WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నర్సరావుపేట' నుంచి 'జీవీ' పోటీ చేస్తారా...!?

గుంటూరు జిల్లా టిడిపిలో ఇప్పుడో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరు లేక ముగ్గురు పార్లమెంట్‌ బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా నర్సరావుపేట పార్లమెంట్‌ స్థానం నుంచి ఇద్దరు సీనియర్‌ నేతలు బరిలోకి దిగాలని భావిస్తున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు ఒకరు కాగా మరొకరు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావులు. వీరు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయటం కన్నా..ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్‌కు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. వినుకొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన జి.వి.ఆంజనేయులు ఈ సారి పార్లమెంట్‌కు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారట. 

  ప్రస్తుతం వినుకొండలో ఆయనకు పెద్దగా వ్యతిరేకత లేకపోయినా..క్షేత్రస్థాయిలో మాత్రం వ్యతిరేకత కనిపిస్తోంది. రెండుసార్లు ఘనవిజయాన్ని ఆయనకు కట్టబెడితే...ఈ ప్రాంతానికి పనికి వచ్చే పని ఒక్కటీ చేయలేకపోయారనే విమర్శ నియోజకవర్గ ప్రజల నుండి వ్యక్తం అవుతోంది. వెనుక బడిన ప్రాంతమైన 'వినుకొండ' నియోజకవర్గంలో సాగునీటి, తాగునీటి సమస్య పరిష్కరించలేకపోవడం, నియోజకవర్గ కేంద్రమైన వినుకొండలో ఇంత వరకు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న  వినుకొండలో ప్రభుత్వ హాస్పటల్‌ స్థాయి పెంచలేకపోవడం, పట్టణంలోని రోడ్లు విస్తరణ, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించలేకపోవడం, నియోజకవర్గ యువతకు ఉపాధి చూపకపోవడం తదితర కారణాల వల్ల ఆయనపై లోలోన అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ విషయాలు చెప్పడానికి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మొహమాటం అడ్డువస్తోంది. నియోజకవర్గంలో ఎక్కువ మందితో బంధుత్వం ఉన్న 'జివి'కి ఆ విషయం చెప్పడానికి వారు కూడా వెనుకూ ముందాడుతున్నారు. అదే సమయంలో ఆయన స్వంతంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ఎంతో కొంత ప్రజలు లాభపడుతున్నారు.నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఆయన వల్ల మేలు పొందిన వారు ఉన్నారు. అయితే..ఈ కార్యక్రమాలు ఆయన ఎప్పటి నుంచో నిర్వహిస్తుండడంతో..ప్రజలకు అవేవీ..కంటికి ఆనడం లేదు. దీంతో..ఆయనెంత ఉపయోగపడినా..ఆయనపై లోలోన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

   నియోజకవర్గంలో ప్రస్తుతం..ఆయనకు సాటి వచ్చే నాయకుడు లేకపోవడంతో..ఎక్కువమంది బయటపడడం లేదు. ఒకవేళ ఆయనకు ధీటైన నాయకుడు కనుక నియోజకవర్గానికి వేరే ప్రాంతంనుంచి వస్తే..మాత్రం ఒక్కసారిగా పరిస్థితి మారిపోవచ్చు. దరిమిలా..'జివి' ఈ అసంతృప్తి నుంచి బయటపడేందుకు..నర్సరావుపేట పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారనే మాట వినిపిస్తోంది. నర్సరావుపేట పార్లమెంట్‌ నుంచి తాను..వినుకొండ అసెంబ్లీ నుంచి తన భార్య లేక వారసుడిని రంగంలోకి దించాలని ఆయన ఆలోచిస్తున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. కాగా..మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా నర్సరావుపేట నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారట. ఆయన పార్లమెంట్‌కు ఆయన భర్త చిలకలూరిపేట అసెంబ్లీకి పోటీ చేస్తారని జిల్లాలో మరో వర్గం ప్రచారం చేస్తోంది. ఏది ఏమైనా..నర్సరావుపేట పార్లమెంట్‌ సీటుపై ఇద్దరు టిడిపి సీనియర్‌ నాయకులు కన్నువేశారనే ప్రచారం జిల్లాలో భారీగా జరుగుతోంది.


(748)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ