WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రజల అసంతృప్తిని..దారి మళ్లించేందుకే...మూడో ఫ్రంట్‌..డ్రామా...!?

'కూట్లో..రాయి...తీయలేనోడు....ఏట్లో రాయి' తీస్తానని బయలుదేరిన చందంగా...తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వైఖరి ఉందని తెలంగాణకు చెందిన పౌరసమాజం,రాజకీయ నాయకులు, విజ్ఞులైన పౌరులు భావిస్తున్నారు. విభజన వాదంతో అధికారంలోకి వచ్చిన కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మరో డ్రామా మొదలు పెట్టారని వారు విమర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లల్లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేసిన ఒక్క మంచి పని చెప్పమని...అడిగితే..చెప్పడానికి ఏమీ లేదని...ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ సంపూర్ణంగా నెరవేర్చలేదని...మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన..కెసిఆర్‌...ఇప్పుడు దేశాన్ని ఉద్దరిస్తానని బయలుదేరడం...మరో.. డ్రామాగా వారు అభివర్ణిస్తున్నారు.విభజన వాదంతో..ప్రజలను రెచ్చగొట్టి...నమ్మించి...  హామీలు ఇచ్చి వాటినేవీ నెరవేర్చకుండా...రోజుకో..కబురు చెబుతూ...వస్తోన్న ఆయన తాజాగా.. ప్రత్యామ్నయం పేరుతో...గాలి కబుర్లుచెబుతూ..మరోమారు రెచ్చగొట్టి లబ్దిపొందాలనే ఆలోచనతోనే... మూడోఫ్రంట్‌ అంటూ ముందుకు వస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
హామీల్లో ఒక్కటైనా నెరవేరిందా...!?
తెలంగాణ వస్తే...దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని...ఉద్యమ సమయంలో పేర్కొన్న కెసిఆర్‌.. అధికారంలోకి రావడంతోనే...సిఎం పీఠం ఎక్కి..దళితులను వంచించారనే మాట..తెలంగాణ వ్యాప్తంగా దళితుల్లో ఉంది. దళితులకు మూడెకరాలు ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైందని వారు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా..తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం..ఇస్తానన్న ఊరించిన ఆయన ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు...? ఉద్యోగాల కోసం ఉద్యమిస్తోన్న యువతపై ఉక్కుపాదం మోపీ...జైళ్లకు పంపించడం నిజం కాదా..? ఆంధ్రా వాళ్లు తెలంగాణ ఉద్యోగాలన్నీ కొట్టేశారని ఉద్యమ సమయంలో ఆరోపించిన కెసిఆర్‌...ఇప్పుడు...ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు. దేశ వ్యాప్తంగా...రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నెంబర్‌ టూ స్థానంలో ఉంటే దాని గురించి ఎప్పుడైనా మాట్లాడారా..? పేరుగొప్ప పథకాలు ప్రకటించడం తప్ప...వాటి వల్ల నిజమైన తెలంగాణ వాదులకు ఒరిగిదేమిటో చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. హరితహారం పేరిట, మిషన్‌కాకతీయ పేరుతో..అయిన వారందరికీ నిధులు దోచిపెట్టి చోద్యం చూస్తోన్న కెసిఆర్‌...ఈ పథకాలతో ఎంత మేలు చేశారు..? తెలంగాణ వచ్చిన మరుక్షణమే తాను కాలు అడ్డంపెట్టి బీడు భూములకు నీరందిస్తానని ఇచ్చిన హామీ ఏమైంది...? ఎన్ని లక్షల ఎకరాలకు నూతనంగా నీరు ఇచ్చారో..చెప్పగలరా...? కరీంనగర్‌, వరంగల్‌ పట్టణాలను 'లండన్‌, న్యూయార్క్‌లుగా మారుస్తానన్న మాట ఏమైంది..? విశ్వనగరం హైదరాబాద్‌ పరిస్థితి ఏమిటి..? హైదరాబాద్‌ రోడ్ల గోతులు చూస్తుంటే..మురికి కూపాలు నయమన్న మాట నిజం కాదా..? నాలుగేళ్లల్లో అద్భుతాలు చేశామని...డబ్బా కొట్టుకుంటున్న కెసిఆర్‌...ఈ నాలుగేళ్లల్లో మేలు జరిగిన వర్గాలేవో చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.
కెసిఆర్‌కు అంత సీన్‌ ఉందా...?
తాను మూడో ఫ్రంట్‌ పెట్టి..దేశానికి నాయకత్వం వహిస్తానని..తనను మోసే మీడియా ముందు..తన అనుచరుల ముందు గొప్పగా కెసిఆర్‌ ప్రకటించుకున్నారు. ప్రధానిని కావాలనే ఆయన ఆలోచనను ఎవరూ తప్పుపట్టడం లేదు. కానీ...వాస్తవ పరిస్థితి ఏమిటి..? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే... ఆయన వచ్చే పార్లమెంట్‌ సీట్లు ఎన్ని..? రాష్ట్రంలో కాంగ్రెస్‌ పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తోన్న వైఖరి ఒకవైపు కనిపిస్తుండగా..దేశ వ్యాప్తంగా..కాంగ్రెస్‌కు ఊపు వస్తోన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అదే ఊపులో  తెలంగాణలో ఆ పార్టీ తక్కువలో తక్కువ 12 ఎంపీ సీట్లను గెలిచే పరిస్థితి ఉందని కేంద్ర ఇంటిలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం ఉన్న 17 సీట్లలో 1 ఎంఐఎంకి పోతే..మిగతా వాటిలో కాంగ్రెస్‌ 12 గెలుచుకుంటే..మిగిలేవి నాలుగు స్థానాలే...! ఈ నాలుగు స్థానాలతోనే...ఆయన దేశానికి నాయకత్వం వహిస్తారా...? నాలుగు ఎంపీ సీట్లు ఉన్న కెసిఆర్‌ ప్రధాని అవుతారా..? కొంత మంది మేధావులు, కుహనా పత్రికా విలేకరులు...ఆయనకు డప్పుకొడితే..కొట్టవచ్చు..కానీ...వాస్తవంగా ఆలోచిస్తే...ఇది అయ్యే పనేనా..? ఆంధ్రాలోకూడా కొంత మంది కెసిఆర్‌ ప్రకటనను చూసి...ఆహో...ఓహో అంటున్నారు...కానీ..వాస్తవాలను పరిగణలోకి తీసుకోవడం లేదు. నోరుంది..కదా...అని నోటికి వచ్చినట్లు తిట్లదండకం చదివితే..అదే హీరోయిజం అని భావించే వారికి కెసిఆర్‌ హీరోగా...మగాడిలో కనిపించవచ్చు..కానీ...ఆలోచనాపరుల దృష్టిలో అది పల్లదనమే అవుతుంది.
విశ్వసనీయతలేని నాయకుడు...!
ప్రాంతీయతత్వం రెచ్చగొట్టే నాయకుడిగా..విశ్వసనీయత లేని నాయకుడిగా..ఆయన ఇప్పటికే ఢిల్లీ వర్గాల్లో పేరుంది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో టిడిపి, ఇతర పక్షాలతో జతకట్టిన ఆయన...ఎన్నికల ఫలితాలు రాకముందే..తాను బిజెపి మద్దతు ఇస్తున్నానని ప్రకటించుకుని మొదటిసారే విశ్వసనీయత కోల్పోయారు. అదే విధంగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌తో కలసి వెళతామని...కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో గ్రూపు ఫొటోలు దిగిన ఆయన హైదరాబాద్‌ వచ్చిన వెంటనే మాటమార్చి..ఒంటరిగా పోటీ చేసి మరోసారి తన మాటలకు..చేసే పనులకు విశ్వసనీయత ఉండదని తేల్చి చెప్పారు. అటువంటి ముద్ర ఉన్న కెసిఆర్‌ ఇప్పుడు మూడో ఫ్రంట్‌కు నాయకుడట...ఆయన అడుగులకు మడుగులొత్తే..పత్రికా ప్రతినిధులు దాన్ని హైలెట్‌ చేయటం...? ప్రజలను రెచ్చగొట్టి...తెలంగాణలో అధికారం సాధించిన కెసిఆర్‌... ఇప్పుడు..మరోసారి..అదే బాటలో వెళ్లదామనే భావనతో ఉన్నారు..తప్ప వేరే ఏమీ లేదు. కొండకు వెంట్రుక వేస్తే..వస్తే..కొండ వస్తుంది..పోతే..వెంట్రుకే కదా..?ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రజల్లో తనపై వ్యక్తం అవుతున్న అసంతృప్తిని దారిమళ్లించేందుకే..ఇప్పుడీ కొత్త డ్రామాకు ఆయన తెరతీశారు.

(దావులూరి హనుమంతరావు)


(730)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ