WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అప్పుడు...'ఏలూరి' ముద్దు...ఇప్పుడు వద్దే వద్దు...!

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో...ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు ఉన్న పరిస్థితి రేపు ఉండదు...రేపు ఉన్న పరిస్థితి తరువాత ఉండకపోవచ్చు...ఇది రాజకీయాల్లో ఉన్న అందరికీ తెలిసిన విషయమే. అయితే..ఇప్పుడు ఎందుకు ఈ సంగతి అంటారా..? చెబుతా...! గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లాలో మెజార్టీ ఓటర్లు వై.ఎస్‌.జగన్‌ నేతృత్వంలోని వైకాపా వెంట పరుగులు తీసింది. జిల్లాలో మెజార్టీ సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది. అయితే..ఒక నియోజకవర్గంలో మాత్రం..ఆ పార్టీ హవాను తట్టుకుంటూ...టిడిపి అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించగలిగారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపికి ఉన్న ఊపు..ప్రకాశం జిల్లాలో లేకపోయినా...ఆ టిడిపి అభ్యర్థి ఎంత మెజార్టీతో ఎలా గెలవగలిగారనే ప్రశ్న..రాజకీయవర్గాల్లో విస్మయంగా మారింది. ఎన్నికల తరువాత...చేసిన విశ్లేషణలో..టిడిపికి జిల్లాలో బలం లేకపోయినా...టిడిపి అభ్యర్థిపై నమ్మకంతోనే ఆ నియోజకవర్గ ప్రజలు ఆయన వెంట నడిచారని...అభ్యర్థి స్థానిక బలంతోనే పార్టీ భారీ మెజార్టీతో గెలిచిందని తేలింది. దీంతో...పార్టీలతో సంబంధం లేకుండానే వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకుంటే...ఎమ్మెల్యేగా గెలవడం సులువుగా ఉంటుందని...ఆయనను చూసిన ఇతర రాజకీయ నేతలు భావించేవారు..! ఇదంతా నాలుగేళ్ల నాటి పరిస్థితి...కానీ..ఇప్పుడు అక్కడ పరిస్థితి..మారింది. ప్రజల్లో..పట్టుసాధించి భారీ మెజార్టీతో గెలిచిన..ఆ నేతే...ఇప్పుడు తమకు వద్దని...తమ పార్టీ తరుపున వేరే నేతను బరిలోకి దించాలని కోరుతున్నారు. ఆయన తప్ప...ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా...తాము భారీ మెజార్టీతో గెలిపిస్తామని...స్థానిక ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. నాలుగేళ్లలో ఆ టిడిపి ఎమ్మెల్యేపై అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏమిటి...? ఎవరా నేత..? అంటారా..? చెబుతా...!

   ప్రకాశం జిల్లా 'పర్చూరు' నియోజకవర్గంలో గత సార్వత్రిక ఎన్నికల్లో 'ఏలూరి' సాంబశివరావు అనూహ్యంగా గెలుపొందారు. మొదటి నుంచి టిడిపికి అనుకూలమైన నియోజకవర్గమైనే పేరు ఉన్నా..2004,2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ తరుపున 'దగ్గుబాటి వెంకటేశ్వరరావు' గెలుపొందారు. అంతకు ముందు కూడా..కాంగ్రెస్‌,టిడిపిలను సమానంగా ఆదరించారు..ఇక్కడ ఓటర్లు. అయితే రాష్ట్ర విభజన తరువాత...'పర్చూరు' నియోజకవర్గంలో 'ఏలూరి' గట్టిపట్టు సాధించారు. ఆయన నియోజకవర్గంలో చేసిన సేవా కార్యక్రమాలు..యువతను ఆకట్టుకోవడం..వివిధ వర్గాలతో విస్తృతమైన పరిచయాలు పెంచుకుని 'రేసుగుర్రం'లా పరుగెత్తి ఘన విజయం సాధించారు. అప్పట్లో ఆయన విజయం పలువురు యువ ఎమ్మెల్యేలకు ఆదర్శప్రాయమైంది. ఆయనను చూసి నేర్చుకోవాలని..పలువురు సీనియర్లు ఇతర రాజకీయ నాయకులకు హితవు పలికారు. కానీ...ఈ నాలుగేళ్ల కాలంలో..అంతా తారుమారైంది. ఇప్పుడు నియోజకవర్గంలో ఆయన పేరు చెబితేనే ప్రజలు మండపడే స్థాయికి వ్యతిరేకత ప్రబలింది. ఇదేమిటి..నాలుగేళ్ల క్రితం..ఆయనంటే 'ముద్దు' అన్న ప్రజలు...నాయకులు..ఇప్పుడు వద్దే వద్దనడంపై అధినేత చంద్రబాబునాయుడు కూడా ఆశ్చర్యపోతున్నారట.

ఎందుకింత వ్యతిరేకత...?

నాలుగేళ్ల క్రితం..'ఏలూరి సాంబశివరావు'ను కలిస్తే..ఏపనైనా అయిపోతుందనే భావనతో ప్రతివారు ఆయనను కలిసేవారు. వ్యక్తిగత పనులు కానీ..ఉమ్మడి పనులు కానీ...ఆయన దృష్టికి వస్తే వెంటనే పరిష్కారమార్గం లభించేదనే పేరు ఉండేది. కానీ..ఇప్పుడా పేరు మసకబారింది. ఆయనను పార్టీ కార్యకర్తలు కానీ..నాయకులకు కానీ..సామాన్యప్రజలు కానీ..కలవాలంటే కలవలేని పరిస్థితి. నియోజకవర్గంలో జరిగే ప్రతి పనిలో ఆయన బంధువుల ప్రమేయం పెరిగిపోయిందట. ఆయన సమీప బంధువైన ఒకరు పలు విషయాల్లో జోక్యం చేసుకుని అవినీతికి పాల్పడుతున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. కాంట్రాక్టర్ల దగ్గర పర్సెంటేజీలు, అభివృద్ధి పనుల్లో అవినీతికి పాల్పడడం, దురుసుగా మాట్లాడడంతో 'ఏలూరి' ప్రభ నియోజకవర్గంలో వేగంగా క్షీణించింది. ప్రజలు ఎవరైనా ఎమ్మెల్యేను కలవాలని వస్తే..ఆయన బంధువైన వ్యక్తి..మీతో పనిలేదు..రాబోయే ఎన్నికల్లో రూ.50కోట్లు ఖర్చుపెట్టైనా..గెలుస్తాం...మీరు మమ్మల్ని ఏమీ చేయలేరని ఎద్దేవా చేస్తున్నారట. దీంతో...నియోజకవర్గంలో ఈ వ్యక్తి వ్యవహారం చర్చనీయాంశమై అది 'ఏలూరి'పై అసంతృప్తికి కారణం అవుతోంది. మొత్తంమీద..నాలుగేళ్ల నాడు 'ఏలూరే' ముద్దు...అన్న ఓటర్లు..నేడు..మాత్రం ఆయన వద్దు...అంటే వద్దు అంటున్నారట. మరి టిడిపి అధిష్టానం ఏమి చేస్తుందో చూడాలి. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్ర ఐటి, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి 'లోకేష్‌'కు 'ఏలూరి' సన్నిహితుడనే పేరు తెచ్చుకున్నారు. ఆయన అండతో తనకు టిక్కెట్‌ వస్తుందని..'ఏలూరి' ఆశిస్తున్నారట. మరి...ప్రజల్లో అంత వ్యతిరేకత కొని తెచ్చుకున్న 'ఏలూరి'కే 'చినబాబు' టిక్కెట్‌ ఇప్పిస్తాడా..? ఏమో..వేచి చూద్దాం..!

(2012)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ