులు ఓటు వేస్తామని తమ సన్నిహితులతో చెప్పుతున్నారట. వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ మాత్రం తాను వైకాపాకు మద్దతు ఇచ్చే ప్రసక్తేలేదని చెబుతున్నారట. ఎట్టి పరిస్థితుల్లో మూడో రాజ్యసభ సీటు టిడిపికి దక్కకూడదనే పట్టుదలతో 'సోము వీర్రాజు' ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణాలతోనే ఇద్దరు ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ మారతారని ప్రచారం జరిగినా..వారిని వారించడానికి ఆ పార్టీ నేతలు ఎవరూ ప్రయత్నించలేదు. మరి కొందరు ఎమ్మెల్యేలపై టిడిపి నాయకులు దృష్టిపెడుతున్నారని వైకాపా నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

  రాజ్యసభలో టిడిపి అభ్యర్థికే..బిజెపి మద్దతు ఇస్తుందని జాతీయ నాయకులు ఒక వైపు చెబుతున్నప్పటికీ 'వీర్రాజు,మాణిక్యాలరావు'లు వైకాపాకు మద్దతు ఇస్తామనే మాట ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీనికి అంగీకరిస్తారా...? అనే విషయంపై మంత్రి మాణిక్యాలరావు, వీర్రాజులు తమ సన్నిహితులైన మీడియా వర్గాలతో మాట్లాడుతూ..రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రమేయం ఉండదు..తమ సూచనల ప్రకారమే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. మాణిక్యాలరావు సొంత జిల్లాకు చెందిన నాయకులు ఇటీవల ఆయనను కలసినప్పుడు టిడిపితో మీ పొత్తు ఉంటుందా..? లేదా అన్న ప్రశ్నకు తాము దాన్ని లెక్కచేయడం లేదు..మాతో పొత్తును టిడిపి వదులుకోదు. మరి కొంత కాలం వేచి చూడండి..మా తడాఖా చూపిస్తాం..అన్నారట. ఈ విషయాన్ని అధికారపార్టీకి వారు చేరవేయటం జరిగింది. ఏది ఏమైనా తమ పార్టీ అభ్యర్థి తప్పకుండా విజయం సాధిస్తారని, సమయం వచ్చినప్పుడు తడాఖా చూపిస్తామని వైకాపా నేతలు అంటున్నారు.

(225)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ