WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పౌరసరఫరాలశాఖ ఎండి రాంగోపాల్‌ బదిలీ...!?

పౌరసరపరాల సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఏసీబీతో విచారణ జరిపించాలని ముఖ్య అధికారి ఒకరు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లిఖిత పూర్వకంగా తెలియజేయగా..ఆ సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు ముఖ్యకారకుడు ఎండి 'రాంగోపాల్‌'. అని...ఆయనను ఆ పోస్టు నుంచి తప్పించాలని పౌరసరఫరాలశాఖ మంత్రి 'పత్తిపాటి పుల్లారావు' ఇంతకు ముందే ముఖ్యమంత్రికి లేఖ రాసిన నేపథ్యంలో నేడో..రేపో 'రాంగోపాల్‌'ను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. గత ఆరు నెలల నుండి పౌరసరఫరాలశాఖ అవినీతిపై అనేక విధాలుగా పోరాడుతున్న మంత్రి పుల్లారావు ఆ సంస్థ ఎండిని ఏమీ చేయలేక పోయారు. సిఎంఒ కార్యాలయ అధికారి ఒకరు 'రాంగోపాల్‌'కు అండగా నిలిచారని, ఆయన అండతోనే..రాంగోపాల్‌ మంత్రిని కానీ...ఇతర అధికారులను ఖాతరు చేయడం లేదని..ఇంతకు ముందే 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనాలు ప్రచురించింది. 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' కథనాన్ని చదివిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ సంస్థలో జరుగుతున్న అవినీతిపై ఆరా తీశారు. ముఖ్యకార్యదర్శిగా ఉన్న పౌరసరఫరాల సంస్థ కమీషనర్‌ 'రాజశేఖర్‌' ఆ సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై దృష్టిపెట్టకపోవడంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి నలుగురైదుగురికి మాత్రమే తెలుసునని..మిగతావారికి తెలియకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో...సంస్థలో జరుగుతున్న అక్రమాలు బయటకు పొక్కడం లేదు. 

  అవినీతిపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పుల్లారావు లేఖరాసినా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఏసీబీతో విచారణ జరిపించాలని ముఖ్య అధికారి సిఎం దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి కదలిక లేదు. సంస్థలో జరుగుతున్న అవినీతికి తాను వత్తాసు పలకుతున్నానని, తన ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం జరగడంతో..ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి..ఎక్కడ ఈ అవినీతి తనకు చుట్టుకుంటుందోనన్న ఆలోచనతో 'రాంగోపాల్‌'ను బదిలీ చేయాలని సిఎంను కోరినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. చివరకు ఏమైందో కానీ..'రాంగోపాల్‌'ను పౌరసరఫరాల ఎండి బాధ్యతల నుండి తప్పించేందుకు రంగం సిద్ధమైంది. ఆ సంస్థ ఎండిగా మరో అధికారిని ఈ రోజే..రేపో నియమిస్తారని..అధికార వర్గాలు చెబుతున్నాయి. అవినీతిపై స్పందించేందుకు కానీ...చర్యలు తీసుకునేందుకు కానీ..నెలలు, సంవత్సరాల సమయం పట్టింది. దీనికి కారకులెవరైనా..ముఖ్యమంత్రి చంద్రబాబు, సిఎంఒ కార్యాలయ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలే బాధ్యులు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

(288)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ