WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆ ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలకు 'జగన్‌' టిక్కెట్లు ఇవ్వడా...!?

రాజకీయ చైతన్యానికి మారుపేరైన గుంటూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో వివిధ పార్టీలు తమ పార్టీల తరుపున ఎవరిని బరిలోకి దించాలనే విషయంపై అప్పుడే కసరత్తులు చేస్తున్నాయి. ముందుగా ప్రతిపక్ష వైకాపా ఈ విషయంలో దూకుడుగా వెళుతోంది. ఎవరెవరికి రాబోయే ఎన్నికల్లో సీట్లు ఇస్తామనే అంశంపై స్పష్టత ఇస్తోంది. గతంలో గుంటూరు జిల్లాలో ఆ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌ పర్యటించిన సందర్భంలోనే జిల్లాలో మొదటి టిక్కెట్‌ ప్రకటించారు. గురజాల టిక్కెట్‌ను 'కాసు మహేష్‌రెడ్డి'కి ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అదే విధంగా మరికొన్ని నియోజకవర్గాలపై స్పష్టత ఇచ్చారు. కాగా..ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో ఎవరెవరికి టిక్కెట్లు ఇస్తారనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది.

గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో వైకాపా మొత్తం 17 స్థానాలకు పోటీ చేసి ఐదు స్థానాలను గెలుచుకుంది. మాచర్ల, నర్సరావుపేట,మంగళగిరి, బాపట్ల, గుంటూరు-1 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా...వైకాపాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార టిడిపిలో చేరినా...ఇప్పటి వరకు...గుంటూరు జిల్లాలో మాత్రం ఒక్క ఎమ్మెల్యే కూడా అధికారపార్టీలో చేరకుండా.. 'జగన్‌' పరువును కాపాడారు. వీరిలో ఇద్దరు ఏ నిమిషమైనా అధికార టిడిపిలో చేరతారని ప్రచారం జరుగుతున్నా..వారు మాత్రం అదే పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు. అయితే...తాజాగా పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం ఈ ఎమ్మెల్యేలకు షాక్‌ కొట్టినంతపనైందట. ప్రస్తుతం ఉన్న ఐదుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని ఆయన చెబుతున్నారట. 

    వీరిలో రాజధాని ప్రాంతమైన 'మంగళగిరి' ఎమ్మెల్యే 'ఆళ్ల రామకృష్ణారెడ్డి' ఒకరు కాగా...మరొకరు బాపట్ల ఎమ్మెల్యే కోనరఘుపతి..ఇంకొకరు గుంటూరు-1కు చెందిన 'ముస్తాఫా'లు ఉన్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే 'పిన్నెల్లి రామకృష్ణారెడ్డి'లకు మాత్రం ఖచ్చితంగా టిక్కెట్‌ ఇస్తానని 'జగన్‌' అభయం ఇచ్చారట.  కాగా..'జగన్‌' ప్రకటన పార్టీలో సంచలనం సృష్టిస్తోంది. తాము ఎంతో కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే..తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా.. ఎలా ఉంటారని వారు ప్రశ్నిస్తున్నారట. అయితే..ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, వారికి టిక్కెట్‌ ఇస్తే వారు గెలవలేరని...తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారికి ముఖ్యమైన పదవులు ఇస్తానని 'జగన్‌' చెబుతున్నారట. తాము ఎంతో విధేయతతో పార్టీ కోసం పనిచేస్తే..తమను పక్కన పెడతారా...? అనే ఉక్రోశంతో..ఇద్దరు ఎమ్మెల్యేలు రగలిపోతున్నారట. 'జగన్‌' తమను నమ్మించి మోసం చేశారని...త్వరలో తాము కూడా ఆయనకు షాక్‌ ఇస్తామని ఇద్దరు ఎమ్మెల్యేలు చెబుతున్నారట. మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని ఆయా వర్గాలు అంటున్నాయి.

(697)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ