WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఇక్కడ 'పవన్‌'...అక్కడ 'కెసిఆర్‌'తో 'టిడిపి' పొత్తు...!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు,పొత్తులపై ఒక స్పష్టతకు వస్తున్నట్లు ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి స్పష్టం అవుతోంది. గత కొన్నాళ్లుగా బిజెపితో తెగతెంపులు చేసుకుంటామని పరోక్షంగా సంకేతాలు ఇస్తోన్న ఆయన తాజాగా...రాబోయే ఎన్నికల్లో ఎవరెవరితో పొత్తులు ఉంటాయో..అన్యాపదేశంగా చెబుతున్నారు. తన మనసులో మాటను బహిరంగంగా బయటపెట్టకుండా...సంకేతాలు మాత్రం ఇస్తున్నారు. నిన్న హైదరాబాద్‌లో జరిగిన టిటిడిపి సమావేశంలో పొత్తులు గురించి మాట్లాడుతూ... కాంగ్రెస్‌ వంచించింది...ఆ పార్టీతో పొత్తు ఉండదని...బిజెపి మనల్ని వద్దనుకుంటుందని...ఇక మిగిలింది..ఉద్యమపార్టీ అని పేర్కొన్నారు. అంటే కాంగ్రెస్‌,బిజెపిలతో పొత్తు ఉండదని స్పష్టం చేస్తూనే...టిఆర్‌ఎస్‌తో పొత్తు ఉండవచ్చని అన్యాపదేశంగా చెప్పారు. అదే విధంగా..మొన్న ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ...ఆంధ్రాలో బిజెపితో పొత్తు ఉండదని...పరోక్షంగా చెబుతూ తమతో కలసివచ్చే 'జనసేన'తో ఉండవచ్చునని సంకేతాలు ఇచ్చారు. దీంతో...ఆయన రాబోయే ఎన్నికల్లో ఎవరితో వెళ్లనున్నారో స్పష్టమైందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

  వాస్తవానికి గత కొన్నాళ్ల నుంచి ఈ పొత్తుల గురించి రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపితో తెగతెంపులు చేసుకుంటే...'జనసేన' పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకుంటుందని పార్టీ వర్గాలు అంతరంగిక సంభాషణల్లో చెబుతున్నాయి. అయితే 'పవన్‌' ప్రత్యేకహోదా విషయంలో పోరాటం చేస్తుంటే...కొన్నాళ్ల క్రితం వరకు టిడిపి ప్యాకేజీ పాట పాడింది. ఇప్పుడు మళ్లీ ప్రత్యేకహోదా కావాలని డిమాండ్‌ చేసినా..మొన్నటి వరకు టిడిపి నేతలు హోదా బదులు ప్యాకేజీ ఇచ్చినా సర్దుకుంటామని చెబుతూ వచ్చారు. కానీ...కేంద్ర పెద్దలు ఏదీ ఇవ్వకపోవడంతో..ఇక 'పవన్‌' బాటలోనే ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. బిజెపితో తెగతెంపులు చేసుకోవడం ఖాయమైన పరిస్థితుల్లో తమతో కలసివచ్చే 'పవన్‌'తో ఇక్కడ పొత్తుపెట్టుకొని 'జగన్‌'కు చెక్‌ చెప్పాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. 'పవన్‌'తో పొత్తుపెట్టుకుంటే...ఆయన సామాజికవర్గానికి చెందిన ఓటర్లు, యువతలో ఎక్కువ మంది టిడిపి,జనసేన కూటమి వైపు ఉంటారనే అభిప్రాయం ఇరుపార్టీలోనూ ఉంది. 'పవన్‌'కు 20 అసెంబ్లీ రెండు పార్లమెంట్‌ సీట్లు ఇవ్వడానికి కూడా టిడిపి నాయకులు ముందుకు వస్తున్నారు. సీట్ల సంఖ్య..పోటీ విషయాలు పక్కన పెడితే...'పవన్‌'తో పొత్తు ఇరువర్గాలకు మేలు చేస్తుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొందరలోనే..ఈ విషయం బహిరంగం కాబోతోంది.

   ఇక తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్‌తో టిడిపి పొత్తుపెట్టుకుంటుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పార్టీ బలహీనం కావడంతో..పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని కొంత మంది కోరుతున్నా..దానికి అధినేత చంద్రబాబు ఒప్పుకోవడం లేదు. పార్టీకి సంస్థాగతంగా ఇంకా బలం ఉందని..12శాతం ఓట్లను టిడిపి పొందగలదని...ఆయన చెబుతున్నారు. నిజానికి పార్టీ నాయకులు వేరే పార్టీలోకి వెళ్లినా ఇంకా కిందిస్థాయిలో పార్టీకి ఆదరణ లభిస్తూనే ఉంది. అందుకే టిడిపిపై టిఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌లు ఆసక్తి చూపిస్తున్నాయి. 'రేవంత్‌రెడ్డి' పార్టీలో ఉన్నప్పుడు...కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని గట్టిగా ఒత్తిడి తెచ్చినా..అధినేత అంగీకరించలేదు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు. తాజాగా..ఇప్పుడు...కాంగ్రెస్‌,బిజెపిలతో పొత్తు ఉండదని...అధినేత చంద్రబాబు ప్రకటించడంతో..టిఆర్‌ఎస్‌తోపొత్తు ఖాయమనే అభిప్రాయం బలంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల తరువాత అవసరాలను దృష్టిలో ఉంచుకుని 'చంద్రబాబు' టిఆర్‌ఎస్‌తో పొత్తుల కోసం సిద్ధమవు తున్నారనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణాదిలో తన మాట వినే నాయకులను తయారు చేసుకునే పనిలో భాగంగా 'బాబు' టిఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం..తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ గట్టిపోటీ ఇస్తుండడంతో..టిడిపి ఓట్లను తనవైపు తిప్పుకుంటే...తాను సులువుగా గెలవగలుతాననే భావనతో కెసిఆర్‌ ఉన్నారు. అందుకే..టిడిపితో పొత్తుకు ఆయన సంసిద్ధమయ్యారనే మాట వినిపిస్తోంది. మొత్తం మీద..ఆంధ్రాలో 'పవన్‌'తో... తెలంగాణలో 'టిఆర్‌ఎస్‌'తో టిడిపి పొత్తు పెట్టుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.


(761)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ