WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఐదుగురు సీనియర్‌ అధికారులపై వైకాపా గురి...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులైన ఐదుగురు సీనియర్‌ అధికారులపై ప్రతిపక్ష వైకాపా గురిపెట్టిందట. సదరు ఐదుగురు సీనియర్‌ అధికారులపై వరుసగా ఆరోపణలు, విమర్శలు చేస్తూ..వారిని దెబ్బతీయాలని తద్వారా...అధికారవర్గాల్లో కలకలం సృష్టించి...పాలనను ఆటంకపర్చాలనేది వారి ఆలోచనట. మొదట..సిఎంఒ కార్యాలయ ఇన్‌ఛార్జి అధికారి 'సతీష్‌చంద్ర'పై గురిపెట్టి విమర్శలు, ఆరోపణలు గుప్పించింది. తరువాత..మరో నలుగురు అధికారులపై కత్తి దూసింది. సిఎంఒ కార్యాలయ ఇన్‌ఛార్జి 'సతీష్‌చంద్ర' ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని వైకాపా రాజ్యసభ సభ్యుడు 'విజయసాయిరెడ్డి' ఆరోపించడం...దానిపై అధికారుల సంఘం ప్రతిస్పందించడంతో..మరో నలుగురు సీనియర్‌ అధికారులపై విమర్శలు గుప్పిస్తూ..దూకుడుగా వెళుతోంది. వీరంతా పాలనను గాలికివదిలేశారని, అధికారపార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ వారిని మానసికంగా దెబ్బకొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం ఆరోపణలకే కాక..వారిపై ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు కూడా చేస్తూ..వారిపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఇందులో ఇప్పటికే 'సతీష్‌చంద్ర'పై దాడిని తీవ్రంగా చేయగా..సిఎంఒ కార్యాలయ అధికారులు 'సాయిప్రసాద్‌', రాజమౌళిలపై తాజాగా విమర్శలు గుప్పించింది. అదే విధంగా ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ 'వెంకటేశ్వరరావు', రాష్ట్ర సమాచార,పౌరసంబంధాల శాఖ కమీషనర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌పై తాజాగా ఆరోపణలు గుప్పిస్తోంది. పైన చెప్పిన ఐదుగురు పరిపాలనలో కీలకమైన పాత్ర పోషిస్తుండడంతో..వారిని దెబ్బతీసి పాలనను కుంటుపడేలా..వ్యవహరించాలనేదే 'వైకాపా' ఉద్దేశ్యమని రాజకీయవర్గాలు అంటున్నాయి.

సతీష్‌చంద్ర: సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి అయిన 'సతీష్‌' 'చంద్రబాబు'కు సన్నిహితుడనే పేరుంది. గతంలో 'చంద్రబాబు' ఉమ్మడి రాష్ట్రానికి సిఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన సిఎంఒలో కీలకంగా పనిచేశారు. 'చంద్రబాబు'కు నమ్మకస్తుడైన ఆయన ఆలోచనలకు, సూచనలకు 'చంద్రబాబు' విలువ ఇస్తుంటారు. ఇటువంటి కీలక అధికారపై విమర్శలు, ఆరోపణలు చేసి..ఆయనను కట్టడి చేయాలనేది వైకాపా వ్యూహకర్తల ఉద్దేశ్యం.

సాయిప్రసాద్‌: సిఎంఒ కార్యాలయంలో ఎటువంటి హంగు,ఆర్భాటం లేకుండా...పనిచేసే అధికారిగా 'సాయిప్రసాద్‌'కు పేరుంది. ఈయన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడే...! సిఎం 'చంద్రబాబు' కొన్ని కీలకమైన విషయాలపై ఆయనపైనే ఆధారపడతారనే ప్రచారం ఉంది. దీంతో..ఈయనను దెబ్బకొట్టాలని వైకాపా భావిస్తోంది.

రాజమౌళి: ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన 'రాజమౌళి' ప్రతిభావంతుడిగా పేరుంది. సమర్థుడిగా..చెప్పిన పనిని నిమిషాలపై పూర్తిచేసే అధికారిగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఈయనపై ఆరోపణలు చేయటం కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే తప్ప వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు. పైగా నర్సరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావుకు బంధువు కావడంతో..ఆయనపై ఆరోపణలు చేస్తే..ప్రజలు నమ్ముతారనే భావనతోనే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారనే మాట వినిపిస్తోంది.

వెంకటేశ్వరరావు: ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా వెంకటేశ్వరరావు సమర్థవంతంగా పనిచేస్తున్నారనే అక్కసుతోనే వైకాపా ఆయనపై ఆరోపణలు చేస్తున్నట్లుంది. సమర్థుడైన అధికారిగా..ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సిఎంకు నివేదిస్తుండడం..వైకాపాకు మింగుడుపడడం లేదు. అందుకే ఆయనపై ఆరోపణలకు శ్రీకారం చుట్టారు. ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా ఆయన ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఇతర రాజకీయ పార్టీల పరిస్థితి, ఇతర పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తుంటారు. ఇది సహజంగా జరిగేదే...ఎవరు సిఎంగా ఉన్నా..రాష్ట్ర పరిస్థితులు, ఇతర విషయాలపై ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ సిఎంకు వివరిస్తారు. అయినా..ఆయనపై ఆరోపణలు చేస్తున్నారంటే...ఆయనపై ఒత్తిడి తెచ్చి..ఆయనను రక్షణాత్మకవైఖరికి పరిమితం చేయడానికే...!

వెంకటేశ్వర్‌: రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమీషనర్‌ ఎం.వెంకటేశ్వర్‌పై వైకాపా నాయకులు విమర్శలు గుప్పించడం..అర్థం లేని విషయమని స్వంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. సమాచార,పౌరసంబంధాలశాఖ కమీషనర్‌గా ప్రతిరోజు...సిఎం వద్దకు ఆయన వెళ్లి ఆయా పత్రికల్లో వచ్చిన విషయాలు, ఇతర ప్రసారమాధ్యమాల్లో వచ్చిన..వార్తలు వివరిస్తారు. ఇది అందరు కమీషనర్లు చేసే పనే...దీనిలో తప్పుపట్టడానికేమీ లేదు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు వెళ్లారని ఆరోపించడం కూడా పసలేనిదే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడ ఉంటే...అక్కడకు వెళ్లి...ఆ రోజు విషయాలను ఆయన వివరిస్తారు. దీనిలో వింతేముంది..ఆరోపించడానికేముంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వంత జిల్లాకు చెందిన 'వెంకటేశ్వర్‌' మొదటి నుంచి ఆయనకు సన్నిహితుడే. 'చంద్రబాబు' ఉమ్మడి రాష్ట్రానికి సిఎంగా ఉన్న రోజుల నుంచి..ఆయనతో సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే... ఆయనను డిప్యూటేషన్‌పై రప్పించుకున్నారు. పార్టీ పనిచేస్తారని విమర్శలు గుప్పించడం ద్వారా..ఆయనకు డిప్యూటేషన్‌ పొడిగించకుండా చూడాలన్నిది వైకాపా, వెంకటేశ్వర్‌ ప్రత్యర్థులు చేస్తోన్న పనిగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమ్మకస్తుడిగా ఉన్న 'వెంకటేశ్వర్‌'ను తొలగించి..వైకాపాకు రహస్యంగా సమాచారం అందించేవారిని ఆ పోస్టులో నియమింపచేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే...'వెంకటేశ్వర్‌'పై తప్పుడు ఆరోపణలకు వైకాపా నాయకత్వం పూనుకున్నట్లుంది. 

   ఏది ఏమైనా..పైన చెప్పిన ఐదుగురు సీనియర్‌ అధికారులు..చంద్రబాబుకు నమ్మకస్తులు... ఆయన హితం కోరుకునేవారే. ప్రభుత్వ అధికారులుగా ఉన్నా...తమకు నాయకత్వం వహిస్తున్న నాయకుడి శ్రేయస్సు కోరుకుంటారు. ప్రజలకుమేలు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న నాయకుడిని ప్రభుత్వ అధికారులు సమర్థిస్తే తప్పేమీ లేదు. రాష్ట్ర పాలనలో నిత్యం శ్రమిస్తూ..రాష్ట్ర పాలనపై గాడిలో పెట్టి ప్రభుత్వానికి మంచిపేరు తెస్తోన్న అధికారులపై ప్రతిపక్షం దాడి చేయడం నిజంగా దురదృష్టకరమే. ఇటువంటి నిరాధార విమర్శలు, ఆరోపణలు చేసే వారిపై అధికారపార్టీ ఎదురుదాడి చేసి కట్టడి చేసి..సమర్థులైన అధికారులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


(2056)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ