WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల బలహీనతలే..బాబుకు వరం...!

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తండ్రి కీ.శే. రాజగోపాలనాయుడుకు ప్రియశిష్యుడిగా పేరు తెచ్చుకున్న 'నారా చంద్రబాబునాయుడు' అంచెలంచెలుగా ప్రస్తుతం ఉన్న స్థానానికి చేరుకోవడానికి ఎన్నో ఆటుపోట్లను, అవమానాలను ఎదుర్కొన్నారు. కొన్ని రాత్రిళ్లు నిద్రలేకుండా జీవితాన్ని గడిపారు. నేడు దేశ, విదేశాల్లో పేరు తెచ్చుకునే స్థాయికి ఎదిగారంటే...కష్టపడి పనిచేస్తే...ఎంత వరకైనా వెళ్లగలమనే ఆయన నమ్మకమే నేడు నిజమైంది. 1977 లోక్‌సభ ఎన్నికల్లో  తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని 'చంద్రగిరి' నియోజకవర్గంలో అప్పటి జనతాపార్టీ అభ్యర్థికి 6వేల ఓట్లకు పైగా మెజార్టీ వచ్చింది. తరువాత కాంగ్రెస్‌ పార్టీ చీలి ఇందిరా కాంగ్రెస్‌, రెడ్డి కాంగ్రెస్‌లుగా విడిపోగా..ఆయా పార్టీల అభ్యర్థితో పాటు, జనతా పార్టీ అభ్యర్థి కూడా రంగంలో ఉండడంతో...ఓటర్లలో చీలిక వచ్చి రెండు వేలకు పైగా ఓట్ల తేడాతో 'చంద్రబాబు' విజయం సాధించారు. అప్పటికే ఆయన పదెకరాల రైతుబిడ్డ. కేవలం రెండున్నర ఎకరాలు అనేది ఆయన వ్యతిరేకులు ప్రారంభించిన దుష్రృచారం. 

  అప్పట్లో ఆయనకు అయిన ఎన్నికల ఖర్చు రూ.70వేలు మాత్రమే...! ఆయన స్నేహితులు, సన్నిహితులు ఇచ్చిన సొమ్ము..తండ్రి వ్యవసాయం ద్వారా ఇచ్చిన బెల్లాన్ని అమ్మి..ఎన్నికల్లో విజయం సాధించారు 'చంద్రబాబు'. కలసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 'రాజగోపాలనాయుడు' ఆశీస్సులతో ప్రోద్బలంతో జిల్లా రాజకీయాల్లో తనదైన మార్కును తెచ్చుకున్నారు. ఆ తరువాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో 'చంద్రబాబు'కు మంత్రి పదవి ఇప్పించారు గురువు రాజగోపాలనాయుడు. దాంతో..అక్కడ నుండి ప్రారంభమైన ఆయన అదృష్టం..ఎన్టీఆర్‌కు బంధువు అయ్యే అవకాశం లభించింది. ఆ అవకాశమే నేడు ఆయన ఈ స్థాయికి చేరడానికి ప్రధాన కారణం. 1984లో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి పదవి కోల్పోయినప్పుడు ఎమ్మెల్యే క్యాంప్‌ నిర్వహించి..తిరిగి ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు..సుమారు నెలరోజులు నిద్రాహారాలు మాని సమయపాలన లేకుండా గడిపారు. దీంతో..ఆయనలో శక్తి,యుక్తులను స్వయంగా తెలుసుకున్న 'ఎన్టీఆర్‌' ఆ రోజే ఆయనను తన రాజకీయవారసుడిగా గుర్తించారు. 

  1985లో ఎమ్మెల్యేగా 'చంద్రబాబు'ను ఎమ్మెల్యేగా పోటీ చేయమని కోరినా..వద్దని...పార్టీ పనికోసమే తాను ఉంటానని చెప్పి..ఆయన మెప్పు పొందారు. ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహించి..అన్ని జిల్లాల వారిని ఒకచోట చేర్చి..కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించారు. అటువంటి శిక్షణా తరగతులు..జిల్లా స్థాయి నుండి మండల స్థాయికి పాకింది.అప్పట్లో..రాజకీయంగా ఆయనకు పోటీగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంత్రి పదవి కోసం తాపత్రయపడ్డారు.. ఆశపడ్డారు...తప్ప..పార్టీలో పట్టుసాధించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం 'చంద్రబాబు'కు కలసి వచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎన్టీఆర్‌ తరువాత అంతా తానే అన్నట్లు..పార్టీ కార్యకర్తలపై, ప్రభుత్వ యంత్రాంగంపై పట్టుసాధించారు. అప్పట్లో 'చంద్రబాబు'ను రాజ్యసభకు పంపాలని ఎన్టీఆర్‌ భావించినా...దానికి 'చంద్రబాబు' అంగీకరించలేదు. పార్టీపై పట్టుసాధించిన ఆయన ఎన్టీఆర్‌ తరువాత తానే అన్నట్లు అన్ని వర్గాలవారికి నమ్మకం కల్గించారు. 

  1989లో ఎన్టీఆర్‌ అధికారం కోల్పోయినప్పుడు..ఆయన సినిమాలకు పరిమితం కాగా..ఆ అవకాశాన్ని చంద్రబాబు వినియోగించుకుని పార్టీని నడిపించారు. మంత్రి పదవి కోసం 'దగ్గుబాటి' ఆశపడి..అనేకసార్లు భంగపడి..చివరకుమంత్రి పదవి పొంది మాజీమంత్రిగా మిగిలారు. తన అవకాశాలను పోగొట్టుకున్నారు. ఎన్టీఆర్‌ ద్వితీయ వివాహం చేసుకున్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకించినా...'చంద్రబాబు' మౌనంగా ఉండి...చాకచక్యంగా మెలిగి..ఎన్టీఆర్‌కు చేరువయ్యారు. ఎన్టీఆర్‌పై తిరుగుబాట చేశారు. అంతకు ముందు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల సహకారం తీసుకున్న 'చంద్రబాబు' ఎవరెవరికి ఏమి చేయాలో అది చేశారు...వారందరినీ తనవైపు మళ్లించుకున్నారు. వారి మద్దతు వల్లే ఆయన తిరుగుబాటు చేసినా..వారి నుంచి..ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా కాపాడగలిగింది. ఎన్టీఆర్‌ మరణం తరువాత..జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 'లక్ష్మీపార్వతి'ని జీరోని చేసి..సుమారు 17,18 నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ రథసారధిగా నిలిచి అప్పట్లో కాంగ్రెస్‌ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ముఖ్యపాత్ర ధారి అయ్యారు. అదృష్టవంతుడ్ని ఎవరూ ఆపలేరు..దురదృష్టవంతుడ్ని ఎవరూ కాపాడలేరన్న సామెత..చంద్రబాబు రాజకీయ జీవితంలో వాస్తవమైంది. 1998లో బిజెపి ప్రధాన అభ్యర్థి అయిన 'వాజ్‌పేయి'కి మద్దతు ఇచ్చి..లోక్‌సభ స్పీకర్‌గా బాలయోగిని చేసి మళ్లీ కేంద్రంలో పట్టుసాధించారు. 

  1999లో జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకు కూడా జరిపించి పార్టీని విజయపథంలో నడిపించి...తిరుగులేని నేతగా ఎదిగారు. అప్పట్లో ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు.. ఐటిరంగం నేడు ఇంత వేగంగా ముందుకు వెళ్లిదంటే..'చంద్రబాబు' కృషి అని ప్రతి ఒక్కరూ కొనియాడుతూనే ఉన్నారు. నిజమైన కార్యకర్తలకే అధికారం కావాలనే ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసిన 'చంద్రబాబు'..తరువాత...సిఎం అయిన 'చంద్రబాబు' ఆయా పోస్టులను భర్తీ చేయలేక పోయారు. తరువాత తటస్తులకు పోటీ చేసే అవకాశం ఇచ్చి..వారిలో కొందరిని మంత్రులను చేసి...చేతులు కాల్చుకున్నారు. తరువాత అటువంటి వారిని తెరపైకి తేనని చెప్పి...మళ్లీ అదే పనిచేశారు. 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే.. ఆరు నెలల్లో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తానని చెప్పిన 'చంద్రబాబు'..ఇంత వరకు వాటిని భర్తీ చేయలేకపోయారు. దీనిలో ముఖ్యమైన టిటిడి పాలకమండలినే నియమించలేకపోయారు. 

  కార్యకర్తలకు పదవులు ఇస్తానని మాట ఇచ్చాను..ఆ మాట నిలబెట్టుకోవాలనే మాటను మరిచిపోయారు. దీనిపై కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తం అవుతూనే ఉంది. మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి...కార్యకర్తల నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేస్తారా..? చేస్తే..ఎప్పుడు చేస్తారా..అనే విషయం ఏ ఒక్కరికీ అంతుబట్డడం లేదు.. 1996 నుంచి 2004 వరకు ప్రభుత్వంపై కానీ..పార్టీ నాయకులపై కానీ...ప్రముఖ పత్రికలు వ్యతిరేక కథనాలు ప్రచురిస్తే..వెంటనే స్పందించే వారు..విచారణకు ఆదేశించేవారు..అధికారపార్టీ నాయకులు కానీ...అధికారులను కానీ..ఆయన చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం ఆధారాలతో కథనాలు ప్రచురించినా..ఆయన పట్టించుకోవడం లేదు. ఎటువంటి విచారణలకు ఆదేశించడంలేదనే విమర్శలు ఉన్నాయి.  2004,2009 ఎన్నికల్లో ఓడిపోయినా డీలా పడకుండా..పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి ముందుకు నడిపించారు. అప్పట్లో కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నప్పుడు వారందరినీ పార్టీ మారకుండా..కాపాడుకున్నారు. రాష్ట్ర విభజనకు అంగీకారపత్రం ఇచ్చినా. .లోక్‌సభలో ఆ మోదించిన తరువాత..ఎపికి ఐదులక్షలకోట్లు ఇవ్వాలని..ఆంధ్రప్రదేశ్‌లో వ్యతిరేకత రాకుండా ముందు జాగ్రత్త తీసుకున్నారు. ఎక్కడ నారావారిపల్లె...సన్నకారు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి దేశ,విదేశీ ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నారంటే..ఆయనకు ఉన్న రాజకీయ తెలివితేటలు...కలిసి వచ్చిన అవకాశాలను అందుకోవడం, ఎవరెవరితో..ముందుకు వెళ్లాలలో తెలుసుకునే లక్షణాలు ఉన్నాయి కాబట్టే పెద్ద నాయకుడిగా ఎదగగలిగారు. 

  ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి...ఎన్నో కష్టాలుపడ్డారు..అవమానాలను భరించారు..నిద్రలేని రాత్రిళ్లు గడిపారు..రాష్ట్ర విభజన సమయంలో టిడిపి పరిస్థితి ఏమిటని ఆందోళన కూడా చెందారు. చంద్రబాబు వంటి అదృష్టవంతుడు మళ్లీ పుట్టే అవకాశం లేదు. ఆయనకు కలసి వచ్చినట్లుగా మరెవరికీ కలసివచ్చే సూచనలు కూడా కనిపించడంలేదు. ఆయనలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు సరిచేసుకుంటే...అటువంటి రాజకీయనాయకుడు మరెవరూ ఉండరని అధికారపార్టీ నాయకులు మీడియాతో చెబుతున్నారు. ఒకప్పుడు ఎటువంటి బలహీనతలు లేని 'చంద్రబాబు'..తన వారసుడిగా తన కుమారుడిని తీర్చిదిద్దేందుకు కొన్ని విషయాల్లో మౌనం వహిస్తున్నారు..మరికొన్ని విషయాల్లో బలహీనపడ్డారు. తనంత నాయకునిగా తన కుమారుడు ఎదగాలంటే..కష్టపడాల్సి ఉంటుందని బాహాటంగా చెబుతున్నారు. ఏది ఏమైనా చంద్రబాబునాయుడు వంటి రాజకీయమేధావి, అదృష్టవంతుడు..దేశవిదేశ ప్రముఖులు ప్రశంసలు పొందే నాయకుడుని ఎవరూ లేరని చెప్పవచ్చు.  

(324)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ