WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తొలిరోజే..టిడిపి ఎంపీలపై వేటు...!?

ఆంధ్రప్రజలను మోసం చేసిన 'బిజెపి'పై టిడిపి కత్తులు నూరుతూ యుద్ధానికి సిద్ధం అవుతుంటే... బిజెపి వారిపై ఎదురుదాడి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోందట. నిన్న ఉపరాష్ట్రపతి 'వెంకయ్యనాయుడు' చొరవ తీసుకుని బిజెపి అధ్యక్షుడు 'అమిత్‌షా'తో చర్చించిన సందర్భంలో తాము ఇంకేమీ చేసేది లేదని చెప్పడం...ఆ విషయాన్ని టిడిపి ఎంపీలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో నివేదించడంతో..ఒక్కసారిగా పరిస్థితి సంధి వైపు నుంచి..సమరం వైపుకు మళ్లింది. 'అమిత్‌షా' నిర్ణయం తెలిసిన తరువాత..ఇక టిడిపి కేంద్రాన్ని ఉపేక్షించేది లేదని..తాడో..పేడో తేల్వాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చింది. శుక్రవారం నాడు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్రమంత్రులు, ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సుధీర్ఘ సమావేశం నిర్వహించారు. కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిపై ఏ విధంగా పోరాడాలనే విషయంపై వారితో చర్చించారు. 

   ఈ చర్చ సందర్భంగా కొందరు పార్లమెంట్‌ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యే తొలిరోజే..రాజీనామా చేయాలని సూచించగా..సరైన సమయంలో చేయాలని మరి కొందరు సూచించారు. ఈ సందర్భంగా...మంత్రివర్గంలో కొనసాగుతూనే..ఆందోళన నిర్వహించడం..సబబు కాదని మరి కొందరు ఎంపీలు చెప్పగా..కేంద్ర మంత్రి 'అశోక్‌గజపతిరాజు' లేచి.. తాను ఇప్పుడే రాజీనామా చేస్తానని...రాజీనామాను ఎవరికి ఇవ్వాలో చెప్పండి...అని ఆయన చెప్పగా... సమావేశంలో అందరూ మౌనం వహించినట్లు తెలుస్తోంది. తాను ఇప్పుడే 'చంద్రబాబు'కు రాజీనామా ఇస్తానని...ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా చేస్తానని ప్రకటించారు. 'అశోక్‌' సంగతి తెలిసిన పార్టీనేతలు..ఆయన వైఖరిపై ప్రశంసలు కురిపించారు. కాగా..ఏ విధంగా పోరాటం చేయాలన్నదానిపై టిడిపి అధినేత ఎంపీలకు దిశానిర్దేశ్యం చేశారు. దానిపై ఇప్పటికే..తమతో కలసి వచ్చే పార్టీలకు లేఖలురాయాలని నిర్ణయించారు. అంతే కాకుండా ఆంధ్రాకు జరిగిన అన్యాయంపై... జోక్యంచేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.

   కాగా తొలిరోజు నుంచే టిడిపి పార్లమెంట్‌లో దూకుడుగా వెళ్లబోతోందని తెలుసుకున్న 'బిజెపి' కూడా అదే రీతిలో స్పందించబోతోంది. టిడిపి ఎంత దూకుడుగా వెళితే..తాముకూడా అంతే దూకుడుగా వెళతామని..స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై ఇప్పటికే బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ఇక తాము చేసేదేమీ లేదని..ఇంతేనని చెప్పడంతోనే వారు దూకుడుగా వెళతారని స్పష్టం అయింది. పార్లమెంట్‌ జరగకుండా టిడిపి ఎంపీలు అడ్డుపడితే...వారిని తొలిరోజే సస్పెండ్‌ చేయించాలని అధికారపార్టీ భావిస్తోంది. వెల్‌లోకి వచ్చిన ఎంపీలను వెంటనే సస్పెండ్‌ చేస్తూ తీర్మానం చేయాలని..దీని ద్వారా తాము..ఈ విషయంపై ఎంత కఠినంగా ఉండబోతున్నామనో..వారికి అర్థం అవుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో టిడిపికి మద్దతు ఇచ్చే పార్టీలకు కూడా తమ వైఖరిపై స్పష్టత ఇచ్చినట్లు అవుతుంది..తద్వారా టిడిపిని ఒంటరిని చేయాలనే వ్యూహాలను బిజెపి పెద్దలు రచిస్తున్నారు. మొత్తం మీద..టిడిపి సమరశంఖం పూరిస్తే..తాము యుద్ధానికి సిద్ధమేనని బిజెపి పెద్దలు...తమ మాటలతో స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా...అన్యాయం జరిగిన రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరితే...సస్పెండ్‌తో సమాధానం చెప్పడానికి బిజెపి సిద్ధం అవుతోంది. మరి ఆంధ్రా ప్రజలు ఆ పార్టీకి ఎటువంటి గుణపాఠం నేర్పుతారో..వచ్చే ఎన్నికల్లోనే స్పష్టం కానుంది.


(536)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ