‘పవన్’ కన్నా..వేగంగా...‘లోకేష్’...!
ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపధ్యంలో రాజకీయపార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం అవుతూనే తమతో కలిసివచ్చే పార్టీలు, నాయకులను తమ దరి చేర్చుకుంటున్నాయి. అధికార వైకాపా తనదైన శైలిలో ప్రతిపక్షానికి చెందిన కొందరు నేతలను తమ వైపు లాక్కుంటోంది. తమకు పనికి వస్తారనుకుంటే రెండో కంటికి తెలియకుండా పార్టీ కండువాలు కప్పుతోంది. ముఖ్యంగా బీసీ వర్గాలకు చెందిన వారిని దువ్వుతోంది. తాము బీసీలకు ఎక్కువ మేలు చేశామని, గతంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు బీసీలకు చేసిన దానికంటే తామే వారికి ఎక్కువ చేశామని, పదవుల్లో వారికి పెద్దపీట వేశామని వారిని ఆకట్టుకుంటోంది. అయితే పదవులు ఇవ్వడం ఏమిటో కానీ..వారికి అధికారం, నిధులు ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. పేరుకే పదవులు..పెత్తనమంతా ఒక వర్గానిదే అన్నమాట సర్వత్రా వినిపిస్తోంది. అయితే ఎవరేమి అనుకున్నా తాను చేయాలనుకున్న ప్రచారాన్ని అధికార పార్టీ చేసుకుంటూపోతోంది. ప్రజలు దీన్ని ఎంత వరకు నమ్ముతారో చూడాలి. ఇదిలా ఉంటే..ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేనలు పొత్తులు పెట్టుకుంటాయని, వారి పొత్తు లాంఛనమే అన్న భావన సర్వాత్రా వ్యాపించింది. అయితే..ఇటీవల కాలంలో వారి పొత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ‘జనసేన’తో పొత్తు అవసరం లేదని, ఒంటరిగానే తాము గెలుస్తామని కొందరు టిడిపి నేతలు చెబుతుండగా, ‘పవన్’కు సిఎం పదవి ఇస్తేనే పొత్తు పెట్టుకుంటామని ‘జనసేన’ వర్గాలు అంటున్నాయి. అయితే పొత్తుపై అటు ‘చంద్రబాబు’కానీ, ఇటు ‘పవన్’ కానీ నోరు విప్పడం లేదు. వారి మధ్య ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. అయితే ఇటీవల కాలంలో కొన్ని ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి.
‘బిజెపి’ మాజీ అధ్యక్షుడు ‘కన్నా లక్ష్మీనారాయణ’ హఠాత్తుగా తెలుగుదేశంలో చేరడం, ఆ తరువాత క్రియాశీలకంగా ‘టిడిపి’లో వ్యవహరించడం..ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి ‘కన్నా’ ‘బిజెపి’కి రాజీనామా చేసినప్పుడు ఆయన ‘జనసేన’లో చేరతారని ఎక్కువ మంది భావించారు. ‘జనసేన’ కూడా ఆయనను చేర్చుకోవాలని ముందుగానే..ఆ పార్టీలో ద్వితీయస్థానంలో ఉన్న ‘నాదెండ్ల మనోహర్’ను ‘కన్నా’తో చర్చించేందుకు పంపించింది. అక్కడేమి జరిగిందో కానీ..‘కన్నా’ తరువాత ‘టిడిపి’లో చేరారు. ‘కాపు’ సామాజికవర్గానికి చెందిన ‘కన్నా’ ‘జనసేన’లో ఖచ్చితంగా చేరతారని రాజకీయ పరిశీలకులు అంచనా వేయగా, వారి అంచనాలు తలకిందులు అయ్యాయి. ఆయన ఎందుకు ‘జనసేన’లో చేరలేదనే దానిపై ఇప్పుడు స్పష్టత వస్తోంది. ‘కన్నా’ ‘జనసేన’లో చేరతారనే వార్తలు రాగానే..‘టిడిపి’ జాతీయ ప్రధాన కార్యదర్శి ‘నారా లోకేష్’ వేగంగా స్పందించారట. ఆయన నేరుగా ‘కన్నా’తో మాట్లాడారట. తమ పార్టీలో చేరాలని, ఆయనకు అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇస్తామని, ఎటువంటి ఇబ్బందులు ఉండవని, అధికారంలోకి వచ్చిన తరువాత తగిన ప్రాధాన్యత ఇస్తామనే హామీ కూడా ఇచ్చారట. దీంతో ‘కన్నా’ టిడిపిలో చేరాలనే నిర్ణయం తీసుకున్నారట. ‘కన్నా’ విషయంలో ‘పవన్’ ఏ విధమైన చొరవ తీసుకోకపోవడంతో..‘కన్నా’ వంటి బలమైన నాయకుడు ‘టిడిపి’ గూటికి చేరారని, ఈ విషయంలో ‘పవన్’ కన్నా ‘లోకేష్’ వేగంగా స్పందించి మంచి ఫలితాలు సాధించారని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు అటువంటిదే మరో నాయకుడు విషయంలో జరిగింది. విజయవాడకు చెందిన ‘వంగవీటి రాధా’ విషయంలో కూడా ‘లోకేష్’ చొరవ తీసుకున్నారట. వాస్తవానికి ‘రాధా’ టిడిపిలో ఉన్నా అంత చురుగ్గా ఉండడం లేదు. ఆయన టిడిపిని వీడి ‘జనసేన’లో చేరాలని నిర్ణయించుకున్నారని, దీనికి మూహూర్తం కూడా పెట్టుకున్నారని, అయితే ‘లోకేష్’ ‘రాధా’తో మాట్లాడడం, ఆయన వెంటనే చిత్తూరులో పాదయాత్ర చేస్తోన్న ‘లోకేష్’ను కలవడం చకచకా జరిగిపోయాయి. ఈ ఇద్దరు ‘కాపు’ నాయకుల విషయంలో ‘లోకేష్’ వేగంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేశారని, అలా వేగంగా ‘పవన్’ నిర్ణయాలు తీసుకోలేక బలమైన ఇద్దరు నాయకులను వదులుకున్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ‘లోకేష్’ చాలా వేగంగా రాజకీయనిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయన తండ్రి ‘చంద్రబాబు’వలే కాకుండా..వేగంగా స్పందిస్తున్నారనే ప్రచారం టిడిపి వర్గాల్లో జరుగుతోంది.