WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిఎం కంటే మంత్రి 'నక్కా' పిఎస్‌ యమబిజీ...!

ఆయన ఓ మంత్రి వద్ద అంతరంగిక అధికారి. మంత్రి పాలనా వ్యవహారాలను చూసేందుకు ప్రత్యేకంగా నియమించుకున్నారు. మంత్రివద్దకు వచ్చే వారిని కలసి..వారు తెచ్చే అర్జీలు...ఇతర సమస్యలను మంత్రికి నివేదించడం, ఇతర సహాయాలు చేయటం ఆయన పని. అటువంటి ఆయనను కలవాలంటే గంటల కొద్ది సమయం పడుతుంది. మంత్రి పిఎస్‌ను కలవాలంటే సుమారు ఐదు గంటలుకు పైగానే సమయం పడుతుందట. ఆయనతో కానీ...మంత్రితో కానీ కలవాలంటే..ఆ రోజు పని మొత్తం వదులు కోవాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలంటే..ఏదో విధంగా కలవచ్చు కానీ...సదరు పిఎస్‌ని కలవాలంటే...ఓ రోజు మొత్తం వదులుకోవాల్సిందేనని సచివాలయానికి వచ్చే సందర్శకులు మొత్తుకుంటున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి...ఎవరా పిఎస్‌ అంటారా..? సాంఘిక సంక్షేమశాఖ మంత్రి 'నక్కా ఆనందబాబు' వద్ద పనిచేసే పిఎస్‌ వ్యవహారం సచివాలయంలో చర్చనీయాంశం అవుతోంది.

  మంత్రిని కలిసేందుకు సచివాలయంలోని ఆయన ఛాంబర్‌ వద్దకు వెళితే...ముందు పిఎస్‌ని కలవాలని అక్కడ సిబ్బంది సూచిస్తారు. పిఎస్‌ని కలిసేందుకు విజిటింగ్‌ కార్డు లేదా..కాగితంపై వచ్చిన వారి వివరాలు ఇవ్వమని సిబ్బంది కోరతారు. ఆ వివరాలు ఇస్తే..కూర్చోండి...'సార్‌' పిలుస్తారు..అంటూ సిబ్బంది చెబుతారు. ఇక చూసుకోండి..అక్కడ నుంచి మొదలౌతుంది హింస. ఎంత సేపు వేచి చూసినా...పిఎస్‌ నుంచి పిలుపు రాదు. గంట...రెండు గంటలు..మూడు గంటలు..నాలుగు గంటలు..ఐదు గంటలు..గంటలు మారుతుంటాయోమో కానీ..పిలుపు మాత్రం రాదు. ఇదేమిటి..మరిచిపోయాడేమోనని..సిబ్బంది..అడిగితే..సార్‌ పిలుస్తారు..ఆగండి..ఆయన బిజీగా అంటూ వారు రుసరుసలాడుతారు. 

  ఇదెక్కడి ఖర్మరా బాబూ...ఓ మంత్రి అంతరంగిక అధికారిని కలవడానికి ఇంత సమయమా..? అని తలుపులు తీసుకుని లోపలకు వెళదామని..ఎవరైనా ప్రయత్నిస్తే..అక్కడే ఉండే ఇద్దరు కాపాలాదారులు..వెంటనే అడ్డుకుంటారు..ఎక్కడికి వెళతారు..? సార్‌ పిలిచేవరకు కూర్చోవాల్సిందే... లేకపోతే..వెళ్లిపోండి...అంతే కానీ..లోపలికి వెళ్లవద్దు..అంటూ హుంకరిస్తారు..? ఒక చిన్నస్థాయి అధికారిని కలవాలంటే..ఇన్ని గంటలు వేచి చూడాలా..? అని వచ్చిన వారు నసుగుకుంటూ వెళ్లిపోతారు.ప్రభుత్వ అధికారి అయి ఉండి..వచ్చిన వారిని పిలిపించి...సమస్య తెలుసుకుని చేయగలిగితే  చేయటం..లేకపోతే..మాతో కాదని చెప్పి.. పంపించవచ్చు...కదా..? వ్యక్తిగతంగా ఆ అధికారిపై ఎటువంటి ఆరోపణలు లేకపోయినా..పనిచేసే తీరు ఇదేనా..? అనే మాట సచివాలయంలో వినిపిస్తోంది. మంత్రికి మంచిపేరు తేవాల్సిన అధికారి..ఈ విధంగా వ్యవహరించి మంత్రి నక్కా ఆనందబాబుకు చెడ్డపేరు తెస్తున్నారని వచ్చిన సందర్శకులు చెబుతున్నారు. ఇప్పటికైనా సదరు అధికారి తన తీరు మార్చుకుని హుందగా వ్యవహరిస్తారేమో..చూద్దాం...!


(451)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ