WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

11మంది కెజిబివిఎస్‌ బాలికలకు 'నాసా' ఆహ్వానం...!

వాళ్లంతా అతి పేదరికం అనుభవిస్తున్న బాలికలు...! మనసులో చదువుకోవాలని కోరిక ఉన్నా.. చదువుకోలేని దయనీయ పరిస్థితి వారిది. అటువంటి వారి కోసమే ఏర్పాటు చేసిన 'కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ'లో ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తమలో ఉన్న నైపుణ్యాలను బయటకు తీశారు. బాలికల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించిన 'సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌' జి.శ్రీనివాస్‌ వారికి స్పేస్‌ గురించి శిక్షణ ఇప్పించారు. దీంతో బాలికలు  వచ్చిన అవకాశాన్ని సద్వి నియోగం చేసుకుని...ప్రతిష్టాత్మకమైన 'నాసా' నుంచి ఆహ్వానాన్ని అందుకున్నారు.  

   చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాల్లోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ విద్యార్థినులను (కెజిబివిఎస్‌) అమెరికాలోని 'నేషనల్‌ స్పేస్‌ సొసైటీ(ఎన్‌ఎస్‌ఎస్‌) ఇంటర్నేషనల్‌ స్పేస్‌ డెవలప్‌మెంట్‌ కాన్ఫరెన్స్‌(ఐసిడిసి) కార్యక్రమానికి ఆహ్వానించింది.  మే 24న అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో ఈ కార్యక్రమం జరగబోతోంది. మొత్తం 11 మంది బాలికలు ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి ఎంపికయ్యారు.  'ప్రత్యూష వెలగ, కె.రెడ్డిరాణి, స్నేహచీటిపట్టి, దివ్వ గాజుల, రోషిని షేక్‌, కె.ప్రీతి, టి.సాయిశ్రీ, ఎం.పూజ, వి.సైదాభాను, వి.అశ్విని మరియు ఎం.చెంచు లావణ్యలకు 'ఎన్‌ఎస్‌ఎస్‌'ల నుంచి ఆహ్వానం అందాయి. వార్షిక పోటీలో భాగంగా 'నాసా అమెస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ భాగస్వామ్యంతో ఎన్‌ఎస్‌ఎస్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

   ఖాళీ స్థలంలో ఉన్న మానవ నివాసాలు లేదా స్పేస్‌లో నివాస కాలనీలపై బాలికలు రూపొందించిన పోస్టర్‌ 'నాసా' పోటీలకు ఎంపికైంది. పోటీలకు ఎంపికైన విద్యార్థులను వారి టీచర్లు మరియు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో అమెరికాకు పంపుతారు. ఈ మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. 11 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విద్యాశాఖ మరియు ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా(పిఎస్‌ఐ) శిక్షణ ఇచ్చింది. బాలికలకు శిక్షణ ఇప్పించి వారిలోని సృజనాత్మకతను బయటకు తీసుకురావాలని సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.శ్రీనివాస్‌ సంకల్పించారు. ఆయన చొర తీసుకుని బాలికల కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టును తాము ఈ సంవత్సరమే ప్రారంభించామని ఇప్పటికే చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలోని కస్తూరిబా గాంధీ విద్యాలయ విద్యార్థులకు 'సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌(ఎస్‌డిఎస్‌సి), శ్రీహరి కోట వారిచే   శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. వచ్చే సంవత్సరం రాష్ట్రంలోని మిగతా 13జిల్లాల్లోనూ ..ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీలకు మొత్తం 18 ధరఖాస్తులు రాగా..వాటిలో 11 మాత్రమే 'నాసా' ఎంపిక చేసిందని 'శ్రీనివాస్‌' తెలిపారు. విజేతకు 3వేల డాలర్లను బహుకరిస్తామని ఎన్‌ఎస్‌ఎస్‌ తెలిపింది.  


(195)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ