WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కఠోర శ్రమకు, క్రమశిక్షణకు నిలువెత్తు సంతకం...'చంద్రబాబు'...!

ఆయనేమీ రాజకీయ కుటుంబం నుంచి రాలేదు...! ప్రజలను ఉర్రూతలూగించే ప్రసంగాలూ చేయలేరు...పెద్ద అందగాడేమీ కాదు..ప్రజాకర్షణ శక్తీ లేదూ...ఆర్థికంగా కలిగిన కుటుంబమేమీ కాదు.. సాదా సీదా కుటుంబం...పోనీ ముఠాలు కట్టే ఫ్యాక్షనిస్టా...అంటే అదీ కాదు... మరి ఎటువంటి... ప్రత్యేకతలు లేకుండానే ఆ వ్యక్తి ప్రజాక్షేత్రంలో నాలుగు దశాబ్దాలపాటు కొనసాగగలిగారంటే...ఆ వ్యక్తికి ఉన్న అర్హతలేమిటి..? తనలో ఉన్న బలాలు,బలహీనతలు...తెలుసుకుని..కఠోరమైన శ్రమతో, కట్టుతప్పని క్రమశిక్షణతో వ్యవహరించారు కనుకే...ఆయన నలభై సంవత్సరాలు పాటు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన వయస్సు ఉన్న రాజకీయ నాయకులందరూ కనుమరుగైపోతే...ఆయన ప్రభ మాత్రం ఇంకా వెలుగొందుతూనే ఉంది. రేపటికి అంటే ఫిబ్రవరి 27 నాటికి..ఆ వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికై నలభై సంవత్సరాలు పూర్తి అవుతాయి..ఇంతకీ ఆయనెవరని.. అంటారా..? ఇంకెవరు...తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...ఆంధ్రప్రదేశ్‌ సిఎం చంద్రబాబునాయుడు.

   అభిమానులు, కార్యకర్తలు ముద్దుగా 'బాబుగారూ...' అని పిలుచుకునే 'చంద్రబాబునాయుడు' అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి...రాష్ట్ర రాజకీయాల్లో...దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కఠోరమైన శ్రమ, క్రమశిక్షణే ఆయన తన ఆయుధాలుగా మలుచుకున్నారు. తొలినాళ్లల్లో ఎస్‌యు యూనివర్శిటీ రాజకీయాల్లో ఆరితేరిన..ఆయన తన లక్ష్యాలను ముందుగానే గుర్తించారు. రాజకీయ నాయకుడిగా ఎదగాలన్న ఆలోచన వచ్చిన దగ్గర నుంచి..తన లక్ష్యంపైనే గురిపెట్టారు. యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా అరంగ్రేటం చేసిన..ఆయన..అప్పటి అగ్రశ్రేణి రాజకీయ నాయకులను తనదైన ఆలోచనలతోనూ, శ్రమతోనూ బోల్తా కొట్టించారు. తొలిసారి 1978 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. మంత్రి అయిన తరువాత నుంచి ఆయన తాను ఏ విషయంలో బలహీనంగా ఉన్నానో..ఆ విషయాలపై ప్రత్యేకశ్రద్ద పెట్టి తనను తాను మలచుకున్నారు. రాజకీయనాయకులకు అవసరమైన వాగ్ధాటి లేదని..గ్రహించి...రోజూ అర్థరాత్రి పూట..అద్దం ముందు ఒంటరిగా నిల్చుని గొంతు పగిలిపోయిందాకా...ప్రసంగిస్తూ...ప్రసంగాలను మెరుగుపర్చుకున్నారు. అదే సమయంలో వచ్చిన అవకాశాలను వడిసి పట్టుకుని...రాజకీయంగా ఎదగగలిగారు.

 తొలినాళ్లలో కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న ఆయనకు అగ్రనటుడు ఎన్టీఆర్‌..తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని చెప్పడంతోనే...మరో ఆలోచన లేకుండా ఒప్పుకుని...బంగారుబాటకు పునాది వేసుకున్నారు.రాజకీయాల్లో మాత్రం తనదైనశైలిలోనే పనిచేశారు. సంక్షోభాల సమయంలో సమర్థంగా పనిచేసి..ఎన్టీఆర్‌ మనసు దోచుకున్నారు. ఎన్టీఆర్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..కాంగేయులు చేస్తున్న అవమానాలను సహించలేక..అసెంబ్లీని బహిష్కరిస్తే....'బాబు'.. తన శ్రమతో..ఎత్తుగడలతో..కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో వారసత్వపోరు వచ్చినా..ఆయనను తోసిరాజని...స్వయంకృషితో ఎదిగి నాయకుడనిపించుకున్నారు. నాడు ఎన్టీఆర్‌తో విభేదించి స్వతంత్య్రంగా వ్యవహరించి..పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకున్నారు. రాజకీయాల్లో...ఆటుపోట్లను ఎదుర్కొన్నా..చలించక...ముందుకు సాగారు.

  ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా...రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసి హైటెక్‌ సిఎంగా పేరు తెచ్చుకున్నారు. వరుసగా రెండోసారి గెలిచి..తాను మొదటి సారి పదవిలోకి వచ్చింది...కుట్రతో కాదు..పార్టీ అభిమానుల అభిమానంతో...కార్యకర్తల కృషితో అని నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రిగా ఢిల్లీ రాజకీయాలను శాసించిన...ఆయన ఏనాడూ గొంతెమ్మ కోరికలు కోరలేదు..రాష్ట్ర శ్రేయస్సు కోసమే పనిచేసి..పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. 'బాబు'ను పడగొట్టడం ఇక సాధ్యం కాదనే పరిస్థితుల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, ఉద్యోగులు, మావోయిస్టులు...తలో చేయి వేసి...ఆయనను దించినా..ఎక్కడా కుంగిపోలేదు. మరింత ధీటైన వ్యూహాలతో కాంగ్రెస్‌ను ఢీ కొట్టారు.

 కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత...వై.ఎస్‌తో ఢీ కొట్టారు. పలుసార్లు..తనను అవమానించినా...ఎప్పుడూ పల్లెత్తిమాట..అనకుండా..తనదైనశైలిలో రాజకీయాలు చేశారు. నిండు సభలో అవమానించినా...వారి విజ్ఞతకు వదిలేసి..ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. రెండోసారి ఓడిపోయి..ఇక పార్టీ పని అయిపోయిందనుకున్న తరుణంలోనూ..సుధీర్ఘపాదయాత్ర నిర్వహించి.. మళ్లీ..అధికారంలోకి వచ్చి..శ్రమను,క్రమశిక్షణను నమ్ముకుంటే..ఫలితాలు అవే వస్తాయని నిరూపించారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే..తామేదో...దైవాంశ సంభూతులమని భావించే ఈ రోజుల్లో...40సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా ఉంటున్న ఆయన నోటి నుంచి ఎప్పుడూ ఒక పరుషమైన మాట పలకదు. ఎవరినైనా హుందగా, గౌరవంగా పలకరించే...'చంద్రబాబు'...మరిన్ని సంవత్సరాల పాటు..ప్రజలకు సేవలందించాలని...ఆంధ్రా ప్రజానీకం కోరుకుంటోంది.


(707)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ