WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పాఠశాల విద్యాశాఖలో ఇంత అవినీతా...!?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ప్రభుత్వంలో అవినీతే లేదని...ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఒకటే ప్రకటనలు గుప్పిస్తుంటారు. ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అవినీతి 'చంద్రబాబు' ప్రతిష్టను మసకబారుస్తుంటే...మరోవైపు అధికార అవినీతిని చూసి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి విషయంలో ముఖ్యమంత్రి 'చంద్రబాబు' ప్రకటనలకే పరిమితమవుతున్నారని...గట్టి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శ అధికారపార్టీ నుంచి...కొందరు సీనియర్‌ అధికారుల నుంచి వినిపిస్తోంది. అవినీతికి పాల్పడినవారిని కొందరు అమాత్యులే వెనుకేసుకొస్తున్నారని..తెలిసీ ఆయన చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తరచూ వివాదాలు, అవినీతితో మకిలమైన విద్యాశాఖను 'చంద్రబాబు' పూర్తిగా గాలికి వదిలేశారని...ఆ శాఖలో ఏం జరుగుతుందో...మంత్రికి కానీ...ముఖ్యమంత్రికానీ తెలియడం లేదని సచివాలయ వర్గాలు అంటున్నాయి. వీరిద్దరూ విద్యాశాఖను పట్టించుకోకపోవడంతో...ఆశాఖ అధికారులు చెలరేగిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో పాఠశాల విద్యాశాఖలో జరిగిన అవినీతి తీవ్ర చర్చనీయాంశమైంది.

   8,9 తరగతుల పరీక్షా పత్రాల ముద్రణ కోసం దాదాపు 22 కోట్ల రూపాయలు ఖర్చు చేసి..ఆ శాఖ సంచలనం సృష్టించింది. ఈ విషయంపై గతంలోనే 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనం ప్రచురించింది. కోటి రూపాయల ఖర్చుతో ప్రింట్‌ అయ్యే ప్రశ్నాపత్రాలను రూ.22కోట్లు ఖర్చు చేశారని అప్పటి కథనంలో పేర్కొనడంతో..సిఎంఒ కార్యాలయ అధికారులు స్పందించి దానిపై విచారణకు ఆదేశించారు. ఇదంతా జరిగి దాదాపు రెండు నెలలు పైగా అయినా..విచారణ ఒక కొలిక్కిరాలేదు. సరికదా...ఇప్పుడు..ముద్రణ కోసం వెచ్చించిన రూ.22కోట్లు చెల్లింపు పాఠశాల విద్యాశాఖకు భారంగా తయారైంది. దీంతో..విద్యాశాఖకు అనుబంధంగా ఉన్న శాఖలను నిధులు ఇవ్వాలని పాఠశాల శాఖ కోరుతోంది. ఇన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆధారాలు ఉన్నా..ఎవరిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. విచారణకు ఆదేశించామని చెబుతూనే మరో వైపు బిల్లులు చెల్లింపుకు పాఠశాలశాఖ రంగం సిద్ధం చేసింది. ఇది ఇలా ఉంటే...మరో ఆసక్తికరమైన విషయం  బయటకు వచ్చింది.

విద్యార్థుల నుంచి రూ.3కోట్లు వసూళ్లు...!?

ఒకవైపు ప్రభుత్వం ప్రశ్నాపత్రాల ముద్రణ కోసం తాము రూ.22కోట్లు ఖర్చు చేశామని..ఆ నిధులు చెల్లించాలని చెబుతుండగా...మరో వైపు ప్రశ్నాపత్రాల ముద్రణ కోసం విద్యార్థుల నుంచి మూడు కోట్ల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థుల నుంచి ప్రశ్నాపత్రాల ముద్రణ కోసం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.60/- నుంచి రూ.70/- వసూలు చేశారనే మాట వినిపిస్తోంది. ఈ వసూలు చేసిన మొత్తాలు చిన్నవిగానే ఉండడంతో..విద్యార్థులు కానీ..వారి తల్లిదండ్రులు కానీ..ఈ సొమ్ము గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ...రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థులు సంఖ్య దాదాపు 50 లక్షలకు పైనే ఉంటుంది. వీరిలో 8,9 తరగతులకు చెందిన వారు దాదాపు 8 నుంచి 9 లక్షల మంది వరకు ఉంటారు. వీరందరి దగ్గర నుంచి రూ.60/- లేదా అంత కన్నా తక్కువ వసూలు చేసినా.. అది దాదాపు మూడు కోట్ల రూపాయలకు పైగానే అవుతుంది.
ఒకవేళ పైన చెప్పిన సంఖ్య కన్నా తక్కువ వసూలు చేశారని అనుకున్న అది  కనీసం రెండు కోట్లరూపాయలకు తగ్గదు.  

   విద్యార్థుల నుంచి ప్రశ్నాపత్రాల ముద్రణ కోసం అంటూ చేసే వసూళ్లు ఈ ఏడాది కొత్తమే కాదు. ప్రతి సంవత్సరం జరిగే తంతే...కానీ...ఒక వైపు ప్రభుత్వం నుంచి రూ.22కోట్ల రూపాయలను కేటాయించి కూడా మళ్లీ విద్యార్థుల నుంచి వసూళ్లు చేయటం ఏమిటి...? ప్రభుత్వం ఇచ్చిన సొమ్మే అవినీతిపరుల పాలవగా..ఇప్పుడు విద్యార్థుల నుంచి వసూలు చేసిన సొమ్ము ఏమైందనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఈ సొమ్ము ఎవరి ఖాతాలోకి చేరింది...? ఎవరు దీనికి జవాబుదారీ..? అనేదానిపై ఎవరూ స్పందించడం లేదు. రెండు కోట్ల రూపాయల ఖర్చుతో అయ్యే ముద్రణకు రూ.22కోట్లు వెచ్చించి..అవినీతికి పాల్పడి తమ విచ్చలవిడితనాన్ని పాఠశాలవిద్యాశాఖ చూపించింది. ఇంత బాధ్యతారహితంగా, ఘోరంగా అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నా.. విద్యాశాఖ ఉన్నతాధికారులు కానీ..మంత్రి గంటా శ్రీనివాసరావు కానీ స్పందించిన పాపానపోలేదు. ఇప్పటికైనా అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని విద్యాశాఖ ప్రతిష్టను నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పాలకులు దీనిపై స్పందిస్తారో..లేదో వేచిచూడాలి.


(337)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ