WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిఆర్‌ఎస్‌తో పొత్తు...టిడిపికి నష్టమే...!?

టిడిపి జాతీయ అధ్యక్షుడు 'చంద్రబాబునాయుడు' తెలంగాణ పర్యటనలో తెలంగాణ టిడిపి నాయకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిచ్చింది. ఎన్టీఆర్‌ భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం నాయకులతో 'చంద్రబాబు' నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించాయి. పొత్తుల విషయంపై ఆయన చర్చిస్తూ...'కాంగ్రెస్‌' వంచించింది...'బిజెపి' మనతో పొత్తు వద్దన్నది...! ఇక మిగిలింది..ఉద్యమపార్టీనే...వారితో వెళ్లడంపైనే ఆలోచించాలని అన్నట్లు సమాచారం. దీనిపై రెండు రాష్ట్రాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకుల్లో విస్తృతమైన చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌,బిజెపిలతో పొత్తు లేకపోతే...ఇక మిగిలింది..టిఆర్‌ఎసే కనుక..ఆ పార్టీతో పొత్తు ఖాయమని టి.టిడిపి నాయకులు అంటున్నారు. 

   గత కొన్నాళ్లుగా తెలంగాణ తెలుగుదేశంలో కొందరు నాయకులు టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. వీరికి తోడు రెండు ప్రముఖ పత్రికలకు చెందిన యజమానులు కూడా టి.టిడిపి టిఆర్‌ఎస్‌తో కలసి వెళ్లాలని సూచిస్తున్నాయి. వారికి తోడు తెలంగాణలో 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన వ్యాపారవేత్తలు కూడా..'కెసిఆర్‌'తో కలసి వెళ్లాలని ఆయనను కోరుతున్నాయి. 'టిఆర్‌ఎస్‌'లో ఇప్పుడు ఉన్నవారిలో దాదాపు అందరూ టిడిపికి చెందిన వారేనని...ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే..స్వంత పార్టీ అన్నట్లు ఉంటుందని వారు ఎప్పటి నుంచో అంటున్నారు. కెసిఆర్‌తో పొత్తు కుదిరితే...20 నుంచి 30 సీట్లు కోరవచ్చునని..వాటిలో చాలా వరకు విజయం సాధించవచ్చని..తద్వారా రాబోయే ఎన్నికల నాటికి మరింత బలం పుంజుకోవడానికి అవకాశం ఉంటుందనివారు అధినేతకు సూచిస్తూ వస్తున్నారు. దరిమిలా..బుధవారం నాడు 'చంద్రబాబు' చేసిన ప్రకటనతో..ఇక టిడిపి, టిఆర్‌ఎస్‌ల పొత్తు ఖాయమనే సంకేతాలు..రెండు పార్టీల్లో వ్యక్తం అవుతోంది. కాగా..టిఆర్‌ఎస్‌తో పొత్తుపై..ఆంధ్రాకు చెందిన టిడిపి నాయకులు మాత్రం పెదవి విరుస్తున్నారు.

కెసిఆర్‌తో కలిస్తే నష్టపోతాం...!

2009లో టిఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని చాలా నష్టపోయామని, అప్పట్లో ఆ పార్టీతో పొత్తు లేకపోతే...తమ పరిస్థితి మరో విధంగా ఉండేది ఆ పార్టీ సీనియర్‌ నాయకులు అంటున్నారు. ఒక ప్రాంతీయ పార్టీగా...ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా లెటర్‌ ఇచ్చి...కెసిఆర్‌ వలలో చిక్కుకున్నామని..చివరకు అదే ఆ ఎన్నికల్లో ఓటమికి..తరువాత..రాష్ట్ర విభజనకు పరోక్షంగా కారణమైందని వారు వివరిస్తున్నారు. తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నా..కెసిఆర్‌ ఎత్తుల ముందు చిత్తు అవుతూ వస్తున్నామని...మళ్లీ ఆయనతో పొత్తుకు వెళితే...నష్టమే అన్న భావన ఎక్కువ మంది నాయకుల్లో ఉంది. ఇన్నాళ్లూ ఆంధ్రావారిని బండబూతులు తిడుతూ వస్తోన్న కెసిఆర్‌పై ఆంధ్రా ప్రజలకు ఇంకా కోపం తగ్గలేదని...అటువంటి వారితో పొత్తుకు వెళితే..ఆంధ్రాలో నష్టపోతామనే భావన వారిలో ఉంది. 

   అంతేకాకుండా విభజన సమస్యలను పరిష్కరించకుండా..చీటికి మాటికి పేచీలు పెడుతూ..పరోక్షంగా రెచ్చగొడుతున్న కెసిఆర్‌తో ఎలా వెళతామనే అభిప్రాయం వారిలో ఉంది. అంతే కాకుండా చపలచిత్తుడిగా...స్వార్థపరుడిగా వ్యవహరించే 'కెసిఆర్‌'తో వేగడం కష్టమని..గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, టిడిపిపై పేలిన మాటలు..అన్నీ గుర్తుకు తెచ్చుకుంటే...కెసిఆర్‌తో కష్టమే అన్న భావన వారిలో ఉంది. ఇప్పుడు కెసిఆర్‌తో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తే..ఆ ప్రభావం ఆంధ్రా ప్రజలపై గట్టిగానే ఉంటుందనే భావన ఎక్కువ మందిలో వ్యక్తం అవుతోంది. రానున్న అవసరాల కోసం..దక్షిణభారత దేశంలో 'చంద్రబాబు' బలం చూపించడానికి...కెసిఆర్‌ను సమర్థిస్తే...భవిష్యత్‌లో నష్టపోతామనే అభిప్రాయం కూడా ఉంది. మొత్తం మీద...కెసిఆర్‌తో 'చంద్రబాబు' జాగ్రత్తగా వ్యవహరించాలని...అవసరం తీరిన తరువాత 'కెసిఆర్‌' ఎలా వ్యవహరిస్తారో..తమ కన్నా..తమ నేతకే బాగా తెలుసునని...అందుకే జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నామని మరో నేత అంటున్నారు. ఏది ఏమైనా...టిడిపి,టిఆర్‌ఎస్‌ల పొత్తులు గతంలో ఇరువురికి నష్టం చేకూర్చాయి..మరి రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలను రాబడతాయో..వేచి చూడాల్సి ఉంది.


(1397)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ