WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కిడ్నీ రోగులను ఆదుకుంటాం: కలెక్టర్‌ లక్ష్మీకాంతం

కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న వారందరినీ ఆదుకుంటామని జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం వారికి భరోసా ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు పలువురు కిడ్నీ జబ్బులతో బాధపడుతూ మరణిస్తున్నారని..వారిని ఆదుకోవాలని పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించిన జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఆ ప్రాంతాలను సందర్శించి రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రక్షిత తాగునీరు అందిస్తామని, అదే విధంగా కిడ్నీ జబ్బులతో బాధపడేవారికి వైద్యసహాయం చేస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటికి జిల్లా వైద్యఆరోగ్య బృందం వెళ్లి వారి కిడ్నీ జబ్బుల గురించి తెలుసుకుంటుందని చెప్పారు. జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే 68 మంది రోగులను గుర్తించిందని వీరిలో 16మందికి విజయవాడలోని ప్రైవేట్‌ హాస్పటల్స్‌లో వైద్యం అందిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. వీరికి వైద్య సహాయం అందించడమే కాకుండా తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసినట్లు ఆయన చెప్పారు. 

  పేదలైన కిడ్నీ వ్యాధి బాధితుల కోసం నూజివీడు లేదా తిరువూరులో డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరొక డాక్టర్‌ను నియమిస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో రక్షిత మంచినీటి సౌకర్యంతో పాటు, పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా  గ్రామీణ మంచినీటి సరఫరా శాఖను పంచాయితీరాజ్‌ మరియు ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గమైన ఎ.కొండూరు ప్రాంతంలోని 19 తండాల్లో కిడ్నీ బాధితులు ఉండగా ఇక్కడ సరైన వైద్యసౌకర్యాలు లేవు. వైద్యం కోసం వీరు తమకు ఉన్న ఆస్తులను, ఇతరాలను అమ్ముకుని వైద్యం చేయించుకుంటున్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ కిడ్నీ వ్యాధి గ్రస్తులందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.

(171)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ