WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టీవీ ఛానెల్స్‌ను చూసి..రాబందులు కూడా సిగ్గుపడతాయేమో...!

ప్రముఖ సినిమా నటి 'శ్రీదేవి' అనుమానాస్పద మృతిపై దేశ మీడియాతోపాటు..రాష్ట్ర మీడియా వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో ఎవరైనా సెలబ్రిటీ స్థాయి వ్యక్తులకు సంబంధించిన వార్తల పట్ల ప్రజలకు ఆసక్తి ఉంటుంది. దానిలో సందేహం ఏమీ లేదు. వారి ఆసక్తి వల్లే...టివిల టిఆర్‌పి రేటింగులు, పత్రికలు తమ సర్యులేషన్‌ను పెంచుకుంటున్నాయి. అయితే...టిఆర్‌పి రేటింగులు, సర్యులేషన్‌ పోటీలో మీడియా సంస్థలు కొట్టుకుపోయి...ఏది ప్రసారం చేయాలో..దేన్ని అచ్చువేయాలో తెలియని స్థితిలోవ్యవహరిస్తున్నాయనే అపఖ్యాతి మీడియా రంగానికి వస్తోంది.

  ఆదివారం ఉదయం దుబాయ్‌లో ప్రముఖ నటి 'శ్రీదేవి' మృతి చెందిన వార్త రావడంతోనే..జాతీయ టీవీ ఛానెల్స్‌, ప్రింట్‌ మీడియా రెచ్చిపోయింది. టీవీ ఛానెల్స్‌ 24 గంటలు ఇదే వార్తను ఊదరగొట్టాయి...అదే సమయంలో ప్రింట్‌ మీడియా పేజీలకు పేజీలు ఆమె గురించే వార్తలు ఇచ్చింది. ఒక ప్రధాన పత్రిక తమకు ఉన్న 24 పేజీల్లో దాదాపు 20పేజీలను ఈ వార్తకే కేటాయించిందంటే... 'శ్రీదేవి' మరణవార్తకు ఎంత ప్రయారిటీ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రముఖ తెలుగుదిన పత్రిక అతిపై...దాని పాఠకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని బాటలోనే మిగతా పత్రికలు కూడా నడిచాయి. పత్రికల తీరు ఇలా ఉంటే...టీవీ మాధ్యమాలు..అయితే...మరింత రెచ్చిపోయి..అవే వార్తలను తిప్పి..తిప్పి ప్రసారం చేశాయి. 'శ్రీదేవి' మరణం ప్రజలకు ఆసక్తికల్గించేవార్తే..ఆమె ఎలా మరణించింది...అనేదీ ఆసక్తికల్గించేదే కానీ...ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఉన్నదీ..లేనిదీ..ఊహించి వార్తలు ప్రసారం చేయటం..అదే పనిగా పదే పదే ప్రసారం చేయటంపై విమర్శలు వస్తున్నాయి.


  ఒక శవం దొరికితే...దానిపై వాలే గద్దలా...'శ్రీదేవి' మృతిపై మీడియా వాలిందని ఒక ప్రముఖ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. వీరికి నిజా,నిజాలతో పనిలేదు..సంచలనమే కావాలి...! అక్కడేం జరిగిందే...వీరు చూడలేదు..కనీసం అక్కడి ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకుని కూడా ప్రసారాలు చేయలేదు. కేవలం ఊహాగానాలతో...అభూతకల్పనలతో వార్తలు వండి ప్రజలపైకి వదిలారు. చనిపోయిన వ్యక్తికి గౌరవం ఇవ్వాలన్న మాటను కూడా మరిచిపోయి..ఆమె మద్యం తాగిందని...ఇంకేదో..చేసిందని, ఆమె భర్తే హత్య చేశాడని...ఆమెకు ఇంతకు ముందే పెళ్లి అయిందని రకరకాల వార్తలతో ఊదరగొట్టారు. రాబందులకూ..మీడియా ఛానెల్స్‌కూ తేడా ఏముంది...? మీడియా..వ్యవహరించిన తీరు చూసి..రాబందులు కూడా సిగ్గుపడతాయో...అని...ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

బాత్‌టబ్‌ వార్తలు...!

 కాగా..మొన్న గుండెపోటుతో శ్రీదేవి మృతి చెందిందని ఊదరగొట్టిన ఛానెల్స్‌...నిన్న మాత్రం బాత్‌టబ్‌లో పడిపోయిందని..దుబాయ్‌ ప్రభుత్వం ప్రకటించిన తరువాత..వీరు 'బాత్‌టబ్‌' సెట్‌లు వేసి వార్తలను ప్రసారం చేశారు. 'శ్రీదేవి' బాత్‌టబ్‌లో ఎలా దిగింది...ఆమె అప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంది..గ్రాఫిక్‌ వేసీ మరీ వార్తలు ప్రసారం చేశారు. 'బాత్‌టబ్‌'లో 'శ్రీదేవి' మృతదేహం తేలుతున్నట్లు.. పక్కనే 'బోనీకపూర్‌' నిలుచుని చూస్తున్నట్లు చిత్రీకరించి తమ పాండిత్యాన్ని ఒలకపోశారు. జాతీయ ఛానెల్స్‌ దగ్గర నుంచి...రాష్ట్రంలో పేరు మోసిన ఛానెల్స్‌ అన్నీ 'బాత్‌టబ్‌'లను నిర్మించి..దానిలో రిపోర్టర్‌ను పడుకోబెట్టి...మరీ తమ వైపరీత్యాలను చాటుకున్నారు. బాత్‌టబ్‌లో ఎంత వరకు నీరుంది...దానిలో ఆమె ఎలా పడింది..అంటూ..గంటలు గంటలు సుత్తికొట్టి..వీక్షకులతో ఆడుకున్నారు. తెలుగులో తెలివి మీరిపోయిన ఛానెల్‌ కూడా అదే బాటలో నడిచి తమ పైత్యాన్ని చాటుకుంది. ఏది ఏమైనా ఈ విషయంలో మీడియా వ్యవహరించిన తీరు అత్యుత్సాహం ప్రజల నుంచి తీవ్ర విమర్శలకు కారణమైంది.


(2282)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ